Taadi Prakash ……………………………………………….
ONCE UPON A TIME, 204 YEARS AGO………………………………….
అప్పుడెప్పుడో, 1960 దశకంలో, ఏలూరులో, పచ్చగా కళకళ్ళాడుతూ పిట్టలతో, పూలతీగలతో కణ్వమహర్షి ఆశ్రమంలా వుండే మా యింట్లో ఒక మునిమాపు వేళ విన్నాను – కార్ల్ మార్క్స్ అనే పేరు. ఎర్ర రంగు కాగితంలో చుట్టి నా చిన్నారి చేతిలో పెట్టినట్టు – మా నాన్న తాడి అప్పలస్వామి యిచ్చిన బహుమతి అది. ఎలిమెంటరీ స్కూలు పూర్తయి, ఆరో తరగతి సుబ్బమ్మాదేవీ హైస్కూలు లో చేరే వేళకి, అతను జర్మన్, గొప్ప మేధావి, చాలా పుస్తకాలు రాశాడనీ తెలిసింది.
అమెరికా, రష్యా, లెనిన్, కమ్యూనిజం, కార్ల్ మార్క్స్ గురించి మానాన్న చెబుతూ వుండేవాడు. కమ్యూనిస్టు నాయకుడూ, మంచి వాగ్ధాటి గలవాడూ గనక ఎంతో ఇంటరెస్టింగ్ గా చెప్పేవాడు. మా జమ్ము ఇంటి వసారాలో పెద్దక్క సుశీలా, చిన్నక్క లత, ఆర్టిస్ట్ మోహన్, మా చెల్లి శకుంతల, నన్నూ కూర్చోబెట్టుకుని మా కళ్ళ ముందు ఒక గ్రేట్ రష్యన్ డ్రీమ్ ఆఫ్ రివల్యూషన్ ని ఆవిష్కరించేవాడు.
మా నాన్నకి సంస్కృతం తెలుసు. హిందీ బాగా వచ్చు. ఇంగ్లీషులో ఈజీగా మాట్లాడేవాడు. ప్రపంచాన్ని కళ్ళ ముందు పరిచేవాడు. సూర్యుడూ, చంద్రుడూ, మనకెంత దూరంలో వున్నారు? కాంతి సంవత్సరం అంటే ఏమిటి? మనం ఏ గెలాక్సీ లో వున్నాం? సూయజ్ కాల్వ ఎక్కడ తవ్వారు? ఎంత కాలం పట్టింది? క్యూబా అమెరికాకి ఎన్ని మైళ్ళ దూరంలో వుంది? భగవద్గీత ఏం చెబుతోంది? మేనిఫెస్టోలో మార్క్స్ ప్రతిపాదించిందేమిటి? రెండో ప్రపంచ యుద్ధకాలంలో ట్రూమన్ అమెరికా అధ్యక్షునిగా వుండడం వల్ల జరిగిన నష్టం ఏమిటి?
నార్మండీ లాండింగ్ అంటే… ఏం జరిగింది? యాల్టా, పోట్స్ డామ్ చర్చల ఫలితం ఏమిటి? ‘కొమింటర్న్’ అంటే? ఎం.ఎన్. రాయ్ సప్లిమెంటరీ థీసిస్ ఎందుకు సబ్మిట్ చేశాడు. కాస్ట్రో మాట విని చేగువేరా బొలీవియా వెళ్లకుండా వుండాలి కదా! మొత్తం వియత్నాం ని ఒక్క పిడికిలిగా హోచిమిన్ ఎలా నిలబెట్టాడు? సాంస్కృతిక విప్లవం పేరు మీద చైర్మన్ మావో చేసిన అరాచకాలేమిటి? గాంధీజీ లాగా భారతీయ ఆత్మని మన కమ్యూనిస్టులు ఎందుకు పట్టుకోలేకపోయారు?
కూక్లక్స్ క్లాన్ ఏం చేస్తుంది? ఆరెస్సెస్ ఎజెండా ఏమిటి? మార్టిన్ లూథర్ కింగ్ ని ఎందుకు చంపారు? మన బౌద్ధాన్ని మనమే ఎలా కోల్పోయాం?జెన్నీవాన్ వేస్ట్ ఫాలెన్ కార్ల్ మార్క్స్ నే ఎందుకు ప్రేమించింది? ఎంగెల్స్ మార్క్స్ కి ఎంత డబ్బు పంపేవాడు? మార్క్స్ రోజుకి ఎన్ని గంటలు చదివేవాడు? కులాన్నీ, అంబేద్కర్ నీ విస్మరించి కమ్యూనిస్టులు తమ గొయ్యిని బ్రిలియంట్ గా ఎలా తవ్వుకున్నారు? కమ్యూనిస్టు మేనిఫెస్టో ని స్మగుల్ చేసిందెవరు? గతితర్కం, చారిత్రక భౌతికవాదం అంటే ఏమిటి? హెగెల్ ఏమని సూత్రీకరించాడు?
