Sinjar massacre………….
అమెరికా ఎన్నో దారుణాలకు పాల్పడిందని మనం తరచుగా తిట్టుకుంటుంటాం. కానీ కొన్ని మంచి పనులు కూడా చేసింది. వాటిలో సింజార్ ఘటన ఒకటి.
అక్కడ నీళ్లు లేవు.. ఆహారం లేదు… శోకిస్తున్న తల్లుల కళ్లలో తడి లేదు. ఏడ్చి ఏడ్చి వాళ్ళ కళ్ళు ఇంకిపోయాయి. శోషించిపోతున్న వారికి, పిల్లలకు ఇవ్వడానికి పాలు లేవు. దాహంతో పిడచ గట్టిపోతున్న చిన్నారుల గొంతు తడిపేందుకు ఏమీ లేదు. రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలను రక్షించుకునే మార్గమే లేదు.
చివరకు.. తమ చేతిని కోసుకొని..వచ్చే ఆ రక్తాన్ని చిన్నారుల గొంతులోకి ఒంపేవారు. ఏడేళ్ల క్రితం ఇరాక్‌లోని సింజార్ పర్వతాల్లో బందీలుగా ఉన్న యాజీదీ తెగ మహిళల ఇబ్బందులు ఇవన్నీ. ఉత్తర ఇరాక్ లో ఉన్నపట్టణం సింజార్.. ఆ పరిసర ప్రాంతాలపై ఐఎస్‌ఐఎల్ ఉగ్రవాదులు దాడులు చేసి వేలాది మందిని చంపేశారు. మతం మార్చుకొమ్మని ఒత్తిడి తెచ్చారు.
అల్లకల్లోలం సృష్టించారు.ఎందరో పురుషులను బహిరంగంగా ఉరి తీశారు. వారి భార్యలను బలవంతంగా వివాహం చేసుకునేందుకు తీసుకెళ్లారు. అడ్డు వచ్చినవారిని కాల్చిపడేశారు. పట్టణం లో విద్వంసం సృష్టించారు.
బలవంతంగా కొన్ని వేలమందిని సింజార్ పర్వత ప్రాంతాలకు తరలించారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అమాయకులెందరినో పొట్టన బెట్టుకున్నారు. సింజార్ పర్వతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో .. ఐఎస్‌ఐఎల్ ఉగ్ర వాదుల తుపాకుల పహారాలో యాభై వేల మంది బందీలు ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ జీవచ్ఛవాలుగా మారారు.
వారిని తీవ్రంగా హింసించేవారు. ఈ బాధలు తట్టుకోలేక 8 వేల మంది తప్పించుకున్నారు. ఇరాక్‌లోని జాతులను నిర్మూలించి ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే మధ్యయుగాల ఆలోచనతో చెలరేగిన ఇసిల్ ఉగ్రవాదం యాజీదీ తెగపై పగబట్టింది.
మతం మార్చుకొమ్మని తీవ్రమైన ఒత్తడి తెచ్చేవారు. అందంగా ఉన్న మహిళలను .. బాలికలను తీసుకెళ్లి సెక్స్ బానిసలుగా మార్చేవారు. కాదన్న వారిని దారుణంగా చిత్రహింసలు పెట్టేవారు. పారిపోవడానికి వీల్లేకుండా చుట్టూ కంచెలు వేసి ఐఎస్‌ఐఎల్ దళాలు కాపలా కాసేవి. ఆహరం ఇచ్చేవారు కాదు .. నీళ్లు ఇచ్చేవారు కాదు .. భగ్గునమండే ఆ ఎండల్లో సింజార్ పర్వతాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
చిన్నారులైతే తాగడానికి చుక్క నీరు దొరకక కనుమూసారు. ప్రాణాలు కోల్పోయిన పిల్లల మృతదేహాలను పూడ్చే అవకాశం కూడా లేక కొండరాళ్ళ కింద ఉంచి .. పైన బండలు పెట్టేవారు. తప్పించుకున్నవాళ్ళు సిరియా, టర్కీల వైపు వెళ్లేవారు. సరిహద్దులు దాటడానికి స్మగ్లర్ల సాయం తీసుకునే వారు. ఈ దారుణాలు బయటి ప్రపంచానికి తెలిసాయి.
కుర్దిష్ యోధుల సహాయంతో అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. బందీలకు విముక్తి కల్పించింది. క్రమంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2014 లో ఈ మారణ కాండ జరిగింది. తర్వాత ప్రపంచ దేశాలు ముందుకొచ్చి పెద్ద ఎత్తున సహాయం అందించాయి. స్వచ్చంద సంస్థలు శిబిరాలు నిర్వహించాయి.