అప్పుడు కనిమొళి ..ఇపుడు కవిత !!

Sharing is Caring...

Women leaders trapped in scams…………………..

స్కాముల్లో ఇరుక్కుని జైలు పాలై …  చరిత్రకెక్కిన మహిళా నేతల్లో నాడు కనిమొళి ..నేడు కవిత మనకు ప్రముఖంగా కనిపిస్తారు. తమాషా ఏమిటంటే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులుగా చేసిన నేతల కుమార్తెలు కావడం విశేషం. తరచి చూస్తే ఈ ఇరువురి మధ్య కొన్ని పోలికలు కనిపిస్తాయి. 

కనిమొళి డీఎంకే అధినేత.. మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కాగా కవిత తెలంగాణ సీఎంగా చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయురాలు. ఇద్దరు మహిళా నేతలకు రాజకీయ నేపధ్యం ఉంది. తండ్రులు .. సోదరులు రాజకీయ నేతలే.. సొంత పార్టీలలో ఇరువురు వివిధ హోదాలలో పనిచేశారు. ఇద్దరు కూడా తండ్రులు ఎన్నికల్లో ఓడిపోయి పదవులు కోల్పోయిన తర్వాత అరెస్ట్ కావడం విశేషం..   ఇద్దరూ తీహార్ జైలు కెళ్లడం కూడా యాధృచ్చికమే.

కనిమొళి ..ఇండియాలో అతి పెద్ద కుంభకోణంగా పేరు గాంచిన 2G స్కామ్‌లో అరెస్ట్ అయ్యారు. డీఎంకే కి చెందిన ఎ రాజా 2008లో టెలికాం మంత్రిగా ఉన్నప్పుడు 2G స్కామ్‌ను ప్లాన్ చేసి అమలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. కనిమొళి 214 కోట్ల లంచం తీసుకున్నారని సిబిఐ చార్జిషీట్లో ప్రస్తావించింది.

2011లో ఈ ఘటన చోటు చేసుకుంది. కనిమొళిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు అప్పట్లో తీహార్ జైలుకు తరలించారు. తీహార్ జైలులో కనిమొళి 190 రోజులు ఉన్నారు. అప్పట్లో కనిమొళికి జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఆమె కోసం ఒక అటాచ్డ్ బాత్రూమ్ ,ఫ్యాన్,టీవీ ,సౌత్ ఇండియన్ ఫుడ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు.

కనిమొళి కరుణానిధి మూడో భార్య రజతి అమ్మాళ్ సంతానం. 6 నెలల తర్వాత కూతురును పరామర్శించేందుకు భార్యతో కలసి కరుణానిధి జైలు కెళ్లారు. కరుణానిధితో పాటు కనిమొళి భర్త అరవిందన్,  కొడుకు ఆదిత్య కూడా వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలసి వెళ్లి జైలులో కనిమొళిని కలిసేందుకు స్పెషల్ పెర్మిషన్ ఇచ్చారు.

జైలులోపలికి వెళ్ళగానే మర్యాదపూర్వకంగా అందరికి టీ కూడా ఇచ్చారు. డీఐజీ స్థాయి అధికారి దగ్గరుండి కరుణానిధి,కుటుంబ సభ్యులను సెల్ వద్దకు తీసుకెళ్లారు. తీహార్ జైలు చాలా పెద్దది. అక్కడ ప్రత్యేకంగా మహిళలకు, పురుషులకు వార్డులున్నాయి. ఎనిమిదో మహిళా వార్డులోని ఆరో నంబర్ సెల్ లో కనిమొళిని ఉంచారు. కరుణానిధి నడవలేరు కాబట్టి చక్రాల కుర్చీలోనే సెల్ వద్దకు తీసుకువెళ్లారు.

సెల్ నుంచి బయటకొచ్చిన కనిమొళి తల్లి తండ్రిని, భర్తను, కొడుకును చూసి భోరున విలపించింది. ఆమె పరిస్థితి చూసి మిగతా వాళ్ళు రోదించారు. ఆ దృశ్యం చూసి కరుణా నిధి కూడా భావోద్వేగానికి గురయ్యారు. తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకున్నారు. దూరంగా ఉండి గమనిస్తున్న అధికారులు, సిబ్బంది కూడా  ఆ సన్నివేశాన్ని చూసి చలించిపోయారు.

ఇక కనిమొళి గురించి చెప్పుకోవాలంటే…..  కనిమొళి రాజకీయాల్లోకి రాకముందు, హిందూ పేపర్ లో సబ్ ఎడిటర్ గా , కుంగుమం తమిళ వారపత్రిక ఎడిటర్ ఇన్ చార్జిగా… తమిళ మురసు అనే తమిళ వార్తాపత్రికకు ఫీచర్స్ ఎడిటర్ గా పనిచేశారు. ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన కనిమొళి సామాజిక కార్యక్రమాలు చేపట్టడంలో ఆసక్తి చూపేవారు.  2007 లో ఆమె రాజ్యసభకు ఎంపికయ్యారు.

తర్వాత కాలంలో  సంచలనం సృష్టించిన 2g స్కాం లో  ప్రధాన నిందితులుగా ఉన్న ఏ.రాజా, కనిమొళిలను నిర్దోషులుగా ప్రకటిస్తూ  సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పుఇచ్చింది. ఈ 2జీ కుంభకోణం వలన ప్రభుత్వ ఆదాయానికి 30 వేల కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది. కేసు నుంచి బయటపడిన కనిమొళి తర్వాత రోజుల్లో రెండోసారి రాజ్యసభకు ఎంపికయ్యారు.

