Taadi Prakash………………………..
22 సంవత్సరాల క్రితం…’విజయవిహారం’ పత్రికలో ఓ వ్యాసం రాయడానికి గద్దర్ ని కలిశాం…నేనూ, గాయకుడూ, కవీ లెల్లె సురేష్. గద్దర్ ని ఇంటర్వ్యూ చేశాము. అందులో ఒక పాట గురించి ప్రత్యేకంగా రాశాం. “నిండూ అమాసా నాడూ”….అనే పల్లవితో మొదలయ్యే ఆ పాట చాలా పాపులర్.
జనహర్ష’, ‘విజయవిహారం’ పనులన్నీ చూసే మిత్రుడు దుర్గారెడ్డి గారిని అడిగితే, పాత పేపర్ కటింగ్ పంపించారు. అప్పుడెప్పుడో రాసిన గద్దర్ పాట, దాని వెనుక కథ చదవండి.
ఈ మధ్యన గద్దర్ అంటే చాలా మంది చిరాకుపడుతున్నారు గానీ ఒకనాటి ఒరిజినల్ గద్దర్- తానొక్కడే ఒక సాంస్కృతిక మహోద్యమం కదా… ఆర్టిస్ట్ మోహన్, లెల్లె సురేష్, మల్లెల వెంకట్రావ్ లకి,నాకూ కబుర్లు చెప్పి, పాటలు పాడి… మాతో గంటలతరబడి గడిపిన అలనాటి ఉత్తేజం గద్దర్ నీ, ఆయన మనోహరమైన చిరునవ్వునీ తలుచుకుంటూ….. ఈ పాత జ్ఞాపకం. ఇది 2000వ సంవత్సరం మార్చిలో అచ్చయిన వ్యాసం.
కొన్నేళ్ళ క్రితం….ఉత్తర భారతదేశాన ఓ రాష్ట్రంలో గద్దర్ రహస్య జీవనం గడుపుతున్నాడు. రీసెర్చ్ స్కాలర్ ముసుగులో రోజులు దొర్లిస్తున్నాడు. నాగలితో వ్యవసాయం చేసే తెలంగాణ,ట్రాక్టర్తో వ్యవసాయం చేసే పంజాబ్-యిలా నార్త్, సౌత్ ఇండియాలో ఉత్పాదక పద్ధతుల్లో మార్పులొచ్చినప్పుడు పాట ఎలా మారిందన్న అంశం మీద రీసెర్చ్…. ఇదో సాకు. ఆ అండర్ గ్రౌండ్ రోజుల్లో ఒకనాడు.
ఎప్పట్లాగే ఉదయం రన్నింగ్ కు వెళ్ళాను. సూర్యోదయం అయింది. రైల్వేట్రాక్ పక్కన పరుగెడుతున్నాను. మూగిన జనం కనిపించారు. అక్కడో చెత్తకుండీ. దాని దగ్గర చింకి గుడ్డల్లో ఏడుస్తూ ఒక పసికందు. బిడ్డను తీసుకెళ్ళే వాళ్ళెవరూ లేరు. నేను మాత్రం ఎలా పెంచగలను? చూస్తున్నాం అందరం. అట్నించో ఆవు వస్తోంది. అందరూ అయ్యయ్యో అనే వాళ్లే.
బిడ్డని తీసిన వాళ్ళెవరూ లేరు. లెట్రిన్లు కడిగి, బక్కెట్ పట్టుకుని ఒక పాకీమనిషి అటుగా వస్తోంది. చూడగానే క్యా ఆద్మీ ఇన్ సాన్ హై? అని తిడుతూ పసిబిడ్డని ఎత్తుకుని హృదయానికి హత్తుకుంది. జాకెట్ చించి బిడ్డకి పాలిచ్చింది. నా బిడ్డే అని ప్రకటించింది. పక్కనే పోలీసు క్వార్టర్లు వుండడం వల్ల హడావుడి చూసి పోలీసులు వచ్చారు. ఆమెను స్టేషన్ కు తీసుకెళ్ళారు.
నేనూ వెనుకనే వెళ్ళాను. నువ్వెందుకొచ్చావ్? అన్నారు పోలీసులు. ఆమెకి పిటిషన్ రాయడంలాంటి సహాయమేమన్నా చేయొచ్చని…..ఇంగ్లీషులో మాట్లాడాను. దాంతో వూరుకున్నారు.నాకు అందరూ ఆడపిల్లలే….ఇది నా బిడ్డే అని ఆమె చెప్పింది. పోలీసులు ఆమె భర్తను పిలిపించారు. నిజమే మాకు ముగ్గురు ఆడపిల్లలు. నేనెప్పుడో ఆపరేషన్ చేయించుకున్నాను, నాలుగో బిడ్డకు ఆస్కారం లేదని చెప్పాడు.
