Is it easy to let go of attachment to the body?………
నాగ సాధువులు ఇప్పటి వారు కాదు.కొన్నివేల ఏళ్ళనుంచి ఈ సాధుగణం ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. నాగా అంటే పర్వత ప్రాంతం.. పర్వత ప్రాంతంలో ఉంటారు కాబట్టి వీరికి నాగ సాధువులని పేరు వచ్చింది. ఈ నాగ సాధువుల జీవన శైలి అత్యంత కఠినంగా ఉంటుంది. ఒక వ్యక్తి నాగసాధువుగా మారడానికి కుటుంబంతో ఉన్న అన్ని సంబంధాలను త్యజించాలి.
తప్పనిసరిగా ఇంద్రియ నిగ్రహం పాటించాలి. జీవితాంతం బ్రహ్మచారిగా బతకాలి. రాగద్వేషాలను విడనాడాలి. అపుడే అర్హత సాధిస్తారు. ఉత్తరాదిలో నాగ సాధువుల సమూహాల వద్దకు వెళ్లి వారి అనుమతితో సాధువుగా మారాలి. నాగ సాధువుల సమూహాలను “అకడా” లు అంటారు. ఈ “అకడా” లలో పలు గ్రూపులున్నాయి. దాదాపు 13 అకడా లున్నాయని సమాచారం.
ఈ అకడాల ఆశ్రమాలు హరిద్వార్,ప్రయాగ ప్రాంతాల్లో ఉన్నాయి. ఏదైనా సమూహం పెద్ద వద్దకు వెళ్లి సాధువుగా మారేందుకు అనుమతి పొంది దీక్ష ను స్వీకరించాలి. అకడా పెద్దలకు నచ్చితే గ్రూప్ లో చేర్చుకుంటారు. ఒక్కో అకడా కు ఒక్కోరకమైన గుర్తింపు ఉంటుంది. సాధువులు ధరించే విభూతి,రుద్రాక్షలను బట్టి వారు ఏ అకడా కు చెందినవారో గుర్తిస్తారు.
కొత్తగా గ్రూప్ లో చేరిన సాధువులను పరిశీలనలో ఉంచి .. కఠినమైన శిక్షణ ఇస్తారు.ఈ శిక్షణ 6 నుంచి 12 ఏళ్ళ వరకు ఉంటుంది. సాధువులు గురువు ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలి. లేదంటే అకడా నుంచి పంపి వేస్తారు.
సాధువుగా రోజులో ఒక పూట మాత్రమే భుజించాలి. అదికూడా భిక్షాటన ద్వారా ఆహారాన్ని సమకూర్చుకోవాలి. నేలపై పడుకోవాలి. భిక్షాటనకు అవకాశం లేని చోట ఆకులు అలములు స్వీకరించాలి. అసలు ఆహరం దొరకకపోయినా ఉండగలగాలి.
శిక్షణా కాలంలో యోగ విద్యలను నేర్చుకోవాలి. రోజూ సాధన చేయాలి. శిక్షణ తొలి రోజుల్లో కాషాయ అంగ వస్త్రం ధరించాలి.కొంత కాలం గడిచాక దిగంబరంగా మారాలి. శరీరంపై మోహాన్ని వదులు కోవాలి. సిగ్గు పడకూడదు. ఎవరిపై కోపం చూపకూడదు.ఎవరిని నిందించ కూడదు. ఒకసారి దిగంబరం గా మారాక పూర్తి వస్త్రధారణ చేయకూడదు.
అవసరమైన సందర్భాల్లో కౌపీనం ధరించవచ్చు. ప్రతిరోజు ఒళ్ళంతా విభూతి పూసుకోవాలి. రుద్రాక్షలు ధరించాలి. శివుడే సర్వస్వం .. శివుడే సృష్టికి మూలం అని నమ్మాలి. ఆయననే ఆరాధించాలి. గుండు గీయించుకుని వారి కర్మకాండలను వారే నిర్వహించుకోవాలి.
అనంతరం పిండ ప్రధానం చేయాలి. (అంటే తాను బతికుండగానే తద్దినం పెట్టుకోవడం అన్నమాట) ఈ పిండ ప్రధానం దరిమిలా వీరిని నాగ సాధువుగా గుర్తిస్తారు.ఇక్కడ నుంచి కొత్త జీవితం మొదలవుతుందన్నమాట. ఈ దశ వరకు చేరుకోవడం అంత సులభమైన వ్యవహారం కాదు.
చాలామంది స్వేచ్చలేదని .. పద్ధతులు కఠినంగా ఉన్నాయని పారిపోతుంటారు. కుంభ మేళా వంటి సమయాల్లో వీరికి గుర్తింపు ఇస్తారు.గత పదేళ్ల కాలంలో మహిళా నాగసాధువుల సంఖ్య కూడా పెరిగింది. వీరిది ప్రత్యేక అకడా. వీరు మగ సాధువులు మాదిరిగా నగ్నంగా ఉండరు.
శరీరాన్ని చాలావరకు దాచి ఉంచుతారు. అలహాబాదు వద్ద సంగం తీరం లో ఈ మహిళా సాధువులకు ప్రత్యేక ఆశ్రమాలున్నాయి. వీరు కూడా కుంభమేళాలలో పాల్గొంటారు. వీరికి కూడా కఠినమైన శిక్షణ ఉంటుంది.ఈ నాగ సాధువులను హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆది శంకరాచార్యులు సృష్టించారనే కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. నాగ సాధువులు శిక్షణ తర్వాత పలు హోదాల్లోకి ప్రమోట్ అవుతారు.
————-K.N.MURTHY