పాక్ ఉగ్రవాదులు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను టార్గెట్ చేసుకుని దాడులకి కుట్ర పన్నారు. ఇందులో భాగంగానే అజిత్ దోవల్ నివాసం వద్ద రెక్కీ నిర్వహించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాది హిదయత్ ఉల్లా మాలిక్‌ను అరెస్ట్ చేసి పోలీసులు ప్రశ్నించినపుడు రెక్కీ విషయం బయటపడింది. అజిత్ దోవల్ పాక్ ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్నారు. దోవల్ తో పాటు హిట్ లిస్ట్ లో ఉన్న ఇతరుల సమాచారం సేకరించి పాక్ కు పంపినట్టు హిదయత్ ఉల్లా మాలిక్ విచారణ లో బైట పెట్టారు. దీంతో పోలీసులు అప్రమత్తమైనారు.
ఫిబ్రవరి 6న పోలీసులు మాలిక్‌ను అరెస్ట్ చేశారు. అతనితో సహా నలుగురిని పోలీసులు ప్రశ్నించారు. వారిలో మాలిక్ భార్య, చండీగఢ్‌కు చెందిన ఒక విద్యార్థి, బీహార్ నివాసి ఉన్నారు. పోలీసుల విచారణలో పాకిస్తాన్ ఆదేశాల మేరకే తామందరం రెక్కీ నిర్వహించినట్టు మాలిక్ అంగీకరించాడు. గత ఏడాది మేలో దోవల్ కార్యాలయం సహా మరి కొన్ని ప్రాంతాలను వీడియోతీశారు. దీన్ని పాక్ కి పంపారు.
దోవల్ 2019 బాలాకోట్ వైమానిక దాడులు జరిగినప్పట్నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉన్నారు. దీంతో ఆయనకి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో జరిగిన బాలాకోట్ వైమానిక దాడులకు అజిత్ వ్యూహకర్తగా వ్యవహరించారు.
నరేంద్ర మోడి ప్రధాని అయ్యాక అజిత్ దోవల్‌ని జాతీయ భద్రతా సలహాదారు గా నియమించారు. వివిధ ఆపరేషన్లలో క్షేత్రస్థాయి అనుభవం ఉన్నదోవల్ మాటల మనిషి కాదు చేతల మనిషిగా గుర్తింపు పొందారు. గత ఆరేళ్ళ నుంచి మోడీ నమ్మకాన్ని ఆయన నిలబెట్టారు. దీంతో అజిత్ దోవల్ కు ప్రాధాన్యత పెరిగింది.
1980 ల్లో మిజో నేషనల్ ఆర్మీ (ఎమ్‌ఎన్‌ఏ) లో ఒకరిగా చేరి మయన్మార్, చైనా సరిహద్దుల్లో ఉంటూ క్షేత్రస్థాయిలోనే అజిత్ వారి పతనానికి పాచికలు వేశారు . అప్పట్లో ఇందిరాగాంధీ ప్రశంసలు పొందారు. 1988 ప్రాంతంలో స్వర్ణదేవాలయంలో దాగున్న తీవ్రవాదుల్ని బయటకు తరిమే ఆపరేషన్‌ని ప్రభుత్వం చేపట్టినపుడు దోవల్ కీలక పాత్ర పోషించారు. అలాగే ఏడేళ్లపాటు పాకిస్తాన్‌లో గూఢచారిగా.. ఒక ముస్లిం వేషంలో దోవల్ పనిచేసారు. వివిధ సందర్భాలలో అజిత్ దోవల్ తన సత్తా చాటుకున్నారు. ఇవన్నీ గమనించే మోడీ తాను ప్రధాని అయ్యాక దోవల్ ను కీలక స్థానంలోకి తీసుకొచ్చారు. అజిత్ ఇంటిముందే రెక్కీనిర్వహించారంటే సెక్యూరిటీ వైఫల్యం కూడా కనబడుతోంది.