Mohan Artist …………………………………………
అర్ధమయ్యే సంగతులు చెప్పుకుందాం. బోటనీ క్లాసంటే బోరు బోరు అని మీరనకపోతే చిన్న విన్నపం, ఈ చెట్ల మొదళ్ళు పెరిగి పైకెళ్ళి సిగ్గుతో రెండుగా చీలి మళ్ళీ మళ్ళీ సిగ్గుపడుతూ కొమ్మలు. రెమ్మలై చిలవలు పలవలవ్వడానికో వరస ఉంటుంది. ఒక సంగీత ముంటుంది. కొన్ని చెట్లు చంపకమాలలో శాఖోపశాఖలైతే, కొన్ని ఉత్పలమాలలో -కోమ్మోపకొమ్మలవుతాయి, ఇందులో మత్తేబాలూ, శార్దూలాలూ ఒకటి కాదు వంద, దీని గురించి వృక్షశాస్త్రజ్ఞులు ఎన్నో లావు గ్రంథాలు రాశారు.
కాలేజీ బోటని బుక్కులో ఒక్క చాప్టరే ఉంటుంది. రికార్డు బుక్కులో ఒక్క చాప్టరే ఉంటుంది. రికార్డు బుక్కులో ఈ కొమ్మల బొమ్మలు గీసి అవి చీలిన పద్ధతి పేర్లను పెన్సిల్తో రాస్తే మాస్టారు మార్కులేస్తారు. బాగా బొమ్మలున్న వారికి బాగున్నన్ని మార్కులు మేస్టారూ. ఆర్టిస్టులకు ఇలాంటి సైన్స్ తో పనిలేదు. పైకి కనిపించే మార్ఫాలజి చాలు. వీళ్ళ లెక్కల్తో చూస్తే ఈ టాంక్ బండ్ పిల్ల క్లియోపాత్రా. సింపుల్ కిల్లర్.
ఇలాంటి హీరోయిన్లని బుక్ చేసి ఒక ఫ్రేములో ఒకనటు అతి ప్రధానంగానూ ఒకనటు అత్యంత అప్రధానంగానూ కంపోజ్ చేయడమే చిత్రకారుల నిత్యవ్యాపారమైయున్నది. యూరోపియన్ ఆర్టిష్టులయితే ఆయిల్స్ ఫోటో రియలిజంతో చెట్టు బెరడుమీద పెచ్చుల మీద సెపియా వెలుగునీడల్ని అచ్చుగుద్దినట్టు గీసి పచ్చలద్ది పెడతారు. చైనా జపాన్ వాళ్ళయితే ఈ ఒంపులకి వింత భాష్యాలిచ్చి, వెంట్రుక గీతని అంతలోనే సర్రున దూసి ఎగిరి దూకించి ఇరగదీస్తారు. పుట్టిన దగ్గర్నుంచి పుడకల వరకు ఇదే పని, ఒకే పని.
కొందరు తెలుగు చిత్రకారులు, కార్టునిస్టులూ ఈ పనిని కాస్త రెక్ లెస్ గా చేస్తుంటారు. మన సినిమా డైరెక్టర్లు గొప్ప హీరోయిన్లను సెట్ ప్రాపర్టీలుగా వాడినట్టే వీళ్ళు కూడా, బొమ్మలూ, ముఖ్యమైన మనుషులో, కట్టడమో వేశాక ఆ మూలనో ఈ మూలనో అదో రకంగా ఒంగే చెట్టును గీసి పారేస్తారు. కార్టూనిస్టులు మరీనూ. ఇవి ప్రకృతి విరుద్ధమైన పంచమహాపాతకములు. కొండపల్లి శేషగిరిరావు గారి పెయింటింగ్ లో మాత్రం నీలికొండలూ రాళ్ళూ నీలిచెట్లూ కొమ్మలూ గొప్పగా ఉంటాయి. చైనా ప్రభావం.
బాపుగారి సాక్షి సినిమా పబ్లిసిటీ నుంచి ఎన్నో కథల్లో ఎన్నో చెట్లు సుదీర్ఘ వృక్షారాధనానంతరం మొలిచినవే. కెల్విన్ అండ్ హాబ్స్ కార్టూన్ స్ట్రిప్ట్ లో పిల్లవాడూ, పులీ కలిసి తోటలో రకరకాల చెట్లకింద ఎన్నో ఎడ్వెంచర్స్ చేస్తుంటారు. అందులో వెనక ఎక్కడో అప్రధానంగా ఉన్న బిర్చి చెట్ల బెరడూ, కొమ్మలూ, ఆకుల్ని ఆర్టిస్టు క్షణంలో సగంలో హడావుడిగా ఎక్కడికో పోయే ముందు గీసినట్టు కనిపిస్తాయి. అదంతా పైకి కనిపించేదే. చాలా సీరియస్ స్టడీ తర్వాతే, వృక్షారాధన తర్వాతే అలా చులాగ్గా గీయడం చాతవుతుంది.
