హిచ్ కాక్ నే భయపెట్టిన నంబర్ 13!

Sharing is Caring...

Experience ……………………………………కొన్ని సెంటిమెంట్లు కలిసొస్తాయి, మరికొన్ని భయపెడతాయి. తెలిసి తెలిసీ భయపెట్టే విషయాలను లెక్కచేయకపోతే, ఆ సెంటిమెంట్ ఎంత చెడ్డదో చెప్పడానికి చేసే ప్రయత్నంలోనే దాని ప్రభావం కనిపిస్తే… అప్పుడు పరిస్థితి ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ అనుభవం లాగ ఉంటుంది…సినిమాకు ‘మిస్టరీ’ ‘సస్పెన్స్’ లను పరిచయం చేస్తూ వాటిని ‘హారర్’లుగా తీర్చిదిద్దిన దర్శకుడు అల్ఫ్రెడ్ హిచ్‌కాక్.

అంతవరకూ అనేక నవలల్లో అక్షర రూపంలో ఉండిపోయిన సన్నివేశాలను ఉత్కంఠభరితంగా హిచ్‌కాక్ తీర్చిదిద్దిన విధానం ప్రపంచాన్ని హడలగొట్టింది. రక్తపాతం, పోరాటాలు లేకుండా మలుపులు, చిక్కులతో సాగే హిచ్‌కాక్ సినిమాల కోసం హారర్ సినిమాల అభిమానులు పడి చస్తుంటారు.

ఆ సినిమాలు చూసినప్పుడు తాము భయపడిన విధానం గురించి చెబుతూ అందరినీ భయపెడుతుంటారు. అనేక మిస్టీరియస్ సినిమాలు తీసిన హిచ్‌కాక్ నమ్మకాలకు, సాంప్రదాయక భయాలను తన సినిమాల్లో జొప్పించాడు. యూరోపియన్ ప్రపంచంలోని నమ్మకాలను తన సినిమాల్లో కలుపుకుంటూ థ్రిల్లర్‌లు రూపొందించాడు.

అలా హిచ్‌కాక్ ఎక్కువ గా ప్రస్తావించిన సెంటిమెంట్ ‘నంబర్ 13’ విషయంలో. యూరోపియన్లు నంబర్ 13ను దురదృష్టపు సంఖ్యగా భావిస్తారు.క్రైస్తవ మత సంబంధ గాథల వల్ల నంబర్ 13 చెడు సంఖ్యగా మారింది. ఈ సెంటిమెంటును తన సినిమాల్లో కూడా క్యారీ చేశాడు అల్ఫ్రెడ్ హిచ్‌కాక్. తన హారర్ కథలతో ప్రేక్షకులను మరింత భయపెట్టడానికి ఆ దర్శకుడు 13ను కూడా ఉపయోగించుకున్నాడు. అనేక సినిమాల్లో పాత్రలకు 13తో అనుబంధాన్ని పెనవేస్తూ చూసే ప్రేక్షకుల్లో భయాన్ని పెంపొందించాడు.

సినిమాల్లో పాత్రలను బాగా ప్రభావితం చేసే నంబర్‌గా 13 ను వాడేసుకున్న హిచ్‌కాక్ జీవితంపై కూడా ఆ ప్రభావం పడిందని కొంతమంది విశ్లేషిస్తారు. తన సినిమాల్లో పాత్రలు నివసించే అపార్ట్‌మెంట్ నంబర్లకు, గదుల నంబర్లకు హిచ్‌కాక్ 13ను నిర్దేశించాడు.ఆ నంబర్ గదుల్లో నివసించే వారు ఏదో ఒక ముప్పును ఎదుర్కొనబోతున్నారని ప్రేక్షకులను సస్పెన్స్‌లో పెట్టడం హిచ్‌కాక్ అలవాటు.

