రేసులో వెనకబడిన స్వీటీ !

Sharing is Caring...

టాలీవుడ్ లో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారల్లో అనుష్క ఒకరు . హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన స్వీటీ అనుష్క చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఒకప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న అనుష్క నంబర్ గేమ్ లో ఇపుడు వెనుకబడింది. బాహుబలి సినిమా తర్వాత అనుష్క పాన్ ఇండియా స్టార్ గా మారింది. కానీ ఆమె ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు.

బాహుబలి తర్వాత అనుష్క ‘భాగమతి’ సినిమాలో కీలక పాత్రలో నటించింది. కథ, కథనంలో లోపాల కారణంగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించ లేదు.ఆ దరిమిలా చాలా గ్యాప్ తో ‘నిశ్శబ్దం’ సినిమా లో నటించింది. ఆ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇందులో అనుష్క చెవిటి, మూగ అమ్మాయిగా నటించింది. కాస్త బొద్దుగా అందంగా కన్పించింది.

అయితే సినిమా కథలో అంత డెప్త్ లేదు.నటనకు అంత అవకాశం లేదు.సైన్ లాంగ్వేజ్‌తోనే కథ నడుస్తుంది. అనుష్క హావభావాలు, భావోద్వేగాలు పెద్దగా పండలేదు. ఇక ఆ సినిమా తర్వాత మరో సినిమా రాలేదు.దీంతో అనుష్క రేసులో వెనుకబడి పోయింది. బాహుబలి తర్వాత అనుష్క పారితోషకం కూడా పెంచేసింది. భారీ స్థాయిలో సినిమాలు తీసే నిర్మాతలు తక్కువగా ఉండటం.. చిన్న నిర్మాతలకు అనుష్క ను భరించే స్థాయి లేకపోవడం కూడా ఆమె వెనుకబడటానికి ఒక కారణం కావచ్చని అంటారు.

ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నయన తార ప్రధమ స్థానంలో ఉంది. 2019 లో ఐరా సినిమాకు 4.5 కోట్లు తీసుకున్నట్టు పరిశ్రమ వర్గాల సమాచారం. ఇక అనుష్క అయితే బాహుబలి సినిమాకు దాదాపుగా 4 కోట్లు తీసుకున్నట్టు చెబుతారు.  మూడో ప్లేస్ లో ఉన్న సమంత కూడా ఇపుడు ఆ ఇద్దరితో పోటీ పడుతోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కి సమంత కూడా 2 కోట్లు తీసుకున్నారని అంటారు.

ఈ క్రమంలో నయనతార .. సమంత లే సౌత్ లో ముందంజ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్యే పోటీ నడుస్తోంది. వెబ్ సిరీస్ కు కొంత ఎక్కువ, సినిమాలకు కొంత తక్కువగా సమంత పారితోషకం తీసుకుంటున్నది.వీరిద్దరూ కాకుంటే శృతి హాసన్, కాజల్ అగర్వాల్, తమన్నా లేదా పూజా హెగ్డే లను నిర్మాతలు ఎంచుకుంటున్నారు. లేదంటే కొత్త తారల వైపు చూస్తున్నారు. 

అదలా ఉంటే నవంబర్ 21లో యూవీ క్రియేషన్స్ సంస్థ అనుష్కతో ఒక సినిమాను నిర్మిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అది కూడా ఇంకా మొదలు కాలేదు. 16 ఏళ్ళ కెరీర్ లో 47 సినిమాలు మాత్రమే చేసింది స్వీటీ. సూపర్ మొదటి సినిమా అయినా అనుష్కకు గుర్తింపు తీసుకొచ్చింది విక్రమార్కుడు. ఆ తర్వాత  అరుంధతితో అనుష్క రేంజ్ మారిపోయింది. స్టార్ గా ఎదిగింది.

వేదం లో సరోజ పాత్ర ఆమెకు మంచి పేరు వచ్చింది. ఇక బాహుబలి సంగతి విడిగా చెప్పనక్కర్లేదు. రుద్రమదేవి పాత్రలో రాణించింది. సైజ్ జీరో సినిమా కష్టపడినా ఫలితం దక్కలేదు. ఇక స్వీటీ పెళ్లి గురించి చెప్పుకోవాలంటే ఇంతవరకు చేసుకోలేదు.

ఈ వ్యవహారంలో పలు పుకార్లు వచ్చాయి. చాలా సార్లు వాటిని ఆమె ఖండించింది. మొన్నటి నవంబర్ లో ఆమె తన 40వ  పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. స్వీటీ అభిమానులు మాత్రం తమ అభిమాన తార ఎపుడు వెండి తెర పై కనబడుతుందా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!