Mohan Artist ————————–
సెక్రెటేరియట్టూ, లుంబినీ పార్క్ లేదూ.కొంచెం ముందుకి లాగు. టూరిజం ఆఫీసూ, ఫిష్ కాంటీనూ, కాస్త లెఫ్ట్ కి కొయ్యి. స్లో బెదరూ.టాంక్ బండ్ మీదికి పురపురా ఎక్కెయ్యనక్కర్లేదు. బ్రేకేస్కో. వెనక్కి చూస్కో. వారేవ ఏంది ఫేసు. లెఫ్ట్ టర్నింగిచ్చుకో. ఖాళీ స్థలముందా, కాసిని చెట్లూ ఉన్నాయి. వాటి మధ్య నించుంటే హుస్సేన్ సాగర్ మీంచి ఆకాశాన్ని సెవెంటీ ఎంఎం తాతలాగా చూడొచ్చు.
దూరంగా ఉండే హీరో ఒక్కడే పాత హీరో కొత్త మనపడిలాగా, బెల్లం కొట్టిన రాయిలాగా, ఏ వంపూ లేకుండా ఉంటాడు. బుద్ధుడు అంటారు గాని బుద్దు అన బుద్దేస్తుంది. ఒంపు సొంపుల షోకు పిల్ల కావాలంటే అంత దూరం చూడక్కరలేదు. మీరు నించున్న చోటే ఒక సన్నటి చెట్టు వయ్యారంగా వంగి తలారబోసుకుంటూ ఉంటుంది. పక్కన కూడా చక్కటి చుక్కల్లాటి చెట్లే ఉంటాయి గానీ, దీని ‘స్టైలే వేరు. “ఎఫ్.టి.వి.” చూస్తారా అని మిమ్మల్ని అడగాలేను.
మీరు చూడనే చూడరుగా అని చెప్పాగలను. కానీ రాంప్ మీద రకరకాల అమ్మాయిలు రకరకాల డ్రస్సులేసుకుని (భగవాన్!వేసుకోకుండా గూడా) నడుస్తారు. అందరూ ఒకలాగుండరని చెప్పక్ఖర్లేదు.ఎందుకంటే కొందరే ఒకలాగుంటారు. ఎందుకంటే మరికొందరు మరొక లాగుంటారు గదాని. ఒకా, మరొక లాగా కాకుండా ఒక్కలాగే ఉండే సింగిల్ జింగ్ థింగ్ ఒక్కటే గనక వదేవిది. విదేవది. దీన్ని చూస్తే “ప్రాణ్ జాతా పర్ వచన్ న ఆతా.” వింత హిందీ అర్ధం కాకపోతే చెప్పాలంటే, “దీన్ని చూస్తే ప్రాణం పోతుంది. కాని నోట మాట రాదు” అన్న మాట మీదనమ్మకం.
లేకపోతే వినోద్ ఖన్నాని గానీ శత్రుఘన్ సిన్హాని గానీ అడగండి. మాజీ నటులూ తాజా మంత్రులూ అయిన వీరు నా మాటే చెప్తారు. మంత్రుల మాటలదేముంది గానీ ఈ పిచ్చి మొహం మనకి చెప్పే మాటేంటంటే “ఐ లవ్ యూ”. అది మనం ముందే అన్నామని దానికి తెలీదు.చెప్పాగదా వెర్రి మోహమని, అయితేనేం అందగత్తె. నవ్వుతుంది. పలకరింపు బావుంటుంది. కాకపోతే బిజీ మనిషి. తెల్లారట్ట లేవగానే టాంక్ బండ్ మీద ఎర్లీ మాణింగ్ వాకర్స్ అందరినీ చూసుకోవాలా? బుద్ధుడు మురికి నీట్లో దిగి కొర్రమీన్లు పడతాడేమోనని కాచుకోవాలా!
ఆఫీసు టైమయ్యే సరికి చంద్రబాబూ, ఐఎఎస్ బాబులూ, సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్ క్లర్కులూ, మంత్రులూ, వాళ్ళ కార్ల… క్వాలిస్ ల, టయోటాల, డీజిల్‌ని, బొగ్గుపులుసు వాయువుని పీల్చి ఆక్సిజన్ వదలాలా! ఈ పొగల మధ్య నుంచి ఉదయించే సూర్యనారాయణా అనూరా అండ్ హిజ్ కంపెనీ కిరణజన్య సంయోగక్రియా, అబ్బబ్బో బిజీ బిజీ. అయినా సరే షోకు షోకే. టైమెక్కడ దొరుగుతుందో.మేకప్ కి లోటు లేదు. పెల్విక్ గర్డిల్ని ఈలా అరుణ్ లాగా అలా తోసి పైకి పోతుంది. చలం హీరోయిన్ రాజ్యలక్ష్మి అనుకోరాదూ. మరి జుట్టెవడికిస్తారూ?