పోలీసులు ఆమెపై కోపంతో ఊగిపోయారు. మరి ఈ ఆడపిల్లెవరు? అని గద్దించారు. మాలో పసిబిడ్డకి ముందు ఎవరు పాలిస్తే వాళ్ళే తల్లి అవుతారు, ఇది నా బిడ్డే అని చెప్పిందామె. నేను కదిలిపోయాను. అయినా ముగ్గురాడపిల్లలున్నారు కదా, ఈ పాపనెలా పెంచుతారు అని అడిగారు? ఏముందీ ముగ్గురు నలుగురు అవుతారు, పెంచుతాం అని ఆమె చెప్పింది. ఎస్సై కన్నీళ్ళు పెట్టుకున్నాడు. కాగితాల మీద భార్యాభర్తలు వేలిముద్రలు వేశారు. కొన్నాళ్ళు పోయాక మళ్ళీ ఈ బిడ్డని వాపసు ఇమ్మని అడగకండి అని ఆమె ప్రాధేయపడింది.
ఆ కథ రెండేళ్ళ తర్వాత గద్దర్ చేతిలో, గొంతులో కన్నీటి పాట పలికింది. బిడ్డల్ని పారవేసే సంప్రదాయం మనకి లేదు. మరిప్పుడెందుకు పడేస్తూన్నారు? అలా చేస్తున్నది మధ్యతరగతి తల్లా? ధనవంతురాలైన తల్లా? వేశ్యా? కుంతి కర్ణుణ్ణి వదిలేసిన తీరా? కార్మిక వర్గంలో ఎంత పేదవాళ్ళయినా ఎవరూ బిడ్డల్ని పడేయరు. పిల్లలు ఆకలితో చనిపోతే చనిపోవచ్చు. అమావాస్యనాడు ఆడపిల్లా, పున్నమినాడు కొడుకూ పుట్టాలంటారు.
ఆడపిల్లని లక్ష్మి అని , వరం అనీ ఆనందిస్తారు. అయినా ఎందుకిలా జరుగుతోందంటే, అది పెట్టుబడిదారీ విషసంస్కృతి ఫలితం. బతుకూ,మానవ సంబంధాలూ అమానుషంగా మారే భయానక పరిస్థితి, గాయపడిన కవి గుండె అక్కడ పాటై పల్లవించింది. పాటలో నడక, నీళ్ళు తాగినట్టుండాలి. నెయ్యో, అమృతమో తాగినట్టుండకూడదు. అవి మూతికీ, మీసాలకూ అంటుకుంటాయి. నీళ్ళు అంటవు. గడగడా వెళ్ళిపోతాయి.
అదీ ప్రజలపాట గొప్పదనం. అంత సూటిగా, స్వచ్ఛంగా ఒకదానికొకటి లింకుండే గొలుసులాగా జనం పాట హాయిగా సాగి పోతుంది. ప్రజలు…. పనీ, పాటనీ మేళవిస్తారు. నాగలి పట్టడంలో ఒక ఒడుపూ నైపుణ్యం ఉంటాయి. దానితోపాటే పాటా ఉంటుంది….అన్నారు గద్దర్.
“నిండూ అమాసానాడు ఓ లచ్చా గుమ్మాడీ….ఆడపిల్లా పుట్టినాదే ఓ లచ్చాగుమ్మాడీ”…ఇలా మొదలవుతుంది గద్దర్ పాట. పల్లవితోనే అది చెవిని పట్టేసుకుంటుంది. “పున్నమిదినము గోలే….పుట్టకాడ పడేస్తే”….అని ఓ చరణం. అసలు పుట్టకాడ ఎందుకు పడేస్తారు? తల్లి బిడ్డను చంపలేదు. తన ప్రమేయం లేకుండా చనిపోతే , నింద తనమీదకు రాదు. పుట్టదగ్గరికి పూజకు ఆడవాళ్ళు వస్తారు. పున్నమినాడు బిడ్డ దొరికిందంటే అది అదృష్టం అనుకుంటారు.
నాగమ్మ అనో, నాగయ్య అనో పేరు పెట్టుకుంటారు. ఆ అమ్మకు దేవుడు బిడ్డనిచ్చాడని వూళ్ళో పదిమందీ చెప్పుకుంటారు. కనుక నా బిడ్డ ఎక్కడున్నా పదిలంగా వుంటే చాలు అనుకుని పుట్టదగ్గర పారేస్తుంది. “ఊపిరాడకుండానేమో బొంత మీద బొంత గప్తే సిల్లీ రంద్రం నుండీ, పుల్కు, పుల్కూ నవ్వెనమ్మా”….అంటాడు మరో చరణంలో.
మరణం అంచున విషాదంలోనూ జీవితపు మురుపును పట్టుకుంటాడు గద్దర్. కన్నీళ్ళ పర్యంతం చేసే ఒక సన్నివేశాన్ని కవిత్వంగా కూర్చి ఒక సజీవ దృశ్యాన్ని శాశ్వతం చేస్తాడు తన పాటతో.ఆడదానితో అన్నమూ, మొగాడితో పిల్లలూ అంటారు. ఇద్దరూ అంతముఖ్యం. అందుