మన తొలి మూకీ సినిమా ఇదే !

Sharing is Caring...

ఇండియాలో నూట పదకొండేళ్ల క్రితం తొలి సారిగా సినిమా తీశారు. అది మూకీ సినిమా.ఆ తొలి మూకీ సినిమా యే  “రాజా హరిశ్చంద్ర” . ఈ సినిమాను దాదాసాహెబ్ ఫాల్కే నిర్మించారు. ఆయనే దర్శకత్వం వహించారు. 1913 లో ఫాల్కే ఈ సినిమా తీశారు. సత్య హరిశ్చంద్రుడు చుట్టూ తిరిగే కథ ఇది. విశ్వామిత్రుడి కిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి, హరిశ్చంద్రుడు పడిన ఇబ్బందులను వర్ణించే చిత్రం.

దాదాసాహెబ్ సొంతంగా కథ రాసుకున్నారు. ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మ చిత్రాల ప్రభావంతో ఈ సినిమా నిర్మించారు. ఇందులో నటించిన వాళ్లంతా పురుషులే. స్త్రీ పాత్రలను కూడా పురుషులే పోషించారు. అప్పట్లో నాటకాలలో కూడా మహిళల పాత్రలు మగవాళ్లే పోషించేవారు. ఆరోజుల్లో సినిమాల్లో వేషాలు వేయడమంటే చాలా తక్కువగా చూసే వారు. మహిళలకు ఇప్పుడున్నంత స్వేచ్ఛ లేదు. నటీ నటులను ఈసడించుకునే వారు.

దాదాసాహెబ్ మహిళా నటుల కోసం ప్రయత్నించారు కానీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తప్పనిసరిగా స్త్రీ పాత్రలకు మగవారిని ఎంపిక చేసుకున్నారు.ఒక చిన్ననృత్య సన్నివేశం ఒక అమ్మాయిని ఎంపిక చేసి ఫాల్కే శిక్షణ ఇచ్చారు. ఆ అమ్మాయి నటించే లోగానే ఆమె సంరక్షకుడు వచ్చి తీసుకెళ్లారు. అలా ఆ సినిమా మహిళలు ఎవరూ లేకుండానే పూర్తి అయింది. హరిశ్చంద్రలో హరిశ్చంద్రుని కుమారునిగా ఫాల్కే కుమారుడు బాలచంద్ర నటించారు.

ఫాల్కేఈ సినిమాను సొంత ఊరైన త్రయంబకేశ్వర్‌ .. పూణే పరిసర ప్రాంతాల్లో షూట్ చేశారు. యూనిట్ మొత్తాన్నీ షూటింగ్ ప్రదేశానికి తీసుకెళ్ళేవారు. ఫాల్కే సతీమణి సరస్వతి వారి బాగోగులు .. భోజనాలు .. టిఫిన్ల వ్యవహారాలు  చూసే వారు. అందరికి ఆమె వండి వడ్డించేవారు.  లైటింగ్ సౌకర్యం..  రిఫ్లెక్టర్లు లేకుండానే సినిమా తీశారు.

“రాజా హరిశ్చంద్ర” సుమారు నలభై  నిమిషాల వ్యవధి గల సినిమానే. హరిశ్చంద్ర ఫ్యాక్టరీ అనే సంస్థ పేరు మీద సినిమా నిర్మాణం సాగింది.21 ఏప్రిల్ 1913 సాయంకాలం ఒలింపియా థియేటర్‌లో క్యాథలిక్ హాస్పిటల్ కోసం ‘రాజా హరిశ్చంద్ర’ చారిటీ షో వేశారు. ఫాల్కే ను పలువురు అభినందించారు. అప్పట్లో ఫాల్కే పత్రిక యాజమాన్యాలకు లేఖలు రాసి వాటి ఈ సినిమా గురించి పబ్లిసిటీ వచ్చేలా చూసుకున్నారు.  

1913, మే 3న ఈ సినిమాను ప్రజల కోసం ప్రదర్శించారు. అప్పట్లో థియేటర్లు లేవు కాబట్టి  పెద్ద గోడౌన్ లలో తెల్లటి తెరలు కట్టి ప్రొజెక్టర్లు తీసుకెళ్లి ప్రదర్శించేవారు. అప్పట్లో ఈ సినిమా చూసేందుకు ప్రజలు బారులు తీరారని  అప్పటి పత్రికలు రాశాయి. గ్రామీణ ప్రాంతాల్లో సినిమా ప్రదర్శన కోసం  ఫాల్కే వెళ్లి ఏర్పాట్లు చేసేవారు. ఆ విధంగా తొలి మూకీ సినిమా తీసిన దర్శకుడిగా ఫాల్కే చరిత్ర కెక్కారు. నిర్మాత దర్శకుడిగా కొనసాగారు. భారతీయ చిత్రాలకు ఆద్యునిగా నిలిచారు. ఈ సినిమా రీళ్లు ఎక్కడ ఉన్నాయనే సమాచారం తెలీదు. పూణే లో భద్రపరిచారని అంటారు .. అవి ఈ సినిమావి కాదని మరో వాదన కూడా ఉంది. 

—-KNM

post updated on 3-10-2024

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!