ఉదాహరణకు ప్రసిద్ధ ‘సైకో’ సినిమాలో మారియన్ మొదట 3 నంబర్ గదిలో దిగుతుంది, అటు నుంచి 1 నంబర్‌కు మారుతుంది. అలాగే ఆమె కారు లెసైన్స్ ప్లేట్ పై కూడా 13 నంబర్ భయపెడుతుంటుంది. వీటిని బట్టి సినిమాలో ఆమె ఏదో అపాయాన్ని ఎదుర్కొంటుందని ప్రేక్షకులు ఒక అంచనాకు రావచ్చు. అనుకున్నట్టే ఆ సినిమాలో మారియన్ దారుణ హత్యకు గురవుతుంది. ఆ హత్య ఎందుకు జరిగింది అనే దాని చుట్టూ మిగతా సినిమా సాగుతుంది.ఇదొక్కటే కాదు హిచ్‌కాక్ సినిమాల్లో అనేక పాత్రల విధిని ‘నంబర్ 13’ నిర్దేశిస్తుంటుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే .. హిచ్ కాక్ సినీజీవితాన్ని కూడా ‘నంబర్ 13’ ఆదిలోనే గందరగోళంలో పడేసింది. 1922లో హిచ్‌కాక్ ‘నంబర్ 13’ అనే సినిమాతో కెరీర్ మొదలెట్టాడు! ఈ దురదృష్టపు సంఖ్యతో ఎలాంటి ప్రమాదాలుంటాయి అనే విషయాన్ని చెప్పడానికి ఎంతో ఉత్సాహంతో ఈ సినిమాను మొదలెట్టిన హిచ్‌కాక్‌పై ‘నంబర్ 13’ తన ఐరన్‌లెగ్ ప్రభావాన్ని చూపించింది.

ఎంతో స్క్రిప్ట్ వర్క్ చేసుకుని హిచ్‌కాక్ ఈ మూకీ సినిమాను మొదలెట్టాడు.ఇది షూటింగ్ దశకు వచ్చే సరికి ఎన్నో ఎదురుదెబ్బలు. ఈ సినిమా కోసం ఈ దర్శకుడే స్వయంగా నిర్మాతగా మారాడు. అయితే ఎన్నో మానసిక, ఆర్థిక సమస్యలు హిచ్‌కాక్‌ను చుట్టుముట్టాయి. కొన్ని సీన్లు తీసిన తర్వాత ఈ లెజెండరీ దర్శకుడి మొదటి సినిమా ‘నంబర్ 13’ హఠాత్తుగా ఆగిపోయింది!

తర్వాతి రోజుల్లో హిచ్‌కాక్ ఎప్పుడూ ఈ సినిమా గురించి మాట్లాడటానికి ఇష్టపడే వాడు కాదు. ఎన్నో పెద్ద హిట్లు సాధించిన తర్వాత కూడా తన తొలి సినిమా అనుభవాలను హిచ్‌కాక్ వివరించలేదు. చివరికి హిచ్‌కాక్ బయోగ్రఫీ రాసిన డొనాల్డ్ స్పాటో తొలి సినిమాల గురించి ప్రస్తావించాడు. ‘అది అత్యంత దుర్భర అనుభవం’ అంటూ‘నంబర్13’ సినిమా గురించి హిచ్‌కాక్ అభిప్రాయపడ్డాడు.

ఆగిపోయిన ఆ సినిమాకు తరువాతి కాలంలో తన సొంత వాళ్లే డబ్బు పెట్టి పూర్తి చేద్దామన్నా హిచ్‌కాక్ అందుకు ఇష్టపడలేదు.అయితే ఇందులో నటించిన నటీనటులు మాత్రం తరువాత హిచ్‌కాక్ సినిమాల్లో కనిపించారు. ప్రపంచాన్ని తన థ్రిల్లర్ సినిమాలతో హడలుకొట్టిన హిచ్‌కాక్ ఇలా ‘నంబర్ 13’ దెబ్బకు దడుచుకున్నాడు. ఆ అనుభవంతోనే ‘నంబర్ 13’ ను తన తదుపరి సినిమాల్లో ప్రమాద సూచికగా మార్చుకున్నాడు.

కొసమెరుపు ఏమిటంటే ……. హిచ్ కాక్ పుట్టింది కూడా 13 తేదీనాడే.

————–బి. జీవన్‌రెడ్డి

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!