తెలుగు సినీ వ్యాసుడీ కమలాకరుడు !

Sharing is Caring...

Bharadwaja Rangavajhala ……………………………………………………..

మన తర్వాత పౌరాణికాలుంటాయా అని ఓ సందర్భంలో మహానటుడు ఎన్టీఆర్ తన పక్కనున్న ఓ దర్శకుడితో సందేహం వెలిబుచ్చారట. నిజంగానే డెబ్బైల్లో పలచపడ్డ పౌరాణికాలు..ఎయిటీస్ కి వచ్చేసరికి పూర్తిగా కనుమరుగయ్యాయి.తెలుగు తెర తొలినాళ్లలో ఓ వెలుగు వెలిగిన పౌరాణిక చిత్రాలు ఆ ప్రాభవాన్ని కోల్పోయాయి. తీసిన చిత్రాలు తక్కువే అయినా…పౌరాణికాలు తీయాలంటే ఆయనే తీయాలనిపించుకున్న దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. కమలాకర పుట్టింది మచిలీపట్నంలో.  చదివింది అక్కడే నోబుల్ కాలేజీలో.

చదువుకునే రోజుల నుంచి కమలాకరకు నాటకాలన్నా…సినిమాలన్నా ఓ ఇంట్రస్టు.ఆ రోజుల్లో బందరు నుంచి వెలువడే పాపులర్ వీక్లీ కృష్ణాపత్రికలో సినీఫాన్ పేరుతో సమీక్షలు రాస్తూ ఉండేవారు. ఆయన రాసిన సమీక్షలు చదివి మద్రాసు పిలిపించారు హెచ్.ఎమ్.రెడ్డి.అలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కమలాకర పౌరాణిక బ్రహ్మ అనిపించుకున్నారు. కె.వి.రెడ్డి దగ్గర యోగి వేమన, గుణసుందరి కథ, పాతాళబైరవి చిత్రాలకు అసిస్టెంట్ గా పనిచేసిన కమలాకర తొలి చిత్రం విజయావారి చంద్రహారం.తను తీసిన చిత్రాలకు సంబంధించి చాలా నిర్ధిష్టంగా ఉండేవారు కమలాకర. ఆయనలోని క్రమశిక్షణ, పరిశోధనాత్మక దృక్పథం ఎన్టీఆర్ ను ఎట్రాక్ట్ చేసాయి.

కమలాకర డైరక్ట్ చేసిన ఎక్కువ సినిమాల్లో ఎన్టీఆరే హీరో. తొలి చిత్రం చంద్రహారం, రెండో చిత్రం పెంకిపెళ్లాం రెండూ బాక్సాఫీసు దగ్గర పెద్ద విజయాలు నమోదు చేయలేదు. ఫెయిల్యూర్ డైరక్టర్ అనిపించుకున్న కమలాకరను పిలిచి పాండురంగమహత్యం తీసే బాధ్యత అప్పగించారు ఎన్టీఆర్.పాండురంగ మహత్యం దర్శకుడుగా కమలాకర ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ తర్వాత కమలాకర వెనక్కి తిరిగి చూడలేదు.

పాండురంగ మహత్యం తర్వాత కమలాకరకు బాగా పేరు తెచ్చిన చిత్రం నర్తనశాల. పాత్రల వ్యక్తిత్వాలు, స్వభావాలు చెడకుండా తెరపై ఆవిష్కరించడం కమలాకర స్పెషాల్టీ. ఎన్టీఆర్ ను కన్విన్స్ చేసి బృహన్నల గెటప్ వేయించి వెంపటి వారితో నృత్యశిక్షణ ఇప్పించి మరీ తెర మీద చూపిన విధం మామూలు వ్యవహారం కాదు.తెలుగు టాకీ యుగం ప్రారంభంలో ద్రౌపదీ మాన సంరక్షణం, ద్రౌపదీ వస్త్రాపహరణం అనే రెండు చిత్రాలు వచ్చాయి. ఆర్ధికంగా విజయవంతమైన వస్త్రాపహరణం కంటే…మాన సంరక్షణలోనే విలువలు ఉన్నాయని కామేశ్వర్రావు రాసిన రివ్యూ ఆయన్ను స్టార్ ను చేసింది.

