Hardship of Life ………………………
సిరియాలో జరిగిన సంఘర్షణల కారణంగా అక్కడ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.వికలాంగులయ్యారు.. మీరు చూసే ఈ ఫోటో వెనుక ఒక విషాదం ఉంది. ఫొటోలో కనబడుతున్న తండ్రి కి ఒక కాలు లేదు ..బిడ్డకు రెండు చేతులు, కాళ్ళు లేవు. ఎంతటి విషాదం. ఎవరికి అలాంటి పరిస్థితి రాకూడదు. అంతటి దుర్భర స్థితిలో ఉన్నప్పటికీ కొడుకును నవ్వించడానికి ఆ తండ్రి పడే తపనను అద్భుతంగా ఫొటోలో బంధించాడు ఆ ఫోటోగ్రాఫర్.
బిడ్డను ఎత్తుకున్న అతని పేరు ముంజిర్. ఒక బాంబు దాడిలో కాలును కోల్పోయాడు.. భార్య జీనెప్ యుద్ధంలో వెలువడిన నెర్వ్ గ్యాస్‌ని పీల్చిన కారణంగా కాళ్లు, చేతులు లేని బిడ్డ కు జన్మనిచ్చింది.బిడ్డకు ముద్దుగా ముస్తఫా అని పేరు పెట్టుకున్నారు. అప్పట్లో సిరియా సరిహద్దుల్లోని దక్షిణ టర్కీలో ఆ కుటుంబం ఉండేది.
పుట్టుకతో వచ్చే టెట్రా-అమెలియా అనే రుగ్మతతో జన్మించిన ముస్తఫా ను చాలామంది డాక్టర్లకు చూపించాడు ముంజిర్. ఫలితం లేదు. శరణార్థి లాగా బతుకు వెళ్లదీస్తున్న అతగాడు ఎందరో దాతలు చేసిన సహాయంతో కుటుంబాన్నిలాక్కొస్తున్నాడు. ముస్తఫా కి కాళ్ళు, చేతులు లేవు కానీ చాలా తెలివైన వాడట. చెల్లెలు అతగాడిని ఎత్తుకుంటే ఆడిస్తుంటే నవ్వుతాడట.
ఆ తండ్రీ కొడుకుల నవ్వులను కెమెరాలో బంధించిన టర్కిష్ ఫొటోగ్రాఫర్ మెహ్మత్ అస్లన్ సియెనా ఇంటర్నేషనల్ ఫొటో అవార్డ్స్ –2021లో “ఫొటో ఆఫ్ ది ఇయర్ ” అవార్డును గెలుచుకున్నాడు. ‘సిరియాలో ఏం జరుగుతుందో ఈ ఒక్క ఫొటోతో ప్రపంచానికి చూపాలనుకున్నాను’అని అంటున్నాడు అస్లన్.
సిరియా లో జరిగే ఘర్షణల గురించి తరచు వింటుంటాం. వాటి కారణంగా అక్కడ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో..ఏ బాంబు వచ్చి మీద పడుతుందో అని ప్రజలు క్షణం క్షణం భయపడుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికే వారు. ఎంతోమంది అవయవాలు కోల్పోయి వికలాంగులుగా బతుకలేక చావలేక జీవచ్ఛవాలుగా మారిపోయారు.
పెద్దలకే కాదు పిల్లలకు ఈ ప్రమాదం పొంచి ఉంది. మగవాళ్ళు .. ఆడవాళ్ళూ .. వృద్ధులు యువత అన్న తేడాలేదు. కడు దౌర్భాగ్యపు స్థితిలో బతుకు నెట్టుకొస్తున్నారు అక్కడి ప్రజలు. ఉత్తర సిరియా సరిహద్దులలో శరణార్థులతో నిండిన శిబిరాలు ఎన్నో ఉన్నాయి.అక్కడ తల దాచుకుంటున్నారు.
దాదాపు ఏళ్ల నుంచి జరుగుతున్నసంఘర్షణలో, మిలియన్ల మంది సిరియన్లు టర్కీలోని ఈ ప్రాంతంలోకి ప్రవేశించారు. మరికొందరు దేశం విడిచి వెళ్లారు. ముంజిర్ కుటుంబం కూడా అదే రీతిలో తప్పించుకుని వచ్చి సరిహద్దు శిబిరాలలో తలదాచుకుంది.ముంజిర్ ఫోటో వైరల్ అయ్యాక అతని కుటుంబాన్ని కొంతమంది దాతలు ఆదుకున్నారు. ప్రస్తుతం ముంజిర్ కుటుంబం సియానా సమీపంలోని ఒక చిన్న గ్రామంలో ఉన్నారు.
డిసెంబర్ 2024లో అసద్ పాలన పతనంతో అంతర్యుద్ధాలు కొంత వరకు తగ్గాయి.. అంతర్యుద్ధం ముగిసినప్పటికీ, పరిస్థితి అస్థిరంగానే ఉంది.శరణార్ధుల శిబిరాలు ఇంకా కొనసాగుతున్నాయి. UNHCR వంటి సంస్థలు నిర్వాసితులకు సహాయం అందిస్తున్నాయి.
పొరుగు దేశాలకు వెళ్లిన చాలా మంది సిరియన్లు స్వదేశానికి తిరిగి రావడం ప్రారంభించారు. సిరియాలో లక్షలాది మంది ఇప్పటికే నిరాశ్రయులయ్యారు.వీరందరికి సహాయం అందించడం అంటే అంత సులభమైన విషయం కాదు.