చెట్టు అంత ఆషామాషి వ్యవహారం కాదు. లైఫ్ అండ్ డెత్ కొశ్చను. “పువ్వు మీ అదృష్టం చెప్పును” అని ఓ జ్యోతిష్కుడు గారు ఎప్పుడూ ఎడ్వర్ టైజ్ చేసేవాడు. చెట్టు కూడా చెప్తుంది లేవో” అనొచ్చు. చెట్టు నా ఆదర్శం’ అని ఇస్మాయిల్ గారన్నారు. “అమ్మ చెట్టో” అని గుండెలు బాదుకున్నాడు దేవిప్రియ. కొందరు కవులు’ పెంచిన చెట్లమీద చిలుకలు వాలతాయి. శ్రీరమణగారు చెట్టు పీకి పందిరేసిన తర్వాత రెక్కలు ముక్కల్చేసుకుని అవొచ్చి వాల్తాయి. ఉన్న చెట్లన్నీ కూలిపోయే దృశ్యాలు చూపించి జడుసుకుంటాడు అజంతా.
ఇంప్రెషనిస్టుల్లో సొంత ఇంప్రెషన్’ గల పాల్ సెజేన్ వందలాది బొమ్మలేసి. ముగ్గి, మిగల పండిన తర్వాత ఒకే కొండని అదే పనిగా వేశాడు. దక్షిణ ఫ్రాన్స్ లోని ఈ వెండికొండ పేరు సెయింట్ మౌంట్ పార్నసీ (సుతారమైన ఫ్రెంచి స్పెల్లింగ్ని ఇంగ్లీషు రాళ్ళతో కొడితే ఇలా ఉచ్చారణ కరకరాయిస్తుంది). పాల్ సేజెన్ ఔడ్డోర్ లోనూ, ఇంటి కిటికిలోంచీ, దూరం నుంచి, దగ్గర నుంచి రకరకాలుగా నెలల తరబడి వందలసార్లు దీని స్కెచ్లూ, పెయింటింగ్లూ గీశాడు. కొడుక్కి రాసిన ఉత్తరాల్లో ఈ కొండ బతుక్కి ఓ అర్థం ఇస్తుందనీ, చెప్తుందని పదే పదే రాశాడు.
ఆంటన్ చెహోవ్ అప్తమిత్రుడు ఐజాక్ లెవియాతాన్ అన్నీ ప్రకృతి చిత్రాలే గీశాడు. బూడిద రంగుతో విషాద సంగీత మాలపించే రష్యన్ విలేజ్ లాండ్ స్కేప్ (ఇవి మన మాటలు కాదు.. టాల్ స్టాయ్, దోస్తవిస్కీ, అంతా చెప్పినవి)లో వెలుగునింపే “గోల్డెన్ ఆటమ్” పెయింటింగ్ గీశాడు. ఆకురాలు కాలంలో తెల్లని బోదెల బిర్చి చెట్టు “ఎల్లో గోల్డ్” ఆకులతో రష్యన్ గ్రామాలకు దీపాలు పెడతాయి. ఇవి బతుక్కి అర్థాన్నిస్తాయని చెబుతాడు లెవియతాన్. ఆయన గీసిన “ఏబౌ ఎటర్నల్ పీస్’ అనే బొమ్మచూస్తే ఆ అర్ధం అన్ని దిక్కులకు పాకేంత విస్తారమవుతుంది.
ఓ సారి తుమ్మపూడిలో ఈ బొమ్మలు తిరగేస్తున్నప్పుడు ‘లెవియతాన్ గొప్ప కలరిస్టు, రష్యన్ టర్నర్’ అని సంజీవదేవ్ గారన్నారు. నాకు కలుక్కుమంది. బ్రిటీష్ వాళ్ళతో పాలికెందుకు పెట్టాలి?”ఆంధ్రా దిలీప్ కుమార్” అంటే గానీ దక్షిణాదికి నడవదా, గడవదా? జార్ కాలంలో రష్యన్ రాకుమారుడు ప్రిన్స్ అయివజోవ్స్కి ప్రశాంత సముద్రం మంచి కల్లోల కడలి వరకూ బతుకంతా అలలే వేశాడు. ఆయన “నైన్త్ వేవ్” చాలా పాపులర్ మావూరి బార్బర్ షాపుల్లో కూడా ప్రేము కట్టి పెట్టేవారు. ఈ అలలే నా బతుక్కి అర్ధం పరమార్ధం చెప్పాయన్నాడు అయివజోవ్ స్కీ.