సర్ ప్లస్ వాల్యూ ప్రాధాన్యం ఏమిటి? దాన్ని డిస్కవర్ చేయడం ఎంత కీలకమైంది? Capital రాయడానికి ఎంత కాలం పట్టింది? మొత్తం మార్క్స్ కాంట్రిబ్యూషనే, నేను అండగా నిలిచాను అంతే అని చెప్పడంలో ఎంగెల్స్ నిబద్ధత ఎంత గొప్పది! త్యాగం, నిజాయితీ, ఔదార్యం కలిసిన ఎంగెల్స్ వ్యక్తిత్వం ఎలా ఉన్నతమైనది? మార్క్స్, ఎంగెల్స్ తెగువ, మొండిధైర్యం, పోరాటపటిమ వల్ల మానవాళికి జరిగిన మహోపకారం ఏమిటి? – ఇలాంటి సవాలక్ష విషయాల్ని మా నాన్న ప్రవాహంలా చెబుతూనే వుండేవాడు. ఆ నాన్ స్టాప్ ఉపన్యాసాల వల్ల, ఈ కార్ల్ మార్క్స్ అనే నాయాలు తక్కువ నాకొడుకేం కాదనిపించింది.
మార్క్స్ లండన్ లో బ్రిటిష్ లైబ్రరీకి (దాన్ని మ్యూజియం అంటారు) పొద్దున్నే తాళాలు తీసే టైంకి వెళ్ళేవాడు. రాత్రి, అక్కడివాళ్లు లైబ్రరీ మూసే టైం అయిందని చెప్పేదాకా మార్క్స్ కదిలేవాడు కాదు. అలా పుస్తకాలు చదువుతూ ఏళ్ల తరబడి కూర్చోవడం వల్ల ఆయన నడుమూ, కాళ్లూ దాదాపు చచ్చుబడిపోయాయి. అధ్యయనం … అధ్యయనం – నోట్సు తీసుకోడం, పుస్తకాలు రాయడం – జీవితాంతమూ యిదే పని చేశాడు మార్క్స్. ఆయన భార్య జెన్నీ బహు అందగత్తె. జర్మన్ రాజ కుటుంబానికి చెందిన ‘రాణి’ లాంటిది.
చేతిలో చిల్లిగవ్వ లేని మార్క్స్ ని యిష్టపడి, జీవితాంతం ఆయనతోనే వుంది. వాళ్లకి ఏడుగురు పిల్లలు. పేదరికం వల్ల ఆస్పత్రులకీ, మందులకీ డబ్బు లేక మార్క్స్ కొడుకులు ఇద్దరు చనిపోయారు. బ్రిటన్ లో బట్టల మిల్లుల వ్యాపారి కొడుకైన ఫ్రెడరిక్ ఎంగెల్స్, మార్క్స్ కి అవసరమైనపుడు కొంత డబ్బు పంపేవాడు. ఒకసారి అయిదారేళ్ళ వయసున్న మార్క్స్ కొడుకు చనిపోయినపుడు అంత్యక్రియలకి డబ్బుల్లేవు. అప్పుడు ఎంగెల్స్ కి లేఖ రాస్తూ.. మళ్లీ నిన్ను డబ్బు పంపమని అడిగేకంటే యీ చేతివేళ్ళు విరగ్గొట్టుకుంటే బావుణ్ణు- అని మార్క్స్ బాధపడ్డారు.
ఇలా ఎన్ని కష్టాలు వచ్చినా, జర్మనీ, మరికొన్ని దేశాలు మార్క్స్ ని బహిష్కరించినా, ఇళ్ళు మారడానికీ, తినడానికీ డబ్బు చాలకపోయినా జెన్నీ ధైర్యంగా మార్క్స్ కి అండగా నిలబడింది. ఆమె గనక లేకపోతే మార్క్స్ మనకి లేనట్టే” అని మా నాన్న ఎన్నోసార్లు చెప్పాడు.అలా పదో క్లాసు నాటికే పరమేశ్వరుడు, జీసస్ క్రైస్ట్, కార్ల్ మార్క్స్ అనే ముగ్గురే యీ ప్రపంచంలో గొప్పవాళ్ళని తెలుసుకోగలిగాను.
మధ్యలో ఈశ్వరుడేమిటీ? మా నాన్న లయబద్ధంగా, ప్రతి పదం స్పష్టంగా అంటూ ‘ఎవ్వనిచే జనించు’ పద్యం కొన్ని డజన్ల సార్లు చెప్పి వుంటాడు.కట్ చేస్తే, ఇంటర్మీడియెట్ – విజయవాడ. తక్కువగా మాట్లాడే మోహన్, జనంతో కళకళలాడే విశాలాంధ్ర ఆఫీస్. బుక్ హౌస్ లో మార్క్స్ జీవిత చరిత్ర పుస్తకం కొని చదివితే నిజంగానే మతిపోయింది. ఒక్క మనిషి ఒక జీవితకాలంలోనే అన్ని పనులు చేయడమా? పర్సెవరెన్స్, టెనాసిటీ … లాంటి మాటలు మార్క్స్ కృషి ముందు దూదిపింజల్లా ఎగిరిపోతాయి.
pl.read it also ……….. మహామానవ స్వప్నశిల్పి – మార్క్స్ !(part 2)