ఎన్టీఆర్ తో పోటీ పడిన సూపర్ స్టార్ !

Sharing is Caring...

సూపర్ స్టార్ కృష్ణ నటించిన “కురుక్షేత్రం” చిత్రం అప్పట్లో ఎన్టీఆర్ కృష్ణ ల మధ్య మినీ యుద్ధాన్ని సృష్టించింది. 1976 లో ఎన్టీఆర్ ” దానవీర శూర కర్ణ ” మొదలు పెట్టారు. అందరూ ఆ సినిమా “కర్ణుడి కథే ” కదా అనుకున్నారు. అదే సమయంలో “పాండవ వనవాసం ” వంటి హిట్ సినిమా తీసిన నిర్మాత ఆంజనేయులు కురుక్షేత్రం  తీయాలని పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు ను డైరెక్టర్ గా పెట్టుకున్నారు.

అర్జునుడి పాత్రకు కృష్ణ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఎన్టీఆర్ ను కృష్ణుడిగా నటించమని నిర్మాత స్వయంగా అడిగారు. అయితే ఎన్టీఆర్  పూర్తి వివరాలు అడగకుండానే కుదరదన్నారు. ఇక ఆపాత్రకు శోభన్ బాబును తీసుకున్నారు. కర్ణుడి పాత్రకు కృష్ణంరాజు, దుర్యోధనుడిగా సత్యనారాయణ లను ఎంపిక చేసుకున్నారు. ఈ విషయాలన్నీ ఎన్టీఆర్ కు తెలిశాయి.

వెంటనే ఆయన కృష్ణ కు ఒకసారి వచ్చి కలవమని కబురు చేశారు. కృష్ణ వెళ్లి కలవగా “కర్ణ ను తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా .. దీనికి పోటీగా కురుక్షేత్రం తీయడం భావ్యం కాదు”అన్నారట ఎన్టీఆర్. అందుకు కృష్ణ సమాధానం చెబుతూ “అన్నగారు నాకు కురుక్షేత్రానికి సంబంధం లేదు. దానికి నిర్మాత ఆంజనేయులు గారు .. నన్ను అర్జునుడి పాత్రకు తీసుకున్నారు”అన్నారట. ” అయినా మీ మాటగా నిర్మాతకు చెప్పి చూస్తాను “అన్నారట.

ఎన్టీఆర్ తో అన్నట్టే నిర్మాత తో మాట్లాడితే ఆయన అంగీకరించలేదు. “ఇప్పటికే సెట్లు వేసాం. అందరి దగ్గర కాల్ షీట్స్ తీసుకున్నాం. కాస్ట్యూమ్స్ రెడీ చేశాం. కొందరికి అడ్వాన్సులు ఇచ్చాము.ఇపుడు ఆపేస్తే ఇక ముందు తీయడం కుదరదు. నేను ఏమో అనుకున్నా.ఇది పెద్ద సినిమా అయ్యేలా ఉంది. ఖర్చుకూడా అంచనాలను మించిపోతుంది .. ఇప్పటికే కొన్ని ఏరియాల బయ్యర్స్ కు కమిట్ అయ్యాం ” అన్నారట.నిర్మాత చెప్పిన మాటలు విన్నాక ఆయన చెప్పింది సబబే అని కృష్ణ భావించారు. అందులో నిర్మాతలు నష్ట పోవడాన్ని కృష్ణ అసలు సహించరు.

మళ్ళీ వెళ్లి ఎన్టీఆర్ తో కృష్ణ మాట్లాడారు. “నిర్మాత ఇప్పటికే చాలా ఖర్చుపెట్టారు .. ఇది అనుకోకుండా జరిగింది. ఈ దశలో ప్రొడక్షన్ ఆపితే నిర్మాత ఆర్ధికంగా నష్టపోతారు. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి” అని కృష్ణ చెప్పారు. కానీ ఎన్టీఆర్ కన్విన్సు కాలేదు. కొంచెం కోపం గా “సరే బ్రదర్ మీ ఇష్టం” అనేసి ఇంట్లోకి వెళ్లిపోయారట. ఇక అక్కడనుంచి షూటింగ్ మొదలు పెట్టి స్పీడ్ గా చేశారు. 

సినిమా 80 శాతం పూర్తి అయ్యాక నిర్మాత కు అనుకున్న సమయానికి డబ్బులు అందలేదు. ఇంకా క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించాలి. చేతిలో కొంత సొమ్ముమాత్రమే ఉన్నది. దాంతో ఆయన టెన్షన్ పడుతుంటే కృష్ణ గమనించారు. ఏమిటి అని అడిగితే విషయం చెప్పారు. కృష్ణ ఏమాత్రం ఆలోచించకుండా మీరు ధైర్యంగా ఉండండి … నేను చూసుకుంటాను అని  ప్రొడక్షన్ పనులు ఆగిపోకుండా పక్కాగా జరిగేలా చూసారు.

యుద్ధ సన్నివేశాలను రాజస్థాన్ లో తీశారు. 5వేలమంది జనం,50 ఏనుగులు,ఆరువందల గుర్రాలతో భారీగా తీశారు. ముఖ్యనటులు అందరికి జైపూర్ లో వసతి .. ఎక్కడ ఏ లోటూ జరగకుండా కృష్ణ ఆధ్వర్యంలో షూటింగ్ జరిగింది. అలా ఆ సినిమా నిర్మాణంలో అనుకోకుండా కృష్ణ భాగస్వామి అయ్యారు. నిర్మాతను వదిలేసి వెళ్లకుండా సినిమా పూర్తి చేశారు. నిర్మాత కూడా సంతోషించి కృష్ణ సమర్పణలో మాధవీ పద్మాలయా కంబైన్స్ గా  బ్యానర్  పేరు మార్చారు.

పోస్టర్స్ లో, సినిమాలో అదే పేరు కనిపిస్తుంది. ఆరోజుల్లో దాదాపు కోటి రూపాయలు ఖర్చుపెట్టారు. రెండు సినిమాలు 1977 జనవరి 14 న విడుదల అయ్యాయి. ఎన్టీఆర్ కర్ణ కంటే సాంకేతికంగా కురుక్షేత్రం బాగుంది. అయితే పౌరాణిక చిత్రం లో పద్యాలు లేకపోవడం కురుక్షేత్రం కు మైనస్ అయింది. శ్రీకృష్ణ రాయబారం పద్యాల హక్కులు ఎన్టీఆర్ దగ్గర ఉన్నాయి.

శ్రీకృష్ణావతారం(1967) సినిమా కు ముందే చెళ్ళపిళ్ళ వెంకటకవులు రాసిన పద్యాల హక్కులు ఎన్టీఆర్ కొన్నారు. కర్ణ కు అవే ప్లస్ అయ్యాయి.ఈ సినిమా విడుదలకు ముందు ప్రివ్యూ షో చూసిన విజయా చక్రపాణి కృష్ణ తో “కర్ణ అంటే కర్ణుడి కథ అనుకున్నా .. కురుక్షేత్రం మొత్తం చూపారు ఎన్టీఆర్. పద్యాలూ… ఎన్టీఆర్ నటన  ఆ సినిమాకు ప్లస్ అవుతాయి … మీ సినిమా కూడా బాగుంది.

అయితే కర్ణ ముందు తేలిపోతుందేమో .. ఒక నెల ఆగి రిలీజ్ పెట్టుకోండి ” అని సలహా ఇచ్చారట. అయితే కృష్ణ అందుకు ఒప్పుకోలేదట. “వాయిదా వేసుకుంటే ఎన్టీఆర్ కు భయపడ్డానని అనుకుంటారు. ఎన్టీఆర్ ను చూసే సినిమాల్లోకి వచ్చా.. ఈ రోజున ఆయనకు పోటీగా సినిమా తీసే స్థాయికి ఎదిగా. సినిమా ఆడితే కృష్ణ విజయం సాధించాడు అంటారు. లేదంటే ఎన్టీఆర్ చేతిలో ఓడిపోయాడు అంటారు” అని చక్రపాణి సలహాను సున్నితంగా తిరస్కరించారట. అక్కడ ఎన్టీఆర్ కురుక్షేత్రం బ్యానర్ చూసి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అక్కడ నుంచి ఇద్దరికీ కొంత కాలం మాటలు లేవు.

————–KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!