ఈ బుడతడు సామాన్యుడు కాదు…సాహసి !

Sharing is Caring...

ఎనిమిదేళ్ల బుడతడు పర్వతారోహణలో రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇంత చిన్న వయసులో అంత సాహసం చేయడమంటే మాటలు కాదు. అతగాడెవరో కాదు. ఏపీ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి గంధం చంద్రుడు తనయుడు  గంధం భువన్ జయ్. కొద్దీ రోజుల క్రితం భువన్ జయ్ ఐరోపా ఖండంలోనే  అతి పెద్ద పర్వత శిఖరం మౌంట్ ఎల్బ్రస్‌ను అధిరోహించి చరిత్ర సృష్టించాడు.

రష్యాలో ఉన్న ఈ  మౌంట్ ఎల్బ్రస్‌శిఖరం ఎత్తు 5,642 మీటర్లు. ఐరోపా లోని  ఏడు అతిపెద్ద శిఖరాల్లో ఇది ఒకటి. ఎల్బ్రస్ పర్వతం రష్యాకు దక్షిణాన కాకసస్ పర్వత ప్రాంతంలో ఉంది.దీనికి రెండు శిఖరాలు ఉన్నాయి. పశ్చిమ శిఖరం ఎత్తైనది (5642 మీటర్లు), తూర్పుది కేవలం 21 మీటర్లు తక్కువ – 5621 మీ. రెండు శిఖరాలలో దేనిని  అధిరోహించినా  ఎల్బ్రస్ పర్వతాన్ని ఎక్కినట్టు లెక్క. 1829 లో ఎల్బ్రస్ పర్వతాన్ని మొదటిసారిగా ఖాసిరోవ్ అనే వ్యక్తి అధిరోహించారు.

అక్కడ వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మంచుగాలులు వీస్తుంటాయి. వాతావరణం ఎపుడు ఎలా మారుతుందో అంచనా వేయడం కష్టం. మంచు పర్వతాలు కాబట్టి టెంపరేచర్ ఎపుడూ మైనస్ లోనే ఉంటుంది. అలాంటి ప్రతికూల వాతావరణం లో గంధం భువన్ జయ్ సునాయాసంగా .. ఏమాత్రం భయపడకుండా ఎల్బ్రెస్ పర్వతాన్ని అధిరోహించాడు.

2021 మేలో మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన విశాఖపట్నానికి చెందిన భూపతి రాజు వర్మ, బెంగళూరుకు చెందిన నవీన్ మల్లేష్‌ లతో కలసి ఈ నెల 11న భువన్ జయ్ రష్యా వెళ్ళాడు. టెర్స్కాల్‌లోని మౌంట్ ఎల్బ్రస్ బేస్ క్యాంప్‌ను చేరుకున్నారు. 13వ తేదీకి  3,500 మీటర్లు, 15తేదీకి న 4,300 మీటర్లు, 18వ తేదీకి  మౌంట్ ఎల్బ్రస్ శిఖరాగ్రాన్ని చేరుకున్నాడు. మార్గ మధ్యంలో రాత్రిళ్ళు గుడారాల్లో విశ్రాంతి తీసుకున్నారు.

19వ తేదీన మళ్లీ టెర్స్కాల్ బేస్‌ క్యాంప్‌కు వచ్చేసారు.ఈ నెల 23వ తేదీన టీమ్‌తో కలిసి గంధం భువన్ జయ్ స్వదేశానికి వస్తున్నాడు. మూడో తరగతి చదువుతున్న భువన్ జయ్ కి  క్రీడలు, పర్వతాల అధిరోహణ పట్ల ఆసక్తి ఎక్కువ. ఇది  గమనించిన గంధం చంద్రుడు జయ్ ను ప్రోత్సహించారు. అనంతపురం జిల్లా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) స్పోర్ట్స్ కోచ్ శంకరయ్య వద్ద జయ్ శిక్షణ పొందారు. కడప జిల్లా గండికోటలో ఉన్న అడ్వెంచర్ స్పోర్ట్స్ క్లబ్‌లో సాంకేతికంగా మెళకువలను నేర్చుకున్నాడు. ఇవన్నీ జయ్ కు పర్వతారోహణలో ప్లస్ అయ్యాయి . గతంలో లఢక్‌లో ఎత్తైన  ఖర్దుంగ్ లా శిఖరాన్నిఅధిరోహించాడు. ఆ అనుభవంతో తాజా గా ఎల్బ్రెస్ ను అవలీలగా ఎక్కి అధిరోహించాడు.   

శభాష్ భువన్. భవిష్యత్తులో నువ్వు మరిన్ని రికార్డులు సృష్టించాలని కోరుకుంటూ తర్జని తరపున అభినందనలు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!