అది త్రిపురనేని వారి గొప్పదనం !!

Sharing is Caring...
ఇది 1920వ దశకంలో జరిగిన విషయం. అప్పటి రోజుల్లో రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎవరైనప్పటికీ పరస్పరం గౌరవించుకునే వారు. ఎదురుపడితే మర్యాద ఇచ్చి పుచ్చుకునే వారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రముఖ హేతువాది, మానవతావాది, మహాపండితులు. ఆయనది కృష్ణాజిల్లా గుడివాడ. గుంటూరు జిల్లా తెనాలిలో లాయరుగా స్థిరపడ్డారు. మంచి పేరు ప్రఖ్యాతులు, పలుకుబడి సంపాదించారు.
త్రిపురనేని రామస్వామి చౌదరిగారు తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయనకు ప్రత్యర్థి… ఉపద్రష్ట వెంకట్రామయ్యగారు. ఇద్దరూ ఎన్నికల బరిలో హోరాహోరీగా పోరాడేవారు. పలు సమస్యలపై వాగ్యుద్ధాలు, విమర్శలు సాగేవి. ఆరోపణలూ, ఎత్తిపొడుపులూ సాగేవి. ఇద్దరూ ఒక్కచోట కలిస్తే… ముష్టియుద్ధం జరుగుతుందేమో అని జనం ఆందోళన చెందేవారు. అంత వాడి, వేడిగా వుండేది నాటి వాతావరణం.  కానీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గౌరవం, మర్యాద వుండేవి.
ఉపద్రష్ట వెంకట్రామయ్య గారికి తెనాలి గాంధీ చౌక్ లో పడమరవైపు ఆంధ్రరత్న భవన్ పేరుతో హోటల్ వుండేది.
వెంకట్రామయ్యగారు జాతీయవాది కావడంచేత ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి పేరుతో హోటల్ నడుపుతుండేవారు. కమ్మటి వెన్నకాచిన నెయ్యి, కారప్పొడి, అల్లం జీలకర్రతో పెసరట్లు.. ఆ హోటల్ ప్రత్యేకత. ఆ హోటల్ లో టిఫిన్ చేసి, కమ్మని సువాసనగల ఫిల్టర్ కాఫీ తాగేందుకు తెనాలి పట్టణవాసులే కాదు.. తెనాలి తాలూకాలోని సమీప గ్రామాలనుంచి యువకులు పనిగట్టుకొని వచ్చేవారు. త్రిపురనేని రామస్వామి చౌదరిగారు ఉదయం ఆరుగంటలకే హోటలికి వచ్చేవారు. ఆయన హోటల్లో అడుగుపెట్టగానే.. అప్పటిదాకా కౌంటరులో వున్న వెంకట్రామయ్యగారు నిలబడి సాదరంగా ఆహ్వానించేవారు. ఇవేమీ పట్టించుకోకుండా రామస్వామి చౌదరిగారు సరాసరి వెళ్లి ఒక మూలనున్న రౌండ్ టేబుల్ దగ్గర కూర్చునేవారు.
వెంకట్రామయ్యగారు గబగబా… నేరుగా కిచెన్ లోకి వెళ్లిపోయేవారు. ముందుగా పొగలుగక్కే ఇడ్లీ ప్లేటులో నెయ్యితో కారంపొడి వేసి సర్వరుద్వారా పంపించేవారు. ఇడ్లీ తినేలోపు అల్లం జీలకర్రతో నేతి పెసరట్లు స్వయంగా వేసి, వేడివేడిగా పంపించేవారు. తర్వాత వెంకట్రామయ్యగారు తానే స్వయంగా కలిపి.. ఫిల్టర్ కాఫీ పెద్ద గ్లాసులో పంపించేవారు. ఈ సపర్యలన్నీ అయ్యాక వచ్చి క్యాష్ కౌంటర్ మీద కూర్చునేవారు వెంకట్రామయ్యగారు. రామస్వామిగారు ఆనందంగా టిఫిన్ తింటున్నప్పుడు వెంకట్రామయ్యగారు పరవశంగా చూసేవారట వంటగదినుంచి. అంతా అయ్యాక.. సప్లయర్ ఇచ్చిన బిల్లుని క్యాష్ కౌంటర్ దగ్గర ఇచ్చి… నా ఖాతాలో రాసుకో అని వెళ్లిపోయేవారట రామస్వామి చౌదరిగారు.
నిజానికి ఆ హోటల్ లో రామస్వామిగారికి ఖాతా అంటూ ఏమీ లేదు. హోటల్ లో పనిచేసేవాళ్లు, శ్రేయోభిలాషులూ అప్రమత్తం చేస్తే వెంకట్రామయ్యగారు ఇలా అనేవారట…. ‘‘మాకూ మాకూ సవాలక్ష రాజకీయ గొడవలుండవచ్చు. కానీ అంతటి నిస్వార్ధపరుడు, మహానుభావుడు, సేవాతత్పరుడు మా హోటలులో అడుగుపెట్టడమే మా అదృష్టం’’ అని.
అన్నట్టు “కవిరాజు” జ్ఞాపకార్ధం కేంద్రప్రభుత్వం పోస్టల్ స్టాంప్ ను కూడా విడుదల చేసింది. ఈయన కుమారుడే ప్రముఖ రచయిత గోపీచంద్ .. మనవడు సినీ నటుడు సాయి చంద్.
——– Vasireddy Venugopal 
Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!