Bharadwaja Rangavajhala …………………………………
forgotten director…………………..
‘విక్రమ్’ సినిమా చూస్తుండగా నాకు డైరెక్టర్ రాజశేఖర్ గుర్తొచ్చారు. ఆ రోజుల్లో అంటే ఎయిటీస్ లో రజనీకాంత్ కమల్ హసన్ లతో వరసగా సూపర్ హిట్ కమర్షియల్ సినిమాలు రూపొందించిన రాజశేఖర్ గురించి ఎవరూ మాట్లాడడం లేదేంటబ్బా అనిపించింది.
మెగాస్టార్ చిరంజీవికి గొప్ప పేరు తెచ్చిన ‘పున్నమినాగు’ సినిమా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందినదే.
అప్పటికి దక్షిణ భారతంలో అత్యధిక బడ్జెట్ అంటే కోటి రూపాయల వ్యయంతో రూపొందిన ‘ఏజెంట్ విక్రమ్’ అనే కమల్ హసన్ సినిమా కూడా రాజశేఖర్ డైరెక్ట్ చేసినదే.
రజనీతో ఆయన చేసిన ‘తంబిక్కి ఎంద ఊరు’ సినిమా అయితే క్లాసిక్ మాస్ సినిమాగా నిల్చిపోయే లక్షణాలు పుష్కలంగా ఉన్న సినిమానే. అయినా బాలచందర్, బాలూమహేంద్ర, భారతీరాజా, మహేంద్రన్ లను కోట్ చేసినట్టుగా రాజశేఖర్ ను కోట్ చేయరు … వేదికల మీద తల్చుకోరు.
మాస్ డైరెక్టర్లంటే ఎందుకంత చులకన. తెలుగులోనూ అంతే … ఎస్ డి లాల్ , కెఎస్ఆర్ దాస్ లకంటే కె.వి.రెడ్డి బిఎన్ రెడ్డి ఆదుర్తి, బాపు, విశ్వనాథ్ పేర్లే ఎక్కువగా భజన చేస్తూంటారు. అయితే … హిట్స్ కోసం మాత్రం ఈ డైరెక్టర్లే కావాలి మళ్లీ. అంచేత ఆ విషయం పక్కన పెడితే … యాక్షన్ సన్నివేశాలను ఆడియన్స్ కు ఒళ్లు గగుర్పొడిచే రేంజ్ లో తీయడం రాజశేఖర్ కు బాగా తెల్సు.
‘ధర్మదొరై’లో … రజనీకాంత్ తన చేతికి తగిలిన బుల్లెను తనే పీకేసి గాయం మీద విస్కీ పోసి దాన్ని సిగెరెట్ లైటర్ తో వెలిగించి రెండో చేత్తో ఆ మంట ఆర్పుతారు. దాదాపు ఈ సీను ‘లంకేశ్వరుడు’లో దాసరి రిపీట్ చేశారు కూడా. ఇలాంటి మాస్ సీన్స్ తీసేప్పుడు ఈ డైరెక్టర్ల ఇమాజినేషన్ అద్భుతం అనిపిస్తుంది …లాజిక్ పక్కన పెట్టేసి రెచ్చిపోతారు …అదే ఆడియన్స్ కు పట్టేసి కాసుల వర్షం కురుస్తుంది.
తెలుగులో చిరంజీవి, కోదండరామిరెడ్డిల కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడు’ సినిమా తమిళ్ లో అల్లు అరవిందే రీమేక్ చేసినప్పటికీ ఆ సినిమాకు రాజశేఖర్ తో డైరెక్షన్ చేయించారు. అందులో రజనీ తమ్ముడుగా కాసేపు చిరంజీవి కనిపిస్తాడు. అలా … ‘పున్నమినాగు’ తర్వాత రాజశేఖర్ డైరెక్షన్ లో చిరంజీవి కనిపించిన సినిమా ‘మా పిల్లైనే’.
రాజశేఖర్ డైరెక్షన్ లో కమల్ హసన్ నటించిన సూపర్ హిట్ తమిళ సినిమాలను ఏడిద రాజా తదితరులు తెలుగు లో డబ్ చేసి హిట్స్ కొట్టేవారు. రాజశేఖర్ దర్శకుడు కావడానికి ముందు రచయిత. పెన్ను పట్టుకునే ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చారాయన. అదో తరహా పూనకం సినిమాలు తీసిన రామనారాయణ తదితరులతో కల్సి రచనలు చేసేవారాయన.
‘హున్నిమేయ రథరియల్లి’ అనే కన్నడ సినిమా ద్వారా రాజశేఖర్ డైరెక్టర్ అయ్యారు. అదే సినిమా తెలుగులో ‘పున్నమినాగు’గా రూపుదిద్దుకుంది. అదే సినిమా హిందీలో మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రలో ‘జీనేకీ అర్జూ’ అనే పేరుతో వచ్చింది. దానికీ రాజశేఖరే డైరెక్టర్.
82 లో ఎవిఎమ్ వారికి ‘అమ్మ’ అనే టైటిల్ తో ఆయన చేసిన సినిమా విజయం సాదించలేకపోయింది.
అయితే … ‘మలయూర్ మొబత్తియాన్’ అనే సినిమా 83లో వచ్చింది. అది రాజశేఖర్ కు తమిళ్ లో వచ్చిన తొలి హిట్. ఆ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఆ తర్వాత రాజశేఖర్ సినిమాలకు దాదాపుగా రాజానే సంగీత దర్శకుడు.
విజయ్ కాంత్ కు కూడా ‘కూలీకారన్’ లాంటి సక్సస్సులు ఇచ్చారు.రాజశేఖర్ చివరి సినిమా ‘ధర్మ దొరై’ … రజనీకాంత్ హీరో. ఆ సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాకు సంబంధించిన వేడుకలకు హాజరై వస్తూండగానే కార్ యాక్సిడెంట్ అయి కన్నుమూశారు. 91 లో ఆయన కన్నుమూయడానికన్నా రెండేళ్ల ముందు వచ్చిన రాజశేఖర్ తెలుగు సినిమా ‘బామ్మమాట బంగారుబాట’ లో కూడా సూపర్ కార్ యాక్సిడెంట్ అయ్యి … నూతన్ ప్రసాద్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది.
డబ్బింగ్ సినిమాలు మినహాయిస్తే …. తెలుగులో రాజశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు రెండే అని నాకు గుర్తు. ఒకటి ‘పున్నమినాగు’. రెండు ‘బామ్మమాట బంగారుబాట’. ఈ సినిమా తమిళ్ లో తీశాకే తెలుగులో రీమేక్ చేశారు. తమిళ్ లో పాండ్యరాజా చేసిన పాత్ర తెలుగులో రాజేంద్రప్రసాద్ చేస్తే బామ్మ పాత్ర తమిళ్ లో మనోరమ తెలుగులో భానుమతి చేశారు. రిలీజ్ అయ్యాక అది కూడా మంచి విజయాన్నే నమోదు చేసింది.
రాజశేఖర్ సినిమాల్లో విలన్ పాత్ర చాలా ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరుగుతుంది. అలా ఆయన చేతుల మీదుగానే సత్యరాజ్ మంచి విలన్ గా మాత్రమే కాకుండా మంచి నటుడుగా కమల్ హసన్ లాంటి వాళ్ల కళ్లల్లో పడడం తో … మంచి అవకాశాలు వచ్చాయి.
విక్రమ్ ప్రమోషన్స్ లో కమల్ హసన్ తన పాత విక్రమ్ డైరెక్టర్ పేరు ప్రస్తావిస్తాడేమో అని చూశా … ఎక్కడా తగల్లేదు … అదేంటి తమిళ పరిశ్రమ రాజశేఖర్ ను మర్చిపోయిందా అనిపించింది.