నటీనటులను ఎంపిక చేయడం దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ కమలాకర చాలా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. కీచకుడు పాత్రకు ఎస్వీఆరా అన్నవాళ్లు ఖంగారు పడేలా ఆ పాత్రను నడిపించారు కమలాకర. కీచకుడు పాత్రకి శివాజీ గణేశన్ ను తీసుకుంటే బాగుంటుంది కదా అని ఓ దశలో పింగళి సలహా చెప్పారు. కమలాకర విన్లేదు …నర్తనశాల చిత్రంలో సావిత్రి మొదట ద్రౌపదిగా నటించనంటే పట్టుపట్టి కన్విన్స్ చేశారు కమలాకర. తర్వాత నర్తనశాలలో సావిత్రి నటన ఏస్థాయినందుకున్నదీ అందరికీ తెలుసు.

పాండవ వనవాసం చిత్రంలో భీముడు, ద్రౌపది హిమగిరి సొగసులు చూస్తూ పరశించే సమయంలో పైన యక్షుల నృత్యాన్ని పెట్టడం ఆయన సందర్భ శుద్ధికి నిదర్శనం. హిమగిరి సొగసులు అంటూ కమలాకర అంతంగాన్ని మన కళ్లెదుట నిలబెట్టే గీతం ఉందీ చిత్రంలో.కామేశ్వరరావు చేతుల్లో రూపుదిద్దుకున్న శ్రీ కృష్ణావతారం, వీరాంజనేయ, శ్రీ కృష్ణ విజయం, బాల భారతం తదితర చిత్రాలు సెల్యులాయిడ్ పౌరాణిక నిఘంటువులుగా వర్ధిల్లుతున్నాయి. తను తీసే చిత్రంలో పద్యాలను ఆయన కోరి మరీ రంగస్థలం మీద పాపులర్ అయిన వాటినే ఎంచుకునేవారు. అదే ఆయన చిత్రాలకు కమర్షియల్ సక్సస్ అందించేది.
సురేష్ మూవీస్ కోసం ఆయన తీసిన శ్రీ కృష్ణ తులాభారం కూడా ఇదే వరసలో సాగుతుంది.

స్థానం వారి పాపులర్ సాంగ్ మీర జాలగలడా ను జమునతో అభినయింప చేశారు కమలాకర. కేవలం పౌరాణిక చిత్రాలే కాదు…చారిత్రాత్మక చిత్రాలూ తీసి విజయపతాకం ఎగరేశారు కమలాకర కామేశ్వరరావు. చాలా చిన్న వయసులోనే పఠనాభిలాష మొదలైంది కమలాకరలో.కనిపించిన ప్రతి పుస్తకం పత్రిక తప్పని సరిగా చదివేసేవారాయన. తొలి తరం ఫిలిం జర్నలిస్ట్ కూడా ఆయనే. అలనాటి దర్శక నిర్మాతల్ని బెంబేలెత్తించిందిన సమీక్షకుడు కూడా ఆయనే. ఈ చదివిన తనం ఆయన తీసిన చిత్రాల్లోనూ కనిపించేది. తెలుగు సినిమాకు రంగస్థలం ప్రసాదించిన వర ప్రసాదం పింగళి నాగేంద్రరావు అంటారు వేటూరి సుందరరామ్మూర్తి. అది పాక్షిక సత్యం మాత్రమే.

