Does glamor workout? ………………………………….
ప్రముఖ సినీ నటి రాధిక త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి తరఫున తమిళనాడు లోని విరుదునగర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ కూటమిలో ఇండియా జననాయగ, పుదియ నీది, టీఎంసీ, జాన్‌పాండియన్ తదితర పార్టీలు చేరాయి.
అలాగే నటుడు శరత్‌కుమార్ నేతృత్వంలోని సమత్తువ మక్కల్ కట్చి కూడా చేరింది. శరత్ కుమార్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. కూటమిలో చేరిన క్రమంలో సమత్తువ మక్కల్ కట్చి కోరిన విరుదునగర్ స్థానం ఆ పార్టీకి కేటాయించనున్నట్టు తెలుస్తోంది.
విరుద్ నగర్ స్థానం నుంచి తన సతీమణి రాధికను కమలం గుర్తుపై బరిలోకి దింపేందుకు శరత్‌కుమార్ నిర్ణయించారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, ఎండీఎంకే పార్టీలు ఆ స్థానాన్ని కోరుతున్నాయి. దీంతో వారిలో ఎవరు రాధికపై పోటీ చేస్తారో కొద్దీ రోజులు పోతే కానీ తేలదు.
రాధికకు రాజకీయాలు కొత్తేమీ కాదు. గతంలో శరత్ తో కలసి ఏఐఏడీఎంకేలో చేరి ఆ పార్టీ తరపున జోరుగా ప్రచారం చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు రాధిక ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందని పార్టీ అధినేత్రి జయలలిత సస్పెండ్ చేశారు. అంతకుముందు డీఎంకే లో కొన్నాళ్ళు శరత్ ఉన్నారు.
31 ఆగస్టు 2007న, శరత్ కుమార్ ‘అఖిల భారత సమతువ మక్కల్ కట్చి’ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు .2021 ఎన్నికల్లో శరత్ పార్టీ కమల్ పార్టీ కూటమిలో చేరింది.37 సీట్లలో పోటీ చేస్తే ఒక్క సీటులో కూడా గెలవలేదు.
అప్పట్లో శరత్‌కుమార్ ఆదేశిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని రాధిక అన్నారు. కానీ పోటీ చేయలేదు. రాధిక గురించి చెప్పుకోవాలంటే ఒకనాటి ప్రముఖ తమిళ నటుడు ఎం.ఆర్.రాధా కూతురు .. తెలుగు,తమిళ భాషా చిత్రాల్లో హీరోయిన్ గా ప్రముఖ నటుల సరసన నటించింది. రాడాన్ పిక్చర్స్ పేరిట సీరియల్స్ ను నిర్మించారు.
విరుదునగర్ స్థానం నుంచి 2019 ఎన్నికల్లో బి. మాణికం ఠాగూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 2009 లో ఠాకూర్ ఇదే స్థానం నుంచి గెలుపొందారు. 2014 లో మాత్రం అన్నా డీఎంకే అభ్యర్థి విజయం సాధించారు. బీజేపీ కి ఇక్కడ స్వతహాగా బలం లేదు. అన్నాడీఎంకే మద్దతుతో బరిలోకి దిగిన వారు గట్టి పోరాటమే చేయాల్సి ఉంటుంది. సినీ గ్లామర్ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.
————KNM