జైలులో ఉండే రికార్డు మెజారిటీతో గెలిచిన లీడర్ !

Sharing is Caring...

జార్జి ఫెర్నాండెజ్ … సోషలిస్టు .. ఉద్యమకారుడు .. ట్రేడ్ యూనియన్ నేత, ఎన్నో ఆందోళనలకు , ప్రజాపోరాటాలకు నాయకత్వం వహించిన నాయకుడు.జైల్లో ఉండే ఎన్నికల్లో పోటీ చేసి 3లక్షల 34 వేల ఓట్ల మెజారిటీ తో సంచలన విజయం సాధించి,రికార్డు సృష్టించిన నాయకుడు. 1975 లో శ్రీమతి ఇందిర దేశంలోఎమర్జెన్సీ పెట్టారు. ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి జైళ్లలో బంధించారు.

అపుడే ఫెర్నాండెజ్ పై బరోడా డైనమేట్ కేసు బనాయించారు. ఈ క్రమంలోనే ఫెర్నాండెజ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. అయినప్పటికీ కలకత్తాలో ఆయనను అరెస్ట్ చేసి తీహార్ జైలుకి పంపారు. అంతలో 1977 లోకసభ ఎన్నికలు వచ్చాయి. ఫెర్నాండెజ్ జైల్లోనే నామినేషన్ ఫారం పై సంతకం చేసి ముజాఫర్పూర్ లోకసభ స్థానం నుంచి పోటీ చేశారు.

మాజీ ఎంపి, సుప్రీంకోర్టు న్యాయవాది సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్  ఫెర్నాండెజ్ నామినేషన్ ఫారాలు నింపారు.ఆయనే నామినేషన్ ఫారాలు దాఖలు చేశారు. అలాగే ఎన్నికల ప్రచారం చేయడం లో సహాయపడ్డారు.ఫెర్నాండెజ్ తరపున ఆయన తల్లి .. చెల్లెలు ఉధృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. వందలాది మంది మద్దతుదారులు స్వచ్చందంగా వచ్చి ప్రచారం లో పాల్గొనే వారు.

“ఫెర్నాండెజ్ చేతులకు సంకెళ్లు వేసిన ఫోటో” నాటి ప్రచారం లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఓట్ల వర్షం కురిపించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన నితీశ్వర్ ప్రసాద్ కి 62,470 ఓట్లు మాత్రమే వచ్చాయి. సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన రాందేవ్ శర్మ కు 26,408 ఓట్లు వచ్చాయి. నాటి ఎన్నికల్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం పరాజయం పాలైంది. ఇందిర ఆమె తనయుడు సంజయ్ గాంధీ ఇద్దరూ ఓడిపోయారు.

మురార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది. తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం అదే. జనతా సర్కార్ లో ఫెర్నాండెజ్ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు ఫెర్నాండెజ్ 1950 నుంచి 1960 వరకు దశాబ్దకాలం పాటు బొంబాయి కేంద్రం గా పలు ఆందోళనలు,ప్రజా పోరాటాలు చేశారు. దక్షిణ బొంబాయి నుంచి 1967లో లోకసభకు పోటీ చేసి కాంగ్రెస్ నేత ఎస్ కే పాటిల్ పై గెలిచారు.

అఖిల భారత రైల్వే సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా చేస్తూ ఎన్నోపోరాటాలు చేపట్టారు. 1974లో దేశవ్యాప్త రైల్వే బంద్ కు నాయకత్వం వహించారు. తర్వాత వీపీ సింగ్ సర్కార్ లో రైల్వే మంత్రిగా చేశారు. అపుడే కొంకణ్ రైల్వేప్రాజెక్టు కు రూపకల్పన చేశారు. వాజపేయి హయాంలో రక్షణ శాఖ మంత్రిగా చేశారు.

కార్గిల్ యుద్ధం,పోఖ్రాన్ లో రెండో సారి అణు పరీక్షలు జార్జి ఫెర్నాండెజ్ రక్షణ మంత్రిగా ఉన్నపుడే జరిగాయి. జార్జి ఫెర్నాండెజ్ కర్ణాటక లోని మంగళూరు లో పుట్టారు. మహారాష్ట్రలోని బొంబాయి లో  ఉద్యమాలు చేసి .. అక్కడో సారి ఎంపీగా గెలిచి .. ఆ తర్వాత బీహార్ లో లోని ముజఫర్పూర్ నుంచి విజయం సాధించారు.  ఎంతో చరిత్ర ఉన్న ఫెర్నాండెజ్ 88 ఏళ్ళ వయసులో 2019 లో కన్నుమూసారు.  

——————KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!