Overnight, all the villages became graveyards…………………….
పై ఫొటోలో మనకు కనిపించేది మధ్య ఆఫ్రికాలోని వాయువ్య కామెరూన్ లో ఉన్న న్యోస్ సరస్సు. ఈ సరస్సు ఒక మిస్టరీ. చూడటానికి పైకి ప్రశాంతంగా కనిపిస్తుంది. చుట్టూ కొండలు .. పచ్చదనం ..చెట్టు పుట్టా .. వాతావరణమంతా ఆకర్షణీయంగా ఉండటంతో అక్కడకి వలసలు మొదలైనాయి.
మెల్లగా గ్రామాలు ఏర్పడ్డాయి. ఎక్కడెక్కడివారో వచ్చి స్థిరపడిపోయారు. అయితే ఒక కాళరాత్రి ఏమైందో ఏమో.. రాత్రికి రాత్రి గ్రామాలన్నీ శ్మశానాలై పోయాయి. ఎందుకలా జరిగిందో ఎవరికి తెలీదు. సరస్సు పొంగి గ్రామాల మీదకు వరదై రాలేదు.. కానీ.. ఆ ఆ రాత్రి ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి ఈ సంఘటన మిస్టరీయే.
‘న్యోస్’ సరస్సు.. ఉనికిలో లేని అగ్నిపర్వత ముఖద్వారంలో ఏర్పడింది. ఒకప్పుడు సమీపంలో ఉన్న అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది కరిగిపోయింది. అప్పట్లో అక్కడ జనావాసాలు ఏమీ లేవు. తర్వాత కాలంలో చా, న్యోస్, సుబుమ్ అనే గ్రామాలు సరస్సు చుట్టూ ఏర్పడ్డాయి. నీరు పుష్కలంగా ఉండటంతో అక్కడ జనం వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు.
1986లో ఆగస్టు 21న ఆ మూడు గ్రామాల ప్రజలు.. పడుకున్నవారు ఇక నిద్ర లేవలేదు. మరునాడు ఎక్కడ చూసినా శవాలే. మంచం మీద ఉన్నవారు మంచం మీదే.. బయట ఉన్నవారు బయటే నిర్జీవంగా మారిపోయారు. పశుపక్ష్యాదులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడినవారు మాత్రం.. ‘ఆ రాత్రి తొమ్మిది గంటలకు అకస్మాత్తుగా గాలి స్థంభించింది. ఏదో ఘాటైన వాసన వచ్చింది. ఆ తర్వాత మాకు స్పృహ లేదు’ అని వివరించారు.
చనిపోయినవారి నోటి నుంచి, ముక్కు నుంచి రక్తం కారిన ఆనవాళ్లు ఈ మరణాలను మిస్టరీగా మార్చాయి. ఈ విపత్తులో 1,746 మంది ప్రజలతో పాటు.. 3,500 జంతువులు, పక్షులు చనిపోయాయని అంచనా వేశారు. రాత్రికి రాత్రి ప్రాణాలు తీసేసిన ఆ విషపు గాలి అగ్నిపర్వత బిలంలో ఉన్న న్యోస్ సరస్సు నుంచే వచ్చిందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఉనికిలో లేని అగ్నిపర్వత బిలం వర్షాల కారణంగా నిండి సరస్సుగా మారింది.
నీరు చేరినా బిలంలో జరిగే రసాయనిక చర్య ఆగిపోలేదు. ఆ రాత్రి 9 గంటలకు.. రసాయనిక చర్యల్లో భారీ మార్పులు చోటు చేసుకుని .. ఆ బిలం నుంచి వందల వేల టన్నుల విషపూరిత కార్బన్ డై ఆక్సైడ్ సుమారు 100 కిలోమీటర్ల మేర విస్తరించింది. కొన్ని క్షణాల్లోనే అది గ్రామాలకు చుట్టుముట్టింది. 25 కిలోమీటర్లుకు పైగా గాలిలో ఆక్సిజన్ శాతం పూర్తిగా తగ్గిపోయింది. కార్బన్ డై ఆక్సైడ్ పీల్చిన వారంతా అక్కడికక్కడే మృతి చెందారు.
బతికిన వారు చనిపోయిన వారిని .. అక్కడి దృశ్యాలను చూసి ఆత్మహత్యలకూ పాల్పడ్డారు.ఈ మరణాలకు కారణం ఏమిటనే అంశంపై ఏళ్లకు తరబడి క్షుణ్ణంగా పరిశోధనలు జరిపారు. చివరికి ఇలా తేల్చారు. ‘నీటి అడుగున ఉన్న అగ్నిపర్వత వాయువులు వాటంతట అవే పైకి వచ్చే అవకాశం చాలా తక్కువ. న్యోస్ బిలంలో చిన్నపాటి భూకంపం సంభవించి ఉంటుంది.అక్కడ కదలిక చోటు చేసుకోవడం వల్లే ఇంత పెద్ద విపత్తు ఏర్పడింది’
ఇలాంటి ఘటనే 1984లో కూడా జరిగింది. ఇదే ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలో గల మొనౌన్ సరస్సునుంచి కార్బన్ డై ఆక్సైడ్ విడుదలై 37 మంది మరణించారు. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే.. న్యోస్ ఘటన జరిగుండేది కాదనే విమర్శలు వెల్లువెత్తాయి. మరోసారి ఇలాంటి విపత్తు తలెత్తకుండా 2001లో ఇంజనీర్లు న్యోస్ సరస్సులో ప్రత్యేకమైన పైపులు ఏర్పాటు చేశారు. సరస్సుని సురక్షితంగా మార్చాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆ పనులు సజావుగా జరగడం లేదు.