ఆ పర్వతం ప్రత్యేకత అదేనా ?

Sharing is Caring...

Speciality of Om Mountain…….

ఓం పర్వతం…. ఇది ఉత్తరాఖండ్‌లోని కుమావున్ హిమాలయాలలో, పితోరాఘర్ జిల్లాలోని దార్చులా సమీపంలో ఉంది. ఇది భారత్, నేపాల్  టిబెట్ సరిహద్దులు కలిసే చోట ఉంది. ఈ పర్వతం సముద్ర మట్టానికి సుమారు 5,590 మీటర్ల (సుమారు 18,340 అడుగులు) ఎత్తులో ఉంది.ఈ పర్వతంపై ఉన్న ‘ఓం’ ఆకారం కేవలం భారతదేశం వైపు ఉన్న నాబీధాంగ్ (Nabidhang) నుండి మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది.

పురాణాల ప్రకారం ప్రపంచంలో ఇటువంటి సహజ సిద్ధమైన ‘ఓం’ ఆకారం కలిగిన పర్వతాలు ఎనిమిది ఉన్నాయట. అయితే ఇప్పటివరకు మానవుల కంటికి కనిపిస్తున్నది ఈ ఒక్క పర్వతం మాత్రమే.మిగిలిన ఏడు పర్వతాలు రహస్యంగా ఉన్నాయని నమ్ముతారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పర్వతంపై మంచు కురిసినప్పుడు అది సహజంగానే ‘ॐ’ ఆకారంలో పేరుకుపోతుంది.

పర్వతం నల్లని శిలలతో ఉండటం వల్ల, తెల్లని మంచు ఆ అక్షరాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తుంది. సూర్యాస్తమయ సమయంలో పర్వతం నీడ ‘స్వస్తిక్ ‘ ఆకారాన్ని పోలి ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.మంచు అక్కడే ఎందుకు పడుతుందనేది ప్రకృతి రహస్యం.

ఒక కథ ప్రకారం అష్టావక్ర మహర్షి శివుని గురించి ఇక్కడ తపస్సు చేశారు.శివుడిని ‘ఓం’ రూపంలో చూడాలని కోరుకున్నాడట. ఆయన భక్తికి మెచ్చిన పరమశివుడు ఈ పర్వతంపై ‘ఓం’ ఆకారంలో ప్రత్యక్షమయ్యాడని భక్తుల నమ్మకం.మహాభారత కాలంలో పాండవులు స్వర్గారోహణకు వెళ్లే సమయంలో ఈ మార్గం గుండా వెళ్ళారని, ఈ ఓం పర్వతాన్ని దర్శించుకున్నారని అంటారు.. 

ఆది కైలాష్ (Adi Kailash) యాత్రలో భాగంగా  భక్తులు ఈ ఓం పర్వతాన్ని దర్శించుకుంటారు. ఇది సరిహద్దు ప్రాంతం కావడంతో, భారతీయ పౌరులు ఇక్కడికి వెళ్లడానికి ఇన్నర్ లైన్ పర్మిట్ (Inner Line Permit) పొందవలసి ఉంటుంది. కత్గోడం (Kathgodam) లేదా పితోరాఘర్ నుండి దార్చులా చేరుకుని, అక్కడి నుండి గుంజి (Gunji) మీదుగా ఓం పర్వత వ్యూ పాయింట్ అయిన నాబీధాంగ్‌కు చేరుకోవచ్చు.
పర్యాటకుల సౌకర్యార్థం పితోరాఘర్ నుండి హెలికాప్టర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. 

ఈ ప్రాంతంలో ఓం పర్వతంతో పాటు పార్వతీ సరోవరం, గౌరీ కుండ్, వేద వ్యాస గుహ వంటి పవిత్ర స్థలాలను కూడా సందర్శించవచ్చు. పర్వతాన్ని ఎక్కడానికి అనుమతి లేదు..  పవిత్రతను కాపాడటానికి, భద్రతా కారణాల దృష్ట్యా ఈ పర్వతం ఎక్కడాన్ని నిషేధించారు.  ప్రతి సంవత్సరం మే నుండి అక్టోబర్ వరకు యాత్ర జరుగుతుంది.. యాత్ర గురించి మరిన్ని వివరాల కోసం.. పర్మిట్ బుకింగ్ కోసం  ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

ఓం పర్వతాన్ని చూడాలంటే, ఇది ఉత్తరాఖండ్‌లోని సుదూర సరిహద్దు ప్రాంతంలో ఉండటం వలన ప్రయాణం కొంచెం కఠినంగా ఉంటుంది.  ఈ ప్రయాణం సాధారణంగా ‘ఆది కైలాష్ యాత్ర’ ప్యాకేజీలో భాగంగా ఉంటుంది.

హైదరాబాద్ నుండి నేరుగా ఉత్తరాఖండ్‌లోని బేస్ క్యాంప్‌లకు రైళ్లు లేదా విమానాలు లేవు. కాబట్టి, ముందుగా ఢిల్లీ లేదా ఉత్తరాఖండ్‌లోని సమీప రైల్వే స్టేషన్‌/ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలి. పంతనగర్ విమానాశ్రయం బేస్ క్యాంప్‌కు దగ్గరగా ఉంటుంది.

హైదరాబాద్ నుండి ఢిల్లీకి రైలులో వెళ్లి, అక్కడి నుండి ఉత్తరాఖండ్‌కు కనెక్టింగ్ రైలు రాణికేత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా  కత్గోడం (Kathgodam) రైల్వే స్టేషన్‌కు చేరుకోవచ్చు. కత్గోడం లేదా పంతనగర్ నుండి అసలు ప్రయాణం మొదలవుతుంది. ఇక్కడి నుండి టాక్సీ లేదా బస్సు ద్వారా ధార్చులా (Dharchula) పట్టణానికి చేరుకోవాలి. కత్గోడం నుండి ధార్చులాకు దూరం సుమారు 280 కి.మీ, ప్రయాణానికి 8-9 గంటలు పడుతుంది.పంతనగర్ నుండి ధార్చులాకు దూరం సుమారు 330 కి.మీ, ప్రయాణానికి 10-12 గంటలు పట్టవచ్చు.

ధార్చులా అనేది నేపాల్ సరిహద్దులో ఉన్న ఒక ముఖ్యమైన బేస్ టౌన్. ఇక్కడ బస చేసి, అవసరమైన పర్మిట్లను తీసుకోవాలి. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) కార్యాలయంలో ఈ పర్మిట్ జారీ చేస్తారు.  సాధారణంగా టూర్ ఆపరేటర్‌ల ద్వారా వెళితే వారే ఈ ఏర్పాట్లన్నీ చూసుకుంటారు.

ధార్చులా నుండి జీపు లేదా 4×4 వాహనంలో గుంజి (Gunji) గ్రామం మీదుగా నాబీధాంగ్ చేరుకోవాలి. ఓం పర్వతం ఇక్కడి నుండే స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం పూట వీక్షణ చాలా అద్భుతంగా ఉంటుంది.ఈ యాత్రను ఒంటరిగా ప్లాన్ చేసుకోవడం కంటే టూర్ ఆపరేటర్లు ద్వారా వెళ్లడం సులభం, సురక్షితం. ఆధార్ కార్డ్, ఓటర్ ID లేదా పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి గా కలిగి ఉండాలి.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!