బషీర్ బాగ్ కాల్పులకు 21 ఏళ్ళు !

Sharing is Caring...

ఉద్యమ సమయాల్లో ఉద్రిక్తతలు సర్వ సహజం.  కార్యకర్తలు  లక్ష్యం వైపు దూసుకుపోవాలని ….పోలీసులు కార్యకర్తలను వెనక్కి పంపాలని ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సందర్భంలోనే  ఒక్కోసారి  కాల్పులు చోటు చేసుకుంటాయి. ఆ రోజు కళ్ళముందే కాల్పుల ఘటన జరిగింది.  అదేమిటంటే ……  
సరిగ్గా 21 ఏళ్ళ క్రితం . 2000 సంవత్సరం .. ఆగస్టు 28. ఆరోజు కాంగ్రెస్, వామపక్షాలు “అసెంబ్లీ ముట్టడి” కి పిలుపునిచ్చాయి. వామపక్షాలు విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం లో భాగంగా ఆ పిలుపు నిచ్చాయి. అప్పటివరకు జిల్లా స్థాయిలో నిరసనలు ,ధర్నాలు తదితర కార్యక్రమాలు చేపట్టిన వామపక్షాలు హైదరాబాద్ లో ‘ అసెంబ్లీ ముట్టడి ‘ని ప్లాన్ చేశాయి. నేను ఎపుడూ అంత పెద్ద ప్రదర్శన చూడలేదు. వామ పక్షాలు కూడా తర్వాత కాలంలో ఆ స్థాయిలో ఉద్యమం చేపట్టలేదు. ఇందిరా పార్క్ దగ్గర నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరారు. మరో పక్కన అప్పటికే ఇదే అంశం పై కాంగ్రెస్ నేతలు వైఎస్ .. రోశయ్య మరికొందరు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిరాహార దీక్షలు చేస్తున్నారు.

సర్కార్ తో అమితుమీ తేల్చుకోవాలని వామ పక్షాలు చలో అసెంబ్లీ కి పిలుపునివ్వడం తో ఉమ్మడి రాష్ట్రం లోని కార్యకర్తలంతా హైదరాబాద్ కి తరలి వచ్చారు. .. వామపక్షాల నేతలు కొందరు కాంగ్రెస్ నాయకులు బషీర్ బాగ్ చేరుకున్నారు. అప్పటికే అక్కడకి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇంటెలిజెన్స్ పోలీసుల్లో నాకు మంచి మిత్రులున్నారు. వారిలో ఒకతను “జాగ్రత్తగా ఉండండి .. ఇవాళ పరిస్థితి అదుపు తప్పే సూచనలున్నాయి.”అని హెచ్చరించాడు. “అర్ధమైంది” అన్నాను. ఇద్దరం కలసి ఫతే మైదాన్ లోపలికి వెళ్ళాం ..గ్రౌండ్ బయటినుంచి అసెంబ్లీ కెళ్లే కుడి,ఎడం వైపు ఉన్న రెండు మార్గాలను మూసివేశారు. అడ్డంగా ఇనుపతీగలను పెట్టారు. అటు నాంపల్లి .. లక్డికాపూల్ దారులను కూడా మూసేసారు. నేను కాసేపు అక్కడ ఉండి బయటకొచ్చాను. జనం అసెంబ్లీ వైపు వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ప్రాంతం చుట్టూ పోలీసులు మోహరించారు.
కార్యకర్తల ప్రదర్శన బషీర్ బాగ్ చేరుకుంది. ఉదయం 11 గంటలు దాటింది. బషీర్ బాగ్ ప్రాంతమంతా ఎర్ర జెండాలతో కళకళ లాడుతూ .కార్యకర్తల నినాదాలతో హోరెత్తి పోయింది. నినాదాలు చేస్తూనే కార్యకర్తలు రెండు వైపుల నుంచి అసెంబ్లీ వైపు ఒక్క సారిగా ముందుకు ఉరికారు. కొందరైతే ఇనుపతీగల్తో చేసిన ముళ్ల కంచెల మీదుగా ముందుకు పోయే ప్రయత్నం చేశారు. వాళ్ళను పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అనుసరించారు.ఫతే మైదాన్ రెండు పక్కల ఉన్నదారులన్ని కార్యకర్తలతో నిండి పోయాయి. అంతమంది జనాన్ని చూసిన పోలీసులు పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించి లాఠీ ఛార్జి కి దిగారు. అయినా కార్యకర్తలు వెనుదిరగలేదు.
దాంతో వాటర్ క్యానన్స్ ను ప్రయోగించారు. ఇది వెనుక ఉన్న కార్యకర్తలు చూసి ఆవేశంతో మరింత ముందుకు దూసుకుపోయారు. పరిస్థితి పూర్తిగా కంట్రోల్ తప్పింది. దీంతో పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేయకుండా కాల్పులు ప్రారంభించారు. అదే అదనుగా పోలీసులపైకి జనం రాళ్లతో దాడి చేశారు. పోలీసులు కూడా రెచ్చిపోయారు .. ఆ ప్రాంతమంతా కదన రంగంలా మారింది. పోలీసుల కాల్పుల్లో రామకృష్ణ, మరో వ్యక్తి స్పాట్ లోనే చనిపోయారు. మూడో వ్యక్తి హాస్పిటల్ లో మరణించారు.పోలీసులు అక్కడ ఎవరూ ఉండకుండా తరిమి కొట్టారు. పోలీసులు గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం కేవలం పదినిమిషాల్లో రక్తసిక్తంగా మారింది.
కార్యకర్తల రక్తపు మరకలతో రోడ్లన్నీ ఎర్రబారాయి. పోలీసులు తరిమి కొట్టడం తో నేను కూడా పరుగెత్తుకుంటూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వెళ్ళాను. “లీడర్” ఈవెనింగ్ ఎడిషన్ కాబట్టి వార్త మధ్యాహ్నం 12.30 లోగా చెప్పేయాలి . ఎక్కడా ఒక్క ఫోన్ బూత్ కూడా కనిపించలేదు. మరికొంచెం దూరం వెళ్ళగానే ఎస్టీడీ బూత్ కనిపించింది. వెంటనే వార్త చెప్పేసాను. అదే బ్యానర్ ఐటెం అయింది. అప్పట్లో నేను వార్తలన్నీ ఫోన్ ద్వారానే చెప్పేవాడిని . అలా నాకంటి ముందే ఆ మారణహోమం జరిగింది.ఆ దారుణానికి ప్రత్యక్ష సాక్షిని. నాటి చారిత్రిక ఉద్యమం తరవాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు ముఖ్యం గా రాజశేఖరరెడ్డి కి ప్లస్ అయింది .   (  story up dated on 28-8-2021 )

——— KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!