Subramanyam Dogiparthi…………………………..it’s a musical and visual feast .
దర్శకుడు కె యస్ ప్రకాశరావు మార్క్ సినిమా ఇది . వాణిశ్రీ-కృష్ణ జోడీలో కూడా చాలా మంచి సినిమాలు ఉన్నాయి. బ్లాక్ & వైట్ కాలంలో నుంచే ఉన్నాయి. వాటిలో ముందువరుసలో ఉండే రంగుల సినిమా 1975 లో వచ్చిన ఈ ‘చీకటివెలుగులు.’
ప్రేమనగర్ , సెక్రటరీ సినిమాల్లో లాగా కె యస్ ప్రకాశరావు వాణిశ్రీని అజంతా బొమ్మలాగా చూపిస్తారు . సినిమాలో సింహభాగం కులూలో తీసారు . కాశ్మీర్ ప్రకృతి సౌందర్యాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు . వాణీశ్రీతో పాటు మరో అందమైన హీరోయిన్ని చూపారు. ఆమె పేరు పద్మప్రియ. హేమమాలినితో పోల్చేవారు . తెలుగు , కన్నడ , తమిళ చిత్రాలలో ఎక్కువగా నటించింది . ఈ సినిమాలో బాగా అల్లరి చేస్తుంది .
యుధ్ధభూమిలో గాయపడ్డ హీరో గతాన్ని మరచిపోతాడు . హీరోయిన్ తో పెళ్లి అయిపోతుంది . గతం గుర్తుకొచ్చాక జరిగిన పెళ్ళిని మరిచిపోతాడు. గతాన్ని గుర్తుకు తెచ్చి , మరలా జీవితం కొనసాగించటం సినిమా కధ టూకీగా . అక్కినేని నటించిన పవిత్ర బంధం సినిమా గుర్తుకొస్తుంది.
ప్రముఖంగా మెచ్చుకోవలసింది సంగీత దర్శకుడు చక్రవర్తినే . ఆయన హవా నడుస్తున్న కాలంలో వచ్చిన సినిమాల్లో ఇదీ ఒకటి. అన్ని పాటలు బాగుంటాయి. దేవులపల్లి వారు వ్రాసిన ‘చీకటి వెలుగుల కౌగిలిలో చిందే కుంకుమ వన్నెలు’ పాట సినిమాకే హైలైట్ . ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఆత్రేయ గారి ‘మీటి చూడు నీ హృదయాన్ని పలుకుతుంది ఒక రాగం’ పాట .
మిగిలిన పాటలు ‘ఊరు పేరు లేనివాడిని ప్రేమించానమ్మా’ , ‘సెలవు మీద రావయ్యా సిపాయి బావా’ , ‘చూసాను పొద్దంతా వేచాను రాత్రంతా’ , ‘ప్రేమంటే ఏమనుకున్నావ్’ , ‘హరి హరి నారాయణా చూడరా నాయనా’ బాగుంటాయి .
సత్యనారాయణ , రాజబాబు , రమాప్రభ , సూరేకాంతం , గుమ్మడి , ప్రయాగ నరసింహ శాస్త్రి , అల్లు రామలింగయ్య ప్రభృతులు నటించారు. ఈ సినిమా కథను కె ఎస్ ప్రకాశరావు రాసుకోగా .. ముళ్ళపూడి వెంకటరమణ సంభాషణలు సమకూర్చారు.
ఆ రోజుల్లో సినిమాని నిర్మాత రంజిత్ కుమార్ చాలా ఖర్చు పెట్టి ప్రెస్టీజియస్ గా తీస్తే, దర్శకుడు కె ఎస్ ప్రకాశరావు కూడా అంతే శ్రద్ధతో బాగా తీశారు. అయితే అల్లూరి సీతారామరాజు హ్యాంగ్ ఓవర్ లో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. ఆ సంవత్సరం వచ్చిన మరికొన్ని కృష్ణ సినిమాలు నష్టాలను చవి చూశాయి. ఈ చీకటి వెలుగులు సినిమా యూట్యూబులో ఉంది . An entertaining , musical and feel good movie . చూడనివారు తప్పక చూడతగ్గ సినిమా .