ఇటెక్కువా, అటు తక్కువా పంచి సూర్యుడికేదో ఫేపర్ చేస్తున్నట్టు ఆకుల్నీ ఎండకందిస్తుంది. ఒక్కటే ట్రబుల్. పేపర్లు చదవదు. గోల్కొండకెళ్ళదు. పాలిటిక్స్ మీద ఇంట్రస్ట్ లేదు. పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు అంటేనే ఇంటలెక్చువల్ కాదనీ, సాహిత్య పేజీల్లో తత్వశాస్త్రంలాగ కనిపించే వ్యాసాలు రాయదనీ తెలుస్తూనే ఉందిగా. కానీ ఈ ఒయ్యారి ఒక పి.ఆర్. సాయంత్రం తన మొదలునానుకుని కూర్చునే మూర్ఖ ప్రేమికుల్ని కిందికొంగి చూస్తుంది. ప్రేమిస్తుంది. మార్లిన్ మన్రో ఈజ్ జస్ట్ నంథింగ్ బిఫోర్ మి” అని తనకి తెలుసు. అయినా తనని కళ్ళెత్తి చూడకుండా పల్లీలు తినే ప్రేమికుల్ని ప్రేమిస్తుంది. ప్రేమని, మేరికెల్లీని కూడా ప్రేమిస్తుంది. జాలిపడదు.
తూష్ణీ భావమూ లేదు. కూతురుతో సహా హుస్సేన్ సాగర్ లో దూకడానికొచ్చిన అమ్మతల్లి భయం, డైలమాలకి ఈ వెర్రి చెట్టు కాండమే కాసేపు ఆసరా ఇస్తుంది. టవర్ ఆఫ్ బేబిల్ లో దేవుడు మార్చిన భాషలో “నా దగ్గర జీవముంది ఉండిపో, ప్రేమ ఉంది మిగిలిపో హుస్సేన్ సాగరము మురికి మరణము” చెట్టు వెరీ వెరీ బిజీ ఇంత చెట్టుకు ఎంతగాలి. ఎంత యాతన అని నా సుకుమార హృదయం తల్లడిల్లింది. ఇక్కడికొచ్చే ప్రతివాళ్ళూ నా బతుకు, నా ఆత్మహత్యా తప్ప మరోటి ఉందని పట్టించుకోడమే లేదు.
సరళ నన్ను ప్రేమిస్తుందా లేదా ఈ వేళ తేలిపోవాలి అంతే అనుకుంటూ రాజు ఆ పిల్లని ఈ చెట్టు కిందకి తీసుకొచ్చి “రెండు ఐస్ క్రీమ్” అని యాద్గిరిగాడికి ఆర్డరిస్తున్నాడే తప్ప ఒక్కసారి తల పైకెత్తి. ఈ చెట్టు కొమ్మల: ఆకుల చిగుళ్ళ చిలకాకు పచ్చల వంక చూస్తేనా? సరళ పిల్లి కళ్ళ ల్లోకి కళ్ళు పెట్టడానికే చీకటి పడిపోతుంటే టైమెక్కడా?అయినా సరే ఈ షోకు చెట్టు ఏమీ అనుకోదు. ఏమీ అనదు గూడా. సెక్రటేరియట్ నుంచైనా, బూర్గుల రామకృష్ణారావు భవన్ నుంచైనా ఖిన్నుడైన క్లర్కు సూర్యారావు వచ్చి ప్రమోషన్ రాదని కన్ఫర్మ్ చేసిన క్షణాన్నయినా తక్కువగా చూడదు. నీడని విత్ డ్రా చేయదు.