2019 లో తూత్తుకుడి  నియోజకవర్గం నుంచి లోకసభకు కూడా ఎన్నికయ్యారు.నాటి ఎన్నికల్లో 347,209 ఓట్ల మెజారిటీతో కనిమొళి విజయం సాధించారు.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా మరల అదే స్థానం నుంచి 392,738 ఓట్ల మెజారిటీ తో గెలిచారు.  

ఇక కవిత గురించి చెప్పుకోవాలంటే …. హైదరాబాద్ లో B.Tech పూర్తి చేసిన కల్వకుంట్ల కవిత సదరన్ మిస్సిస్సిప్పి విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ సైన్సెస్ పూర్తి చేశారు. కొన్నాళ్ళు USAలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేశారు.

ఆమె 2006లో భారత దేశానికి తిరిగివచ్చారు. తెలంగాణ జాగృతిని 2006 లో ఏర్పాటు చేశారు. తెలంగాణ కళలు, సంస్కృతిపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడంలో చురుకైన పాత్ర పోషించింది. తెలంగాణ ప్రజల హృదయాలను కలిపే ప్రత్యేక బతుకమ్మను పెద్ద ఎత్తున జరుపుతూ అన్ని వర్గాల ప్రజలను అందులో పాల్గొనేలా చేసారు.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కవిత నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి  పోటీ చేసి 1,64,184 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర సాధన ఉద్యమానికి మద్దతుగా నిర్వహించిన నిరసనలు, ప్రదర్శనలకు  ఆమె  నాయకత్వం వహించారు.

ఎంపీగా పార్లమెంటులోనూ, ప్రజా జీవితంలోనూ తెలంగాణ వాదంతో పాటు ఇతర జాతీయ సమస్యలకు కవిత మద్దతు పలికారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కవిత మరోసారి పోటీ చేశారు. ఆమె ధర్మపురి అరవింద్‌ చేతిలో  70,875 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2020 అక్టోబర్‌లో కవిత శాసనమండలి సభ్యురాలుగా ఎన్నికయ్యారు.

మొన్నటి వరకూ దిల్లీలో గవర్నమెంటే మద్యం అమ్మేది. తరువాత ప్రైవేటుకు ఇద్దాం అనుకున్నారు. ఆ క్రమంలో పెట్టిన రూల్స్‌లో గోల్‌మాల్ జరిగిందన్నది బీజేపీ ఆరోపణ. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 15 న ఈడీ అరెస్ట్ చేసింది..  మార్చి 25 వరకు ఈ డీ కస్టడీలో ఉన్నారు.  మార్చి 26 న తీహార్ జైలుకి తరలించారు. ఆమె జైలుకెళ్లి  చాలా రోజులు  అవుతోంది.

ఎప్పటికప్పుడు రిమాండ్  పెరుగుతూనే ఉంది కానీ బెయిల్ మాత్రం లభించడం లేదు. july 7 వరకు కస్టడీని కోర్టు పొడిగించింది..  కల్వకుంట్ల కుటుంబంలో తొలి సారి కవిత అవినీతి కేసులో జైలుకెళ్లారు. లిక్కర్ వ్యాపారులతో మీటింగ్ లు పెట్టడం కాకుండా, వందల కోట్లు వసూలు చేశారని ప్రధాన ఆరోపణ.

ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి కవిత అందచేశారని, సౌత్ వ్యాపారుల నుంచి ముడుపులు వసూలు చేసింది కవిత అని, ఆమె సెల్‌ఫోన్లను కూడా ధ్వంసంచేశారంటూ ఈడీ అనేక ఆరోపణలు చేయడంతో తెలంగాణ ప్రజలు కవిత అరెస్ట్.. జైలుకు వెళ్లిన పరిస్థితిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే ఆమె అరెస్టయినా ఆ పార్టీ నేతల నుంచే పెద్దగా సానుభూతి వ్యక్తం కాలేదంటున్నారు.

2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో తన కుమార్తె  కనిమొళిని అరెస్ట్ చేయడాన్నిఅప్పట్లో  డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి తప్పుబట్టారు. కేంద్రం పై విమర్శలు చేశారు. ఇక కేసీఆర్ విషయానికొస్తే కవిత అరెస్ట్ విషయంలో 30..రోజులు అసలు స్పందించలేదు. బీఆర్ఎస్ నేతల సమావేశంలో మటుకు కవితపై పెట్టింది తప్పుడు కేసు అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి.

ఇలా కరుణానిధి కుమార్తె  కనిమొళి, కేసీఆర్ కుమార్తె కవితలకు చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ మాజీ సీఎంల కుమార్తెలే కావడం, అవినీతి ఆరోపణ కేసుల్లో అరెస్టు కావడం వంటి అంశాలను బట్టి వీరిద్దరి  జీవితాలు కొంత మేరకు ఒకే విధంగా ఉన్నాయని అనుకోవచ్చు . ఇక కవితపై కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది .. అది ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేము. కడిగిన ముత్యం లా బయటికి వస్తానంటున్న కవిత ఆశ నెరవేరుతుందో వేచి చూద్దాం.

—KNM

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!