అతి పొడవైన వంతెన!!

Sharing is Caring...

Longest bridge Bhupen Hazarika Setu …………………………………

దేశంలో అతి పొడవైన వంతెనగా అస్సాంలోని భూపేన్ హజారికా సేతు మొదటి స్థానంలో నిలుస్తోంది. అస్సాం – అరుణాచల్ ప్రదేశ్ లను అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు 9. 15 కి.మీ. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మాత్రమే కాకుండా దేశ రక్షణలో కీలకమైన సేవలందించడానికి కూడా తోడ్పడుతుందన్న లక్ష్యంతో ఈ వంతెనను నిర్మించారు.

60 టన్నుల బరువు ఉండే భారీ యుద్ధ ట్యాంకులను సైతం తట్టుకునేలా పటిష్టంగా వంతెనను తీర్చిదిద్దారు. భారత సైన్యంలోని అర్జున్, టీ-72 వంటి యుద్ధ ట్యాంకులను ఈ వంతెన ద్వారా సరిహద్దుకు సులువుగా తరలించవచ్చు.

అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ చైనా పదే పదే కవ్వింపులకు పాల్పడుతోంది. ఏక్షణంలో ఏదైనా జరగవచ్చు. కీలకమైన సమయాల్లో మన సైనికులను సత్వరమే తరలించడానికి ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడుతుంది.పూర్తిగా స్తంభాలపై నిర్మించిన ‘భూపేన్ హజారికా సేతు’ అస్సాంలోని ఉత్తర ప్రాంతాన్ని అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతాన్ని కలుపుతుంది.

తిన్సుకియా జిల్లాలో దక్షిణాన ఉన్న ధోలా నుంచి ఉత్తరాన ఉన్న సాదియా గ్రామాన్ని కలుపుతూ బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్ పై నిర్మించడంతో దీనిని ధాలా సాదియా వంతెనగా కూడా పిలుస్తారు.టిబెట్ లో పుట్టి అరుణాచల్ లో అడుగుపెట్టే లోహిత్ నది అస్సాంలో బ్రహ్మపుత్రలో కలుస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్ లోని బౌద్ధారామాలను, ప్రకృతి అందాలను, అంతర్జాతీయ సరిహద్దును వీక్షించాలనుకునే పర్యాటకులు ఈ వంతెన మీదుగా వెళ్లవచ్చు. అస్సాంలోని తిన్సుకియా జిల్లాలోనూ పలు పర్యాటక క్షేత్రాలున్నాయి. తిన్సుకియాకి 17 కి.మీ. దూరంలోని బెల్ టెంపుల్ లోని శివుడికి ఒక గంట బహూకరిస్తే కోర్కెలు నెరవేరతాయన్నది భక్తుల నమ్మకం.

ఇక్కడ ఉన్న పెద్ద మర్రి చెట్టుకు భక్తులు గంటను కట్టి తమ కోర్కెలు విన్నవించుకుంటారు. దీనితో ఈ ఆలయానికి బెల్ టెంపుల్ అని పేరు వచ్చింది. భూపేన్ హజారికా సేతును హైదరాబాద్ కి చెందిన నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ నిర్మించింది.

2011 నవంబరులో నిర్మాణ పనులను ప్రారంభించి 2017లో పూర్తి చేసింది. దాదాపు రూ. 1,000 కోట్లు ఖర్చు పెట్టారు. అస్సాంకి చెందిన కవి, రచయిత, సంగీతకారుడు, నేపథ్య గాయకుడు, నటుడు, నిర్మాత, భారత రత్న భూపేన్ హజారికా పేరును ఈ వంతెనకు పెట్టారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!