వట్టి బ్యూటీయే కాదు. బ్రెయిన్స్ కూడా. మరిన్ని హార్ట్స్ కూడా ఇది ప్రేమ అన్ కంటామినేటెడ్, పదహారణాలు. ఎంత అందమైన చెట్టు. మా అమ్మంత అందంగా ఉంది. (అక్కకి కోపం వస్తుందేమో) మా అక్కంత అందంగానూ ఉంది. ఇంకా తెలిసిన, తెలీని (చూసిన) అనేక మందంత అందంగా ఉంది. రిపీట్ …ఈ మాటే విసుగ్గా ఉంది. అందమంటే అర్ధం… అర్ధమంటే భాష్యం? నిర్వచనం? సైంటిఫిక్ అండర్ స్టాండింగ్ లేక ఇలాటివి చెప్పడం కాదు. చూడ్డానికి ఎదురుగుండా ఉంది గదా. దాని మీద కాంపోజిషన్ రాయి అంటే ఎలా?
ఎదురుగా ఉన్న దాన్ని చూడకుండా హడావిడిగా వెళ్ళిపోయే వాళ్ళని తిట్టుకున్నా చచ ఆర్ట్ లెస్ పీపుల్. ఒక్కడికన్నా నాలాటి మహోన్నత కళా హృదయం ఉందా.. గుడ్డి ప్రపంచం అని తిట్టుకున్నా. గాడ్! అయామ్ రాంగ్. బ్లిస్ పులీ రాంగ్ అని “హిందూ” పత్రిక పాటోగ్రాఫర్ వారం రోజుల్లో నిరూపించాడు. నా సొంత రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అయిన నా హీరోయిన్ని, నా డిస్కవరీని రీ డిస్కవర్ చేసి కన్నుకొట్టాడు. పెద్ద నాలుగు కాలాల ఫోటో హిందూ రెండో పేజీలో రంగుల్లో వచ్చింది. ఈ చెట్టు పిల్ల బాగా ఫోటో కాన్షస్ అనుకుంటా. క్లిక్ కి ముందు కాస్త ఆగమని చెప్పి జుట్టు దువ్వేసుకుని పౌడర్ రాసేసుకుంది.
సాయంత్రం లైట్, చెంపల మీంచీ, జుట్టు మీంచి జారిపోతూ ఉంది. ఆ వెలుగు కారి కిందపడి ముక్కలవుతున్న చప్పుడు కూడా వినని చెవిటి ప్రేమికులిద్దరు భుజాల్ని చెట్టుబోదెకాన్చి కూచుని సూర్యుడి వేపో బుద్ధుడి వేపో చూస్తున్నారు. ప్రేమ కాస్త లెఫ్ట్ కి జరిపినా, రైట్ కి జరిపినా సరే ఏం కాదు. పిక్చర్ పర్ఫెక్ట్. ట్రేస్ చేసి ఆయిల్ కలర్స్ వేస్తే దర్జాలొలికే పెయింటింగ్ అవుతుంది. ఈ ఫొటోగ్రాఫరెవడికో కన్నుంది. అందుకే కొట్టాడు. గ్రేట్ అనిపించింది.
వారం పదిరోజులు సినిమా రీలు లాగానో ఆటో చక్రాల్లాగానో తిరిగి తిరిగి ఖైరతాబాద్ ఫ్లయోవర్ ఎక్కాయి. టాంక్ బండ్ టైమ్స్ అనే పేరుతో తెల్లటి పెద్ద హోర్డింగ్. టైమ్స్ ఆఫ్ ఇండియా యాడ్. గ్రే, గ్రీన్‌లో ఈ పిల్ల చెట్టు కింద దూరంగా ఒక పెద్ద మనిషి పేపరు చదువుతున్నాడు. చెట్టు జుట్టంతా ఫ్రేమ్‌లోకి రాలేదు గాని, చూడ్డానికి ముచ్చటేసింది. పోకిరీ ఫొటోగ్రాఫర్ల కళ్ళన్నీ దీనిమీదే పడుతున్నాయి. సాయంత్రం దిష్టితీసి ఉప్పూ మిరపకాయలు పక్కన పారేయాలి.
అయినా ఇదేం. వెర్రి. ఈ పిచ్చిపిల్ల వెంటబడి ఇలా తిరగడమేంటి? లోతైన శాస్త్రీయ అవగాహన, తాత్విక చింతనా, సామాజిక స్పృహా బొత్తిగా లేకుండా ఇవేం పన్లు, అంటే ఏమో, ఒక్క అందమే. కాదు. ఒక అందానంతర, అందనంత, తెలీనంత, దూరానంతరం…. తెలీని దాన్ని గురించి తెలిసినట్టు తెలియబరిస్తేనే ఇలాటి మాటలు వొస్తాయి. చాలా దూరం పోతుందా మన బండి?
pl.read it also………………………… నా కొత్త క్రష్… మీరూ ప్రేమిద్దురూ…(2)