Three years of Taliban rule……………….
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్ పాలకులు వేడుకలు జరుపుకుంటున్నారు. మూడేళ్ళ క్రితం ఆగష్టు 15, 2021న US మద్దతు ఉన్న ప్రభుత్వం కుప్పకూలింది. నాటి పాలకులు ప్రవాసంలోకి వెళ్లారు. తాలిబాన్ దళాలు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నాయి.
నాటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ లో మానవ హక్కుల హననం జరుగుతోంది. మహిళలపై ఎన్నోఆంక్షలు విధించారు. దీంతో తాలిబాన్ ప్రభుత్వాన్ని ఏ దేశం గుర్తించలేదు. ఇది కీలకమైన అంశంగా మిగిలిపోయింది. తాలిబాన్ ప్రభుత్వం ఇస్లామిక్ పాలనను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే భూకంపాలు, వరదలు ..కరువు కాటకాలతో ప్రజా జీవితాన్ని దెబ్బతీశాయి.
మరోవైపు ఆర్థిక వ్యవస్థ స్తబ్దుగా మారడంతో ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. ప్రజల రోజువారీ జీవనం కష్టంగా మారింది. ఆకలి దప్పులతో జనాలు అలమటించి పోతున్నారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు లేవు. ఆహారం అందుబాటులో లేదు.
దీంతో మిలియన్ల మంది పోషకాహార లోపానికి గురై .. వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని WHO హెచ్చరించింది. తీవ్రమైన పోషకాహార లోపంతో 2 .3 మిలియన్ల మంది పిల్లలు బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో UN మానవతా ప్రతిస్పందన కార్యక్రమం కింద కొంత సహాయం అందింది.
యువతకు ఉద్యోగాలు లేవు… అమ్మాయిలు .. అబ్బాయిలు ఇద్దరూ అనిశ్చిత భవిష్యత్తును ఎదుర్కొంటున్నారు, 23.7 మిలియన్ల మందికి మానవతా సహాయం అవసరమని గుర్తించారు. కానీ చేసేవారేరి ?
ఆఫ్ఘన్ శరణార్థులను పాకిస్తాన్,ఇరాన్, టర్కీ దేశాలు ఆదరించలేదు..ఏదోవిధంగా ఆయా దేశాల భూభాగాల్లోకి చొరబడిన వారిని బలవంతంగా వెనక్కి పంపుతున్నారు. దేశంలో మహిళలు ఒంటరిగా బహిరంగ ప్రదేశాల్లో కనిపించకూడదు. మగ తోడు లేకుండా 72 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణించ కూడదనే ఆంక్షలు విధించారు. బ్యూటీ సెలూన్‌లను బలవంతంగా మూసివేయించారు. ఈ క్రమంలోనే మహిళల యాజమాన్యంలోని 60 వేల వ్యాపారసంస్థలు మూతపడ్డాయి.
ఈ ఆంక్షల నేపథ్యంలో మహిళలు ప్రజా జీవితం నుండి దూరమయ్యారు.ఉద్యోగాలు,జిమ్‌లు,కళాశాలల నుండి పూర్తిగా దూరమైనారు. మహిళలు క్రీడా కార్యకలాపాల్లో పాల్గొనడం, పబ్లిక్ పార్కులను సందర్శించడంపై నిషేధం కొనసాగింది.. ఒంటరి మహిళలను రెస్టారెంట్‌లకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. బాల్య .. బలవంతపు వివాహాలు, స్త్రీ హత్యలుపెరిగాయని యుఎన్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్‌లోని UN సహాయ మిషన్ (UNAMA) ఆగస్టు 2021 — మే 2023 మధ్య కాలంలో 3,774 పౌర మరణాలను నమోదు చేసింది. తాలిబాన్లు బహిరంగ మరణశిక్షలు .. శారీరక దండనలను కొనసాగించడంపై UN ఆందోళన వ్యక్తం చేసింది. భావప్రకటనా స్వేచ్ఛ లేదు. మీడియా పై కఠినమైన ఆంక్షలు అమలులోకి వచ్చాయి.
చాలా మంది జర్నలిస్టులను తాలిబాన్ నిర్బంధించింది. మహిళా జర్నలిస్టులైతే ఉద్యోగాలు మానివేశారు. రేడియో, న్యూస్ చానళ్లు చాలావరకు మూత పడ్డాయి. సోషల్ మీడియాలో విమర్శలు చేసేవారిని అణిచి వేశారు.
ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పాలకులు చెబుతున్నారు కానీ ఆఫ్ఘనిస్తాన్ సర్కార్ చట్టబద్ధమైన ప్రభుత్వంగా గుర్తింపు పొందలేదు. అంతర్జాతీయంగా ఆర్థిక ఆంక్షలు, పరిమితులు అమలులో ఉన్నందున ఏ దేశం కూడా సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఆఫ్ఘనిస్తాన్ జాతీయ బ్యాంకు విదేశీ నిల్వలను కూడా US జప్తు చేసింది. గత మూడేళ్ళ కాలంలో ప్రజల ఇబ్బందులు తీరకపోగా మరింత పెరిగాయి.
—KNMURTHY
Good analysis of state of affairs in Afgan. 👌
thank u sir