పింగళి రచనలన్నీ దాదాపు కృష్ణాపత్రికలోనే అచ్చయ్యేవి. వంగదేశ వటురాయలు అని ముట్నూరి వారి దర్బారులో పింగళి వారి పేరు.కృ‌ష్ణాపత్రికలోనే పింగళితో కమలాకరకు స్నేహం కుదిరింది. ఆయన ద్వారానే కె.వి.రెడ్డి గుణసుందరి కథకు పింగళి రచన చేశారు. అందుకే తను తీసిన కాళిదాసుకు పింగళి సాహచర్యం కోరుకున్నారు కమలాకర.తెలుగు సాహితీ వల్లభుడు శ్రీ కృష్ణదేవదాయలు అంటే సహజంగానే తెలుగు కవులకు ప్రీతి ఎక్కువ. ఆ భక్తి భావనతోనే పింగళి నాగేంద్రరావు భారతి పత్రిక కోసం నారాజు అనే నాటకాన్ని రాశారు.సినిమా కోసం మరోసారి కృష్ణరాయని పాత్రను తీర్చే అవకాశం కమలాకర ద్వారా వచ్చింది. తను తీసిన చారిత్రాత్మక చిత్రం మహామంత్రి తిమ్మరుసుకూ పింగళితోనే రాయించుకున్నారు కమలాకర . అందులో యుగళగీతాలు సైతం తనదైన శైలిలో ఆహ్లాదంగా రాయించుకున్నారు.

కమలాకర కేవలం పౌరాణిక చారిత్రాత్మక చిత్రాలే కాదు…సూపర్ హిట్ జానపదాలూ తీసి మెప్పించారు. సాంఘిక చిత్ర నిర్మాణంలోనూ తానేం తక్కువ కాదని ప్రూవ్ చేసుకున్నారు. కాంభోజరాజు కథ, రేచుక్క పగటి చుక్క లాంటి చిత్రాలతో జానపద చిత్రాలు తీయడంలోనూ ఘటికుడనిపించుకున్నారు.ఇక కమలాకర దర్శకత్వంలో వచ్చిన సాంఘిక చిత్రాల్లో భారీ విజయాలు అందుకున్నవి తక్కువే. కాకపోతే సెన్స్ బుల్ డైరక్టర్ అని మాత్రం అనిపించుకున్నారు .శోభ, పెంకిపెళ్లాం, కలసిన మనసులు, మాయనిమమత, జీవితాశయం వంటి చిత్రాలతో ఆయన ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు.ఆయన తీసిన సాంఘికాల్లో గుండమ్మ కథ ప్రత్యేకం. ఆ చిత్రం కమలాకరకు మరచిపోలేని విజయాన్ని అందించింది.

సూర్యకాంతం, ఛాయాదేవిల హాస్యం, వారికితోడు రమణారెడ్డితో ఆయన చేసిన మ్యాజిక్ ఇప్పటికీ సరికొత్తగానే ఉంటుంది. ఇక ఆయన మిత్రుడు పింగళి, ఘంటసాల కాంబినేషన్ లో వచ్చిన పాటలు ఇప్పటికీ మధురాలే.అయితే ఈ సినిమాకు కమలాకర కండక్టర్ మాత్రమే అనీ .. డ్రైవర్ సీటులో చక్రపాణిగారు కూర్చుని నడిపించారనీ అంటారు.ఏనాడూ తనకు ఇంత కావాలని ఆయన ఏ నిర్మాతనూ అడగలేదు. ఎవరు ఎంత ఇస్తే అంతే స్వీకరించారు.. తనను అర్ధం చేసుకున్న నిర్మాతలకే సినిమాలు చేశారు.తనకు స్వేచ్చ దక్కని ఏరియాల నుంచి మౌనంగానే నిష్క్రమించేవారు.

చివరి రోజుల్లో ఆయన తీసిన కురుక్షేత్రం, వినాయక విజయం రెండూ రెండు విధాలుగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ తో పోటీగా కురుక్షేత్రం విడుదలైతే…తెలుగులో వచ్చిన చివరి సక్సస్ ఫుల్ పౌరాణిక చిత్రంగా వినాయక విజయం సెన్సేషన్ క్రియేట్ చేసింది.అద్భుతమైన చిత్రాల రూపకర్తగా మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన కమలాకర కామేశ్వరరావు తన 88వ ఏట జూన్ 29, 1998లో తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యారు.తన చిత్రాలకు అజరామర సంగీతాన్ని అందించడమే కాక హిట్ సాంగ్స్ పాడిన ఘంటసాలబ్బాయిలో కమలాకర ఉన్న ఫొటో ఇక్కడ దఖలు పరుస్తున్నానండి …

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. యూవీరత్నం August 11, 2021
error: Content is protected !!