ఖమ్మం సంకల్ప సభలో వైఎస్ షర్మిల ప్రసంగం సూటిగా, సుత్తి లేకుండా జనాలను ఆకట్టుకునేలా సాగింది. చెప్పదల్చిన విషయాన్నీ షర్మిల స్పష్టంగా .. అర్ధమయ్యేలా,ఆవేశపడకుండా జనంలోకి తీసుకెళ్లారు.తెరాస అధినేత,సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మర్యాద పూర్వకంగా కేసీఆర్ గారు అంటూనే ఆయన ఇచ్చిన హామీలు ఏమైనాయని ప్రశ్నించారు. హామీల అమలులో కేసీఆర్ విఫలమైనారు కాబట్టే కొత్త పార్టీ పెడుతున్నామని షర్మిల వివరణ ఇచ్చారు. ప్రస్తుతం గట్టిగా ప్రశ్నించే వారు లేరని అందుకోసమే పార్టీ పెడుతున్నానని స్పష్టం చేశారు.
కేసీఆర్ నీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం పెంచేసి అవినీతి కి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవం దొర చెప్పుల కింద నలిగి పోతున్నదని విమర్శించారు. తెలంగాణా లో రైతులు ఎన్నో కస్టాలు పడుతున్నారని .. రైతులు పేరుతో అప్పులు తెచ్చి పాలకులు జేబులు నింపుకుంటున్నారని షర్మిల దుయ్యబట్టారు. కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య పై హామీ ఇచ్చారు . ఆ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. ప్రైవేట్ రంగంలోనూ వైఎస్ 11 లక్షల ఉద్యోగాలు కల్పించారని, ఇప్పుడు యువతకు ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు అంటూ చురకలు వేశారు. ఉద్యోగాల భర్తీకోసం తానే స్వయం గా మూడు రోజుల నిరాహారదీక్ష చేస్తానని .. పార్టీ నాయకులు .. కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపడతారని సభా ముఖంగా ప్రకటించారు.
ఈ గడ్డపై పెరిగానని , గాలి పీల్చానని,ఇక్కడే చదువుకున్నానని … ఈ తెలంగాణ కు రుణ పడి ఉన్నానని …ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నాని తేల్చి చెప్పారు. ఇక్కడి ప్రతిపక్షాలు సరైనరీతిలో పనిచేయడం లేదని .. కాంగ్రెస్ తెరాస కు ఎమ్మెల్యేలను సరఫరా చేసే కంపెనీగా మారిందని దుయ్యబట్టారు. బీజేపీ కి ఇక్కడ చేశామని చెప్పేందుకు ఏమీ లేదని ఎద్దేవా చేశారు. సింహం సింగిల్ గానే వస్తుందని తాను ఎవరో పంపితే రాలేదని క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్, బీజేపీ, తెరాస పార్టీలకు గురిపెట్టిన బాణాన్ని అని స్పష్టం చేశారు.
తెలంగాణ కోసం ఎవరితోనైనా పోరాడుతా.. ఈ విషయంలో అనుమానం అక్కర్లేదని హామీ ఇచ్చారు. అంతకు ముందు షర్మిల తల్లి విజయమ్మ కూడా మాట్లాడారు. ఆమె ప్రసంగం అంతా వైఎస్ పాలనపైనే కొనసాగింది. ఇచ్చిన మాట నిలుపుకునే వైఎస్ లాగానే షర్మిల తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఒక చోట జగన్ ప్రస్తావన తెచ్చారు. షర్మిల ప్రసంగంలో జగన్ ప్రస్తావన ఎక్కడా రాలేదు. జులై 8 న పార్టీ పేరు, ఎజెండా ప్రకటిస్తామని చెప్పారు. షర్మిల సభకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. జనసందోహంతో సభా ప్రాంగణం కోలాహలంగా మారింది. సభా వేదికపై తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పాటలు పాడుతూ కళాకారులు.. సభకు హాజరైన ప్రజలను ఊర్రూతలూగించారు.