తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు పలువురు రాజకీయాల్లోకి దిగి ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు కానీ ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండలేకపోయారు. అంతగా రాణించలేకపోయారు. కేవలం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ముఖ్యమంత్రి అయ్యి 14 ఏళ్ల పాటు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు.
ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య 1967 లోక సభ ఎన్నికల్లో ఒంగోలు లోకసభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1978 ఎన్నికల్లో గుంటూరు జిల్లా దుగ్గిరాల అసెంబ్లీ స్థానం నుంచి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల వైపు కన్నెత్తి చూడలేదు.
1983 లో ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీ ని పెట్టి ఘనవిజయం సాధించారు. సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. తనదైన శైలిలో పరిపాలించారు. రాజకీయాలపై తనదైన ముద్ర వేయగలిగారు. హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన జమున 83 లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అప్పట్లో అందరూ వద్దంటే వెళ్ళింది మంగళగిరికి అంటూ జమునను ఆట పట్టించారు. అదే జమున 89 ఎన్నికల్లో రాజమండ్రి లోకసభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
96 ఎన్నికల్లో మచిలీపట్టణం నుంచి కైకాల సత్యనారాయణ టీడీపీ తరపున పోటీ చేసి అప్పటి సిట్టింగ్ ఎంపీ కావూరి సాంబశివరావు ను ఓడించారు. నటి శారద తెనాలి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. వెంటనే 18 మాసాల్లోనే మధ్యంతర ఎన్నికలు రావడం తో వీరిద్దరూ కావూరి ,శివశంకర్ చేతుల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లో వీరు ఎక్కడా కనిపించలేదు. కనీసం తొంగి కూడా చూడలేదు.
89 ఎన్నికల్లో హీరో కృష్ణ కాంగ్రెస్ తరపున ఏలూరు లోకసభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 91 లో టీడీపీ అభ్యర్థి బోళ్ల బుల్లిరామయ్య చేతిలో కృష్ణ ఓటమి పాలయ్యారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కృష్ణ సతీమణి విజయనిర్మల 99 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కైకలూరు నుంచి పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి యెర్నేని రాజా రామచందర్ చేతిలో ఓడిపోయారు.
ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ 96 ఉపఎన్నికలో హిందూపూర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. తర్వాత ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. 2014 ,19 ఎన్నికల్లో ఎన్టీఆర్ మరో కుమారుడు హీరో బాలకృష్ణ ఇదే హిందూపూర్ నుంచి విజయం సాధించారు.
99 లో హరికృష్ణ సొంతంగా పార్టీ పెట్టి గుడివాడలో పోటీ చేయగా దారుణంగా ఓడి పోయారు. కొన్నాళ్ల తర్వాత హరికృష్ణ టీడీపీ లో చేరి రాజ్యసభ సభ్యలు అయ్యారు. హీరో చిరంజీవి సొంత పార్టీ పెట్టి తిరుపతి, పాలకొల్లు స్థానాల నుంచి పోటీ చేశారు. తిరుపతి నుంచి గెలిచి పాలకొల్లులో ఓటమి పాలయ్యారు.
తర్వాత పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కాంగ్రెస్ ద్వారానే రాజ్యసభ సభ్యడు అయి మంత్రి కూడా అయ్యారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ప్రజారాజ్యం పార్టీ తరపున చిలకలూరిపేట నుంచి పోటీ చేసి ఓడి పోయారు.
99 లో నటుడు కోట శ్రీనివాసరావు బీజేపీ తరపున విజయవాడ తూర్పు నుంచి అసెంబ్లీ కి ఎన్నికయ్యారు. 2004 లో ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వీరంతా రాజకీయాలను పార్ట్ టైం వర్క్ గానే భావించారు. ఎవరూ సీరియస్ గా తీసుకున్న దాఖలాలు లేవు.
1999 లో కమెడియన్ బాబు మోహన్ టీడీపీ తరపున ఆందోల్ అసెంబ్లీ స్థానం గెలిచి మినిస్టర్ కూడా అయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయి 2014 లో తెరాస నుంచి గెలిచారు. 2018 లో టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు .ప్రముఖ నటి రోజా నగరి అసెంబ్లీ స్థానం నుంచి 14,19 ఎన్నికల్లో గెలిచారు. అంతకుముందు రెండుసార్లు ఓడిపోయారు. రాజకీయాల్లో రోజాది డిఫరెంట్ స్టైల్.
ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ 2004 లోకసభ ఎన్నికల్లో టీడీపీ తరపున విజయవాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నటుడు మురళీ మోహన్ 2014 లో టీడీపీ నుంచి రాజమండ్రి ఎంపీ అయ్యారు. హీరో కృష్ణంరాజు నర్సాపురం నుంచి బీజేపీ తరపున ఎంపీగా గెలిచి మంత్రి గా కూడా చేశారు.
పార్టీ అధికారంలో లేనపుడు దూరంగా ఉన్నారనే విమర్శలున్నాయి. నటుడు , దర్శకుడు దాసరి కూడా రాజ్యసభకు ఎంపికై మంత్రిగా కూడా చేశారు. ఒక కేసులో చిక్కుకున్నారు. అలాగే నటుడు శివప్రసాద్ ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా కూడా చేశారు.
హీరోయిన్ విజయశాంతి కొన్నాళ్ళు బీజేపీ లో ఉన్నారు. సొంత పార్టీ పెట్టారు. తెరాసలో చేరి 2009 లో ఎంపీగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ లో చేరారు. 2014 లో అసెంబ్లీ కి పోటీ చేసి ఓడిపోయారు. ఇపుడు మళ్ళీ బీజేపీలో చేరారు. నటి జయసుధ కూడా 2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాదు ఎమ్.ఎల్.ఏగా గెలిచారు.
జయప్రద కొన్నాళ్ళు టీడీపీలో ఉన్నారు. తర్వాత సమాజ్వాదిపార్టీ లో చేరారు.రాంపూర్ నుంచి ఎంపీగా ఎన్నికైనారు. రావు గోపాలరావు, మోహన్ బాబులు కూడా రాజ్యసభ సభ్యులు గా చేసారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన హీరో పవన్ కళ్యాణ్ .. ఆయన సోదరుడు నాగబాబు ల గురించి తెల్సిందే.
———– KNMURTHY