బంధన్ బ్యాంక్. మంచి పనితీరుతో బ్యాంకు లాభాల బాటలో దూసుకుపోతోంది. 2015 లో ఈ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించింది. కలకత్తా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకు 501 బ్రాంచీలతో మొదలైంది. ప్రస్తుతం 4701 ఔట్లెట్స్ తో పనిచేస్తున్నది. మైక్రో ఫైనాన్స్ విభాగం(ఎంఎఫ్‌ఐ)లో అతిపెద్ద సంస్థగా నిలబడింది.తూర్పు, ఈశాన్య ప్రాంతంలో 50 శాతానికిపైగా మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. 2 కోట్ల కస్టమర్లకు సేవలు అందిస్తోంది. సెప్టెంబర్ 2020 నాటికి రూ. 66 వేల కోట్ల డిపాజిట్లను సమీకరించింది. 76 వేల కోట్ల రుణాలను పంపిణీ చేసింది. గృహ ఫైనాన్స్ విలీనం తదుపరి రుణాలలో మార్టిగేజ్ విభాగం వాటా 26 శాతానికి చేరింది.
రానున్న ఐదేళ్ల కాలంలో బ్యాంకింగ్ సౌకర్యాలను మరింతగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. 2019 మార్చినాటికి బ్యాంకు ఆదాయం 7706 కోట్లు కాగా 2020 మార్చినాటికి 12434 కోట్లకు పెరిగింది. అదేవిధంగా మార్చి 19 నాటికీ 1951 కోట్లు నికర లాభం ఆర్జించగా 2020 మార్చినాటికి అది 3023 కోట్లు కు పెరిగింది. ఇక నికర రాని బకాయిలు 389 కోట్లు ఉన్నాయి. వాటిని వసూలు చేసేందుకు బ్యాంకు ప్రయత్నిస్తోంది. 2020 డిసెంబర్ తో ముగిసిన త్రైమాసానికి బ్యాంక్ 731 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ. 331 కోట్లు మాత్రమే. అప్పటితో పోలిస్తే నికర లాభం 120 శాతం పెరిగింది.
ప్రస్తుతం రూ. 398 వద్ద బ్యాంకు షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. షేర్ ధర మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. 52 వారాల గరిష్ట ధర రూ. 526 కాగా కనిష్ట ధర రూ. 152 మాత్రమే. స్వల్ప కాలిక వ్యూహంతో ధర తగ్గినపుడు ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చు. ఇంతకు ముందే తక్కువ ధర వద్ద కొన్న ఇన్వెస్టర్లు ప్రస్తుత ధర వద్ద షేర్లను అమ్మేసి లాభాలను స్వీకరించ వచ్చు. ధర తగ్గినపుడు అప్పటి పరిస్థితిని బట్టి మళ్ళీ కొనుగోలు చేయవచ్చు.