ముసుగులు తొలగిపోతున్నాయి !

Sharing is Caring...

Govardhan Gande………………………………………..

దేశ సంపద సరిహద్దులను అతి సులభం గా ..అక్రమంగా దాటి విదేశాలకు చేరుకుంటోంది. ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి  రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం ..  పన్నులకు పంగనామాలు , తప్పుడు దివాళా ఎత్తుగడలు వంటి మార్గాల ద్వారా పోగేసిన డబ్బు విదేశాలకు తరలిపోతున్నది. నల్ల కుబేరులు అక్కడ  స్వేచ్ఛగా వ్యాపారాలు, పరిశ్రమలు, ట్రస్టులు నడుపు కుంటున్నారు.

ఈ వ్యవహారాలన్నీ PANDORA పేపర్స్ ద్వారా వెలుగు చూశాయి. 117 దేశాలకు చెందిన 600 మంది జర్నలిస్టులు (International Consortium of Investigative Journalists) ఎంతో శ్రమ తో పరిశోధించి బయటపెట్టిన వివరాలు ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం దర్యాప్తు చేయించి .. చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

చర్యల సంగతి అలా ఉంచితే  మన వ్యవస్థలోని లోపాలకు కారణాలేమిటి?  పెద్ద వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలకు  సన్నిహితులు, బ్యాంకులు రుణాలిచ్చే విధానం. రుణాలు ఇవ్వవలసిందిగా ప్రభుత్వ పెద్దలు చేసే సిఫారసులు, ఒత్తిడి, పన్నుల విధానంలో లోపాలు. పన్ను వసూలు చేసే విధానంలో అలవి మాలిన అవినీతి… ఇవిగాక మరెన్నో ఉండొచ్చు. ఇవన్నీ సాధారణ జ్ఞానం ఉన్న మన లాంటి మట్టి బుర్రలకే తెలుసు. 

ఇంత పెద్ద వ్యవస్థను నడిపించే “పెద్దల”కు తెలియదా అని సందేహం రావచ్చు. కానీ అందులో కూడా ఒక మతలబు ఉంది. ఇరువురి (ఇప్పించేవాడు,పుచ్చుకునేవాడు)కి లాభదాయకం కాబట్టి. పన్ను వసూలు విధానం కఠినంగా మార్చితే ఇరువురికి నష్టం కనుక. సులభంగా, ఎలాంటి ఆయాసం లేకుండా జేబులు నింపుకునే అవకాశాలను రాజకీయ నాయకత్వం కోల్పోతుంది కనుక. పన్నుల విధానం, వాటిని వసూలు చేసే విధానం ఇలాగే ఏడ్చి చస్తుంది.

ఫలితంగా దేశ శ్రమ సంపదలో సింహ భాగం ఇలా స్వేచ్ఛగా తరలి వెళ్లి పోతున్నది. ఇక్కడ పేదలు నిరుపేదలుగా, సంపన్నులు మరింత సంపన్నులు, కుబేరులు(మిలియనీర్లు,బిలియనీర్లు) గా మారిపోగలుగుతున్నారు. ఇలా అక్రమంగా ఇండియా నుంచి తరలి వెళ్లిన డబ్బు 2012 లెక్కల ప్రకారం రూ.63 లక్షల కోట్లు. ఇటీవల పండోరా పేపర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం మన దేశం,ఇంగ్లాండ్ కోర్టుల్లో దివాళా తీశానని ప్రకటించిన ఓ “పెద్ద” మనిషి విదేశాల్లో స్థాపించిన వ్యాపారాల విలువ లక్ష కోట్లు మాత్రమే! అంటే దివాళా ఏమిటో అర్ధమైపాయింది కదా.

ఇది మన దేశానికి మాత్రమే పరిమితమైన సంగతి కాదు.మన పొరుగు దేశం పాకిస్తాన్ తో సహా చాలా వర్ధమాన దేశాల్లో ఈ బాగోతం కొనసాగుతున్నది. పండోరా పేపర్స్ వెల్లడించిన జాబితాలో భారతీయ “పెద్ద”లు 380 మంది ఉన్నారట! వీరిలో పారిశ్రామికవేత్తలు, “పెద్ద” రాజకీయ నాయకులు, ఎంపీలు, సినిమా తారలు, రాజకీయ దళారులు, అండర్ వరల్డ్ డాన్ ల అనుచరులు ఉన్నారట. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 35 మంది దేశాధినేతలు, ప్రధాన మంత్రులు, మాజీలు ఉన్నారట!

ఇక చర్యల విషయానికొద్దాం … చర్యలు తీసుకుంటే సరిపోతుందా ? చాలదు. వ్యవస్థలో లొసుగులు లేకుండా.. మళ్ళీ మళ్ళీ తప్పులు దొర్లకుండా చూడాలి అపుడే ఇలాంటి అవినీతి బాగోతాలకు ఫుల్ స్టాప్ పడదు.  మన మీడియా కంటే విదేశీ మీడియా అవినీతి అక్రమాలు,తెర వెనక బాగోతాలను వెలికితీయడంలో ముందంజలో ఉంది. ఇక్కడ మన మీడియా సామాజిక బాధ్యతను మరచిపోయింది. (కొందరు మాత్రమే).

మీడియా చాలావరకు పతనమైపోయింది అనే విమర్శలున్నాయి. దీని వెనక రకరకాల కారణాలున్నాయి.మీడియా పెద్ద వ్యాపారంగా మారిపోవడం ఓ ప్రధాన కారణం. ఆ పెద్దలకు రకరకాల వ్యాపారాలుండడం.వాటి ప్రయోజనాల కోసం మీడియా ను టూల్ గా వాడుకుంటున్నారు. రాజకీయ నాయకత్వ కొమ్ముకాయడం యాజమాన్యాల పనిగా మారిపోయింది.

ఇన్ని బలమైన కారణాల క్రమంలో జర్నలిస్టుల పాత్ర చాలా పరిమితమై పోయింది. పండోరా పేపర్స్ పరిణామాన్ని ఓ సానుకూల సమాధానంగా చూద్దాం.వికీ లీక్స్, పనామా పేపర్స్ ఆ కోవ లోనివే. తాజాగా ఈ పండోరా పేపర్స్ అలాంటివే. ఇప్పటి వరకు వెల్లడైంది ప్రాథమిక సమాచారం మాత్రమే. పూర్తి సమాచారం వెలుపలికి వస్తే ఎంత మంది “పెద్దల” ముసుగు తొలగిపోతుందో చూడాలి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!