“అంకుల్. మీరు కథలు రాస్తారట గదా..నాన్న గురించి వ్యాసం రాయాలి..నాలుగు పాయింట్లు చెప్ప రా?” పక్కింటి పిల్లోడు వచ్చి అడిగేడు.
“మీ నాన్న గురించి నాకేం తెలుసురా” అన్నాను.
“మీరు నాన్నే కదా మీ పిల్లలకు. మరి నాన్న అంటే మీకు తెలీదా?”అన్నాడు వాడు.
“నిజమే…ఇక్కడ ఎవరి నాన్నల గురించి వాళ్ళే వ్యాసం రాయాలి. ” అన్నాను.
వాడు బిక్కమొహం వేసాడు.
“మీ నాన్న లేడా ఊళ్ళో.”
“లేడు అంకుల్..తాత కు ఆపరేషన్ చేయించాలట.
చెన్నై వెళ్లారు.”
“అలాగా.మీ నాన్నంటే నీకు ఇష్టమేనా?”
“బోలెడు ఇష్టం.”
“ఎందుకని? రోజూ డబ్బులిస్తాడా?”
“కాదు..ఎంత పొద్దుబోయి వచ్చినా నాబుగ్గపై ముద్దు పెట్టకుండా నిద్రబోడు.అందుకే ఇష్టం.”
“మరి నువ్ అడిగినవన్నీ కొనిపిస్తాడా?”
“ఏది అడిగినా తర్వాత చూద్దాము లే అంటాడు.రెండేళ్ల క్రితం సైకిల్ అడిగితే..నెల క్రితం తన సైకిల్ ఇచ్చాడు.”
“ఆయన స్కూటర్ కొన్నాడా?”
“లేదు..నడిచి వెళ్తున్నాడు ఆఫీస్ కి.”
“ఇదిగో నీ వ్యాసం రెడీ.చూసి వేరే పేపర్ పై రాసుకో” అన్నా.
వాడి కళ్ళలో వేయి దీపాల వెలుగు.
వాడు ఎగరుకుంటూ వెళ్ళాడు.
లోపలికొచ్చి రాధను అడిగేను.
” నీకు గాని పిల్లలు ఫోన్ చేసేరా” అని.
“ఏంటి ఇవ్వేళ ఇన్నిసార్లు అడిగేరు” అంది రాధ.
” మాట్లాడి చాలా రోజులు అయింది కదా..” అంటూ మళ్ళీ బయటి కొచ్చి కూర్చున్నా.
——KNMURTHY