మన దేశంలో కొండల్లో.. కోనల్లో ఎన్నో దేవాలయాలున్నాయి. వాటిలో జాత్మయి మాత మందిర్ ఒకటి. ఛత్తీస్ ఘడ్ లో ఉన్న ప్రసిద్ధ దేవాలయాల్లో ఇదొకటి. ఈ జాత్మయి మాత మందిర్ రాయపూర్ కి 85 కిలోమీటర్ల దూరం లో ఉంది. అడవిలో నిర్మించిన ఆలయం ఇది. జాత్మయి మాతను ఇక్కడ కొండ దేవతగా కొలుస్తారు. కొన్ని వందల ఏళ్ళ క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.
ఈ పురాతన ఆలయాన్ని కొన్నాళ్ల క్రితం మరింత అందంగా తెల్ల చలువరాళ్లతో పునర్నిర్మించారు. పక్కనే హొయలు పోతూ జాలువారే జలపాతం ఇక్కడి ప్రత్యేకత. జలపాతం నీళ్లు అమ్మవారి పాదాలను నిరంతరం కడుగుతుంటాయి. ఇక్కడ ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. కాలుష్యం లేని నిశ్శబ్ద ప్రదేశాలలో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు.
ప్రకృతి ప్రేమికులకు బాగా నచ్చే ప్రదేశం ఇది.ఆలయ నిర్మాణ శైలి… గోడలపై అందమైన చిత్రాలు ఆకట్టుకునే రీతిలో ఉంటాయి. పచ్చని ప్రకృతి నడుమ వెలసిన ఆలయం .. చుట్టూ ఉన్నఅందాలను చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఏడాది పొడవునా ఎపుడైనా ఆలయాన్ని సందర్శించవచ్చు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలం లో యాత్రీకులు ఎక్కువగా వస్తుంటారు. అపుడు వాతావరణం ఆహ్లదకరంగా ఉంటుంది.
నవరాత్రి పర్వదినాల్లోఈ పవిత్ర స్థలంలో రోజూ దీపాలు వెలిగిస్తారు. ఆలయాన్ని సుందరంగా అలంకరిస్తారు. ఆసమయంలో వెళితే కొంత జనంతో కూడిన సందడి ఉంటుంది. అడవుల మధ్యలో ఉన్న కారణంగా ఈ జాత్మయి ఆలయం పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ప్రక్కనే ఉన్న ఘటరాణి జలపాతం అదనపు ఆకర్షణ. పక్కాగా ప్లాన్ చేసుకుంటే ఆ సుందర .. ప్రశాంత వాతావరణంలో ఒక రోజు మొత్తం గడిపి రావచ్చు.