గోల్డ్ బాండ్లపై ఓ కన్నేయండి

Sharing is Caring...

Sovereign Gold Bonds…..

పసిడి బాండ్ల అమ్మకాలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 15 వరకు బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇష్యూ ధరను గ్రాముకు రూ.5,923గా నిర్ణయించారు . ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ ఇస్తారు. అటువంటి వారికి పసిడి బాండ్‌ ఇష్యూ ధర రూ.5,873 మాత్రమే. 

దేశంలో బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో 2015 నవంబర్‌లో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. సబ్‌స్క్రిప్షన్‌ ముందు వారం చివరి మూడు పనిదినాల్లో 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ నిర్ణయించిన సగటు ధర ఆధారంగా గ్రాము రేటును నిర్ణయిస్తారు. కనీసం 1 గ్రాము ఒక యూనిట్‌ కింద కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు గరిష్ఠంగా 4 కేజీల వరకు కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులైతే 20 కేజీల వరకు కొనుగోలు చేయవచ్చు . ఈ బాండ్‌ పీరియడ్‌ 8 ఏళ్లు. గడువు ముగిశాక అప్పటి ధరను చెల్లిస్తారు. ఐదేళ్ల తర్వాత కావాలంటే వైదొలగొచ్చు. భౌతిక బంగారం కొనుగోలుకు ఉన్న కేవైసీ నిబంధనలే దీనికీ వర్తిస్తాయి.

షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, పోస్టాఫీసు లు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్చేంజీల (NSE, BSE) ద్వారా SGB కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను నివాసితులు, ట్రస్ట్‌లు, హెచ్‌యూఎఫ్‌లు, స్వచ్ఛంద సంస్థలు తీసుకోవచ్చు. దీన్ని మైనర్‌ పిల్లల తరఫున ఒక వ్యక్తి లేదా ఇతర వ్యక్తులతో జాయింట్‌గా కూడా తీసుకోవచ్చు. 
SGBపై వడ్డీ ఇష్యూ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. బాండ్‌ నామమాత్రపు విలువపై సంవత్సరానికి 2.50% ఫిక్స్‌డ్‌ రేటుతో అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు.

బాండ్ల కాలవ్యవధి 8 ఏళ్లు. బాండ్ల మెచ్యూరిటీపై వచ్చే మూలధన లాభాలపై SGB పన్ను మినహాయింపును అందిస్తుంది. భౌతిక బంగారంతో పోలిస్తే సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ కొనుగోలులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బంగారం కొనుగోలులో సాధారణంగా వర్తించే మేకింగ్‌, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు గోల్డ్‌బాండ్ల విషయంలో ఉండవన్నది గమనించాలి. చోరీ భయం అసలే ఉండదు. బంగారంలో పెట్టుబడి పెట్టేవారు గోల్డ్‌ బాండ్లను పరిశీలించొచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!