అరుదైన ఒక సర్కారీ వైద్యుడి కథ !

Sharing is Caring...

Ramana Kontikarla ………………………………….. 

Another example of humanity……………………….నల్లవన్నీ నీళ్లు కాదు… తెల్లనివన్నీ పాలు కాదన్నట్టుగా… వాటిని తరచి చూసి ఒక అభిప్రాయాని కొస్తేనే సరిగ్గా అర్థమయ్యేది. అలా ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే తమకు సరైన వైద్యమందుతుందని వెళ్లేవారెందరో! అక్కడికెళ్లి తమ ఆర్థికమూలాలనే కోల్పోయి… పైగా అప్పులపాలయ్యేవాళ్లెందరో!!

కానీ సర్కారీ ఆసుపత్రుల్లోనూ మంచి వైద్యులున్నారని… అంతకుమించి మానవత్వాన్ని కనబర్చే వైద్యనారాయణులున్నారని నిరూపించి.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్న ఓ డాక్టర్ కథ ఇది.డాక్టర్లందరూ కమర్షియల్ గా ఉంటారనుకోవటం కరెక్ట్ కాదని నిరూపించారు ఈ ఆదర్శవంతుడైన డాక్టర్. 

ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రమే తమ ప్రాణాలకు రక్ష అనుకోవడం ముమ్మాటికీ తప్పేనని… సర్కారీ వైద్యశాలల్లోనూ అద్భుతమైన వైద్యులుంటారని… అంతకంటే ఘనమైన సేవలు దొరుకుతాయని చెప్పడానికే.. ఇదిగో ఈ తణుకు ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఓ ఘటన గురించి మనమిప్పుడు చెప్పుకుంటున్నాం.

తణుకు ప్రభుత్వ హాస్పిటల్ లోని చిన్నపిల్లల వార్డులో సేవలు.. ఇప్పుడు ప్రైవేట్ ను మించి కనిపిస్తున్నాయంటే.. ఓ డాక్టర్ కారణమంటే కొంత అతిశయోక్తనిపించవచ్చు. కానీ వృత్తిని దైవంగా భావించి వచ్చేవారెందరో డాక్టర్లూ ఆ కోవలో ఉన్నారు. కానీ ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రుల దోపిడీలో… గంజాయి వనాల్లో తులసీ మొక్కల్లా వారి పేర్లు బయటకు రావడంలేదంతే! కానీ, సోషల్ మీడియా ఆ అడ్డుగోడల్ని బద్ధలు కొట్టింది.

అందుకే మారుమూల ఓ చెడు ఘటన జరిగితే ఎంత వేగంగా బయటకొస్తుందో… అంతే శరవేగంగా మంచీ సమాజానికి ఇట్టే తెలిసిపోతోంది. అలా సోషల్ మీడియాలో వైరలై… తన సేవతో పరిచయమైన డాక్టరే మనమిప్పుడు చెప్పుకుంటున్న చిన్నపిల్లల యువ వైద్యుడు యలమర్తి వెంకటేష్ బాబు.

ఇదిగో ఈ ఫొటోలో డాక్టర్ దగ్గర ఉన్న బాబు పేరు రక్షిత్. అయితే ఈ బాబుకి పేరు పెట్టింది కూడా ఈ డాక్టర్ వెంకటేశ్ బాబే. సిద్ధాంతం గ్రామానికి చెందిన ఓ నిరుపేద మహిళ కు మోషన్స్, ఉమ్మనీరు మింగడం.. తద్వారా చలనం కనిపించని ప్రమాదకర స్థితిలో పుట్టాడు ఈ బాబు. తణుకులోని అన్ని చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్స్ కి తిరిగేసరికి పరిస్థితి చేయిదాటి పోయిందని చెప్పేవారే తప్ప… ఎవ్వరు జాయిన్ చేసుకోలేదు.

కానీ వైద్యుడు అంటే దేవుడితో సమానమని… వైద్యో నారాయణో హరి అని నిరూపిస్తూ… ఒక్క డాక్టర్ మాత్రం ప్రాణాలు పోయినంత పనైన బాబు చేయిపట్టాడు. రక్షించాడు. తణుకు ప్రభుత్వ హాస్పిటల్ లో చిన్నపిల్లల వైద్యుడిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ యలమర్తి వెంకటేష్ బాబు.. ప్రభుత్వాసుపత్రిలో తనకందుబాటులో ఉన్న అరకొర సదుపాయాలనే ఉపయోగించుకుని ఈ బాబుకి ప్రాణం పోశాడు.

ఆ బాబు తల్లిదండ్రులు.. మీరే బాబుకి పేరు పెట్టండని కోరితే… కాదనలేక కాసింత మొహమాట పడుతూనే.. ఇదిగో ఈ బుడతడికి రక్షిత్ అనే పేరు పెట్టాడు ఈ డాక్టర్ బాబు. ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు. భవిష్యత్లో కష్టాలతో ఉన్న ఎవ్వరినైనా నువ్వు రక్షించాలని బాలుడి చెవిలో చెబుతూ మరీ… ఈ బాబుకి రక్షిత్ అని నామకరణం చేసాడు ఈ పెడియాట్రీషన్ డాక్టర్ యలమర్తి వెంకటేశ్ బాబు.

కేవలం ఈ బాబుతోనే ఈ డాక్టర్ బాబుకు పేరు రాలేదు. వైద్యం కోసం పేదవారెవరు వచ్చినా… నేనున్నానంటూ దేవుడిలా వారికి అభయం ఇచ్చి ఆదుకుంటారు గనుకే ఇప్పుడీ డాక్టర్ వెంకటేశ్ బాబు అభినందనలందుకుంటున్నారు. పేద, ధనిక, కులం, మతం అన్న తేడా లేకుండా దవాఖానాకు వచ్చే రోగులందరికీ.. దయాగుణంతో వైద్యమందించటమే తన వృత్తని నమ్మాడుగనుకే… ఈ డాక్టర్ బాబు ఇప్పుడిక్కడి ప్రజలకు దేవుడయ్యాడు.

మందులకు డబ్బుల్లేకుంటే కూడా… పేదవారికి తన డబ్బులతోనే మందులు కూడా ఇప్పిస్తున్న ఈ డాక్టర్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని… మరెందరికో నిండు నూరేళ్లు ప్రసాదించాలనే ఇక్కడి జనం దేవుణ్ని అర్థించే ప్రార్థనలోని భూలోక దేవుడయ్యాడు ఈ డాక్టర్ బాబు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!