జపాన్ లో పుజీ కొండని హోకుసాయ్ చాలా కోణాల్లో గీశాడు. “థర్టీ టూ వ్యూస్ ఆఫ్ మౌంట్ పుజీ” అనే సిరిస్ ప్రఖ్యాతమైనవి. ఎగసిపడే పెద్ద అలల నుండి దూరంగా చిన్నపుజి కనిపించే బొమ్మ మరింత ప్రఖ్యాతం(ఈ అలల్ని ఇప్పటికి నూటా ముప్పై రెండు సార్లు కాపీ కొట్టగలనని హామీ ఇస్తున్నా) ఈ కొండ మీద ఇన్ని – బొమ్మలేయడమే గాక హైకూలు గూడా వెలగబెట్టాడు హోకుసాయ్. ఇక్కడ ప్రకృతి, కళా, కవితా, జీవితం, మనిషి, భగవంతుడూ అనే సరిహద్దులు చెరిగిపోతాయి. తమ్ముడు థియో వాంగోకి రాసిన ఉత్తరాల్లో విన్సెంట్ వాంగో ఇలాంటివి చాలా రాస్తాడు.
ఒక చెట్టు కొమ్మలు కాపీ చెయ్యడానికి తంటాలు ఏకరువు పెడతాడు. మామ్ రాసిన “ఆఫ్ హ్యూమన్ బాండేజ్” అసలు కథతో ఏమాత్రం సంబంధం లేని ఓ ముసలి, పేద తాగుబోతు తత్వవేత్త ఉంటాడు. అతని ఇరుకు గదిలో అటకమీద దుమ్ము కొట్టుకుని, చుటచుట్టుకుని ముడుచుకుని పడుకున్న తివాసి ఉంటుంది. అది నీ జీవన రహస్యాన్ని విప్పి చెపుతుందని అనేక చాప్టర్లలో అనేక కేరెక్టర్లని బెదిరిస్తుంటాడా ముసలాడు. “అండ్ ది సన్ షోన్ బ్రైట్’ – అనే మామ్ వాక్యంతో నవల ముగుస్తుంది గానీ, ఈ మ్యాజిక్ కార్పెట్ మాత్రం ముణగదీసుకొనే పడుకోనుంటుంది. మోళీ వాడు చెప్పే పాము ముంగీసా ఫైట్ క్లైమాక్స్ ఎప్పటికీ రాదు.
సరే గాని ట్యాంక్ బండ్ కి వెళదాం. ఈ ప్రేమ వల్లే అభద్రతా భావం మొదలైంది. పీడకలలు, ఆ మూల ఖరీదైన రెస్టారెంట్ కట్టడానికి ముందు చంద్రబాబుగారు ఆ చెట్టును గొడ్డలితో నరుకుతున్నట్లూ, బాల అంబాని దాని జుట్టు పట్టుకుని ఈడ్చి లారీకెక్కిస్తున్నట్టు కల. రిలయన్స్ కే ఎక్కువ రెలవెన్స్ ఉందని బాబు గారనుకుంటారనే భావన వలనే ఈ ఇర్రెలవెంట్ కల కాబోలు. ఫియర్ ఆఫ్ చెట్ట్ కటింగ్ కూడా కావచ్చు. మరో కల. టూరిజం అంజనేయరెడ్డిగారూ, చందనాఖాన్ కలిసి కార్లో వచ్చి, ఏసుక్రీస్తుకు కొట్టినట్టు చెట్టునిండా.. మేకులు కొట్టి ఎర్ర బల్బులు దండలు తలనిండా గుచ్చి బ్యూటిఫై చేస్తున్నట్టు.
బహుశా ఇది ఫియర్ ఆఫ్ ఎ.పి. టూరజం ఈస్తటిక్ కావచ్చు. ఇలాటి పనికిమాలిన ఆశమ్మ బూసమ్మ కబుర్లు ఎన్నేనా చెప్పాచ్చు. ఉపయోగ మేముంది. అయినా సరే టాంక్ బండ్ మీదికి వెళ్ళినపుడు తమరి మహోజ్వల జరుగురు పనులూ, యమర్జెంట్ విజయ సాధనలకు బుల్లి బ్రేక్ వేసి ఈ పిల్లని చూడండి. మల్టీప్లెక్స్ వాళ్లలా టికెట్ పెట్టాలా? ఐమాక్స్ తెరకంటే నూట యాభై రెట్లు పెద్దదైన ఆకాశాన్ని మబ్బుల్ని తెచ్చి బ్యాక్ గ్రౌండ్ ఎరేంజ్ చేశాం.
పైగా లేక్ వ్యూ, ఈస్ట్ వెస్టుల్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేసిన మెగా ప్రొడక్షన్. ప్రొడ్యుసర్ సాక్షాత్తూ సర్ దేవుడు గారు. ఈ హీరోయిన్ నా ప్రేయసి .అందరూ రండి నా ప్రేయసిని ప్రేమించండి. ఆమె ప్రేమిస్తుంది మిమ్మల్ని. గాన తామెల్లరూ హాజరై తమ ప్రేమలను జయప్రదం చేసికొనవలసినదిగా ఇందుమూలముగా పిలవడమైనది.
pl. read it also …………………….. నా కొత్త క్రష్… మీరూ ప్రేమిద్దురూ…
No Responses