ఆ కారు వెనుక అంత కథ ఉందా ? (2)

Sharing is Caring...

Suresh vmrg………………………………..

అంతకు ముందు 1979 రోజుల్లోకి వెళితే ….. . మారుతీ ఉద్యోగ్ చుట్టూ రాజ‌కీయ నీలినీడ‌లు క‌మ్ముకున్న స‌మ‌యంలో సంజ‌య్‌గాంధీ వ‌య‌సు నిండా ఇర‌వై మూడేళ్లే. మారుతీ మీద ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడ‌త‌ను. సంజ‌య్‌గాంధీకి రాజ‌కీయాల మీద మంచి ఆస‌క్తి వుంది.

దేశ‌వ్యాప్తంగా దాదాపు ప్ర‌తి రాష్ట్రం లోనూ మారుతీ కార్ల త‌యారీ ప‌రిశ్ర‌మ ఏర్పాటు కావాల‌ని, వేల సంఖ్య‌లో కార్మికుల‌కు ఉపాధి దొర‌కాల‌నీ కోరుకున్నాడు. అప్ప‌టికింకా కాంగ్రెస్ ప్ర‌భుత్వాలే దేశాన్ని ఏలుతుండ‌డంతో త‌న ఆలోచ‌న నెర‌వేర‌డం సుల‌భ‌మే అనుకున్నాడ‌త‌ను.

కానీ, మారుతీ ఉద్యోగ్ మీద వ‌చ్చిన ఆరోప‌ణ‌ల వ‌ల్ల త‌న తల్లి ఇందిరాగాంధీ రాజ‌కీయ జీవితానికే ఇబ్బంది క‌లుగుతోంద‌ని తీవ్రంగా మ‌న‌స్తాపం చెందాడంటారు. మాన‌సికంగా స‌రైన స్థితిలో లేని స‌మ‌యంలోనే శిక్ష‌ణ విమానాన్ని న‌డిపి, దానిని అదుపు చేయ‌లేక‌పోవ‌డంతో ప్లేన్ క్రాష్ అయి 1980లో సంజ‌య్‌గాంధీ మ‌ర‌ణించాడు.

చిత్రంగా …ఇందిరాగాంధీ అదే మారుతీ ఉద్యోగ్ కంపెనీని ప్ర‌భుత్వ‌ప‌రం చేస్తున్నాన‌ని, జాతీయ‌క‌ర‌ణ ద్వారా దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాదిమందికి ఉపాధి కల్పిస్తాన‌ని వాగ్దానం చేసి, 1980 ఎన్నిక‌ల్లో గెలుపుకు మారుతీని కూడా ఒక ఎర‌గా వేశారు. అదీ ఆమె రాజ‌కీయ చాతుర్యం.

సంజ‌య్‌గాంధీ మీద కుష్వంత్‌ సింగ్ వేసిన జోక్ ఒక‌టి గుర్తుచేసుకుందాం. భార‌త్‌లో కుటుంబ‌ నియంత్ర‌ణ అన‌గానే సంజ‌య్‌గాంధీ గుర్తుకొచ్చేస్తాడు. ‘ఒక్క‌రు లేదా ఇద్ద‌రు’ కాన్సెప్టును నిర్బంధంగా అమ‌లు చేసే ప్ర‌ణాళికలో భాగంగా … సంజ‌య్‌గాంధీ ఆదేశాల‌తో పిల్ల‌లు లేనివారికి కూడా బ‌ల‌వంతంగా కు.ని శ‌స్త్రచికిత్స‌లు చేసేశారంటారు. ఒక‌వేళ సంజ‌య్‌గాంధీ జీవించివుంటే … దేశంలో అంద‌రిచేతా నిర్బంధంగా మారుతీ 800 కార్లు కొనిపించి వుండేవాడ‌ని కుష్వంత్ స‌ర‌దా కామెంట్ చేశారు.

1987 నాటికి ‘మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్’ మారుతీ 800 కార్ల‌ను ఎగుమ‌తి చేయ‌డం మొద‌లుపెట్టింది. యుగోస్లోవియా, హంగ‌రీ, నెద‌ర్లాండ్స్‌, ఫ్రాన్స్‌, చెకోస్లోవేకియా, ఇంగ్లాండ్‌, ఇట‌లీ, malta లాంటి దేశాల‌కు మారుతీ ప్ర‌యాణం మొద‌లైంది. మారుతీ భాగ‌స్వామ్య సంస్థ సుజుకీ ఈ మార్కెటింగ్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించింది. గ‌మ్మ‌త్తేమిటంటే … ఏయే దేశాల‌కు జ‌పాన్ త‌న కార్ల‌ను ఎగుమ‌తి చేస్తుందో ఆ దేశాల‌నే సుజుకీ టార్గెట్ చేసింది.

మారుతీ త‌యారీతో త‌నకు ఏమాత్రం సంబంధం లేద‌న్న‌ట్లుగా విదేశాల్లో విడుద‌ల‌య్యే కార్ల‌కు సుజుకీ లోగో లేకుండా కేవ‌లం ‘మారుతీ 800’ అని మాత్ర‌మే వుండేలా సాంకేతికంగా జాగ్ర‌త్త‌లు తీసుకుంది. ఆయా దేశాల‌కు అనుగుణంగా కార్ మాన్యువ‌ల్స్‌నీ, వాటి అనువాదాల్నీ విడుద‌ల చేసింది. తొలిత‌రం మారుతీ కార్ల‌కు సీట్‌బెల్టు స‌దుపాయం లేదు. విదేశాల‌కు ఎగుమ‌తులు ప్రారంభించిన త‌రువాతే యాక్సెస‌రీస్‌లో సీటుబెల్టును భాగం చేసింది.

కొన్ని చిన్న‌చిన్న మార్పులు చేస్తూ లెఫ్ట్‌హ్యాండ్ డ్ర‌యివ‌ర్ల కోసం కూడా మారుతీ 800 విడుద‌లైంది. అయితే ఇది ఫ్రాన్స్ వ‌ర‌కే ప‌రిమిత‌మైంది. 2004 నాటికి … ఆయా దేశాల‌ భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌కు అనువైన విధంగా లేక‌పోవ‌డంతో మారుతీ 800 ఎగుమ‌తులు ఆగిపోయాయి. ఇలా మారుతీ 800 విదేశీ ప్ర‌స్థానం ముగిసింది. కానీ, 800 పిల్ల‌లు జెన్‌, ఆల్టోలు విదేశీ మార్కెట్ల‌ను ఇంకా ఆక‌ట్టుకుంటూనేవున్నాయి. ముఖ్యంగా జెన్‌కి యూరోప్ చిన్న‌కార్ల మార్కెట్లో మంచి ఆద‌ర‌ణ వుంది.

Pl.read it also ……………………………………...ఆ కారు వెనుక అంత కథ ఉందా ? (1)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!