The story of missing nuclear device ……………..
నందాదేవి హిమపర్వతాల్లో 1965లో తప్పిపోయిన అణుపరికరం (Nuclear Device) గురించిన వార్తలు 2025లో మళ్ళీ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. డిసెంబర్ 2025లో ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రచురించిన కథనం ఆధారంగా భారతీయ మీడియా ఈ ముప్పుపై విశ్లేషణలను వెలువరిస్తోంది.
మిస్ అయిన ఆ న్యూక్లియర్ డివైజ్ వల్లనే ప్రకృతి వైపరిత్యాలు ముంచుకొస్తున్నాయా ? వరుస వరదలు.. క్లౌడ్ బరస్ట్లు జరుగుతున్నాయా? న్యూక్లియర్ డివైజ్ క్లైమేట్ చేంజ్ కు కారణమా ? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
చైనా అణు పరీక్షలపై నిఘా ఉంచేందుకు అమెరికా (CIA), భారత్ (IB) సంయుక్తంగా 1965లో నందాదేవి శిఖరంపై రేడియో ఐసోటోప్ థర్మోఎలెక్ట్రిక్ జనరేటర్ (RTG) కలిగిన పరికరాన్ని అమర్చాలని ప్రయత్నించాయి.అదేసమయంలో ఒక భయంకరమైన మంచు తుఫాను రావడంతో ఆ బృందం ఆ పరికరాన్ని అక్కడే వదిలి వెనక్కి వెళ్ళింది.
ఆ తర్వాత కొంత కాలానికి వెళ్లి వెతకగా అది కనిపించకుండా పోయింది. ఇది మంచులో కూరుకుపోయి ఉండవచ్చని లేదా కొండచరియలు విరిగిపడటంతో కొట్టుకుపోయి ఉండవచ్చని భావించారు. ఈ పరికరంలో సుమారు 2 నుండి 5 కిలోల వరకు ప్లూటోనియం-238 కోర్ ఉంది. ప్లూటోనియం అత్యంత విషపూరితమైనది.
భిన్నాభిప్రాయాలు
ప్లూటోనియం ఆధారిత న్యూక్లియర్ డివైస్ పట్ల పర్యావరణ శాస్త్రవేత్తలు, నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
జల వనరుల కలుషితం
ఈ పరికరంలో ప్లూటోనియం ఉన్నందున, హిమానీనదాలు కరిగి ఆ రేడియోధార్మిక పదార్థం గంగా నది ఉపనదుల్లో (ఋషి గంగ, ధౌలీ గంగ) కలిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది కోట్ల మంది ప్రజల తాగునీటిపై ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్లోబల్ వార్మింగ్ ప్రభావం
హిమాలయాల్లో మంచు వేగంగా కరుగుతుండటం వల్ల, మాయమైన పరికరం బయటపడే లేదా దెబ్బతినే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా 2021 చమోలీ వరదల వంటి విపత్తుల సమయంలో ఈ భయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
తక్కువ ముప్పు – అధిక ప్రభావం
ప్రస్తుతానికి రేడియేషన్ లీక్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, భవిష్యత్తులో పరికరం దెబ్బతింటే మాత్రం దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒకవేళ స్వల్పంగా రేడియేషన్ విడుదలైనా, హిమాలయాల్లోని భారీ జల ప్రవాహంలో అది విలీనం (dilute) అయిపోయే అవకాశం ఉందని, దీనివల్ల తక్షణ ముప్పు తక్కువని భావిస్తున్నారు.
గ్లేషియాలజిస్టుల హెచ్చరిక
హిమానీనదాలు నిరంతరం కదులుతూ ఉంటాయని, కాబట్టి పరికరం ఒకే చోట ఉండదని, అది ఎప్పుడు ఎక్కడ బయటపడుతుందో చెప్పలేమని గ్లేషియాలజిస్టులు (హిమానీనద శాస్త్రవేత్తలు) స్పష్టం చేస్తున్నారు.మొత్తానికి ఈ పరికరం గంగా నది తీర ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి “టైమ్ బాంబ్” వంటిదని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
2025 డిసెంబర్‌లో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే వంటి వారు ఈ వ్యవహారంపై గత ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అప్పటి నుంచి పలు కథనాలు వెలువడుతున్నాయి.
2025 డిసెంబరులో రాజ్యసభలో జరిగిన చర్చల్లో, భారత అణుశక్తి కేంద్రాల వద్ద రేడియేషన్ పరిమితులు సురక్షితంగా ఉన్నాయని, అణు సంబంధిత ముప్పులు ఏవీ లేవని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. పరికరం విషయంలో కూడా గతంలో చేసిన సర్వేలు గంగానది నీటిలో ఎటువంటి రేడియో ధార్మికత లేదని తేల్చాయని చెప్పుకొచ్చారు.
దాదాపు 40 ఏళ్ల నిషేధం తర్వాత, 2025 జూలైలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం … ఇండియన్ మౌంటనీరింగ్ ఫౌండేషన్ (IMF) నందాదేవి పర్వతారోహణను పరిమితంగా తిరిగి ప్రారంభించాలని ప్రతిపాదించాయి. పర్యావరణ పరిరక్షణ, ఈ అణు పరికరం వల్ల కలిగే ముప్పు దృష్ట్యా 1983 నుండి ఇక్కడ పర్వతారోహణపై నిషేధం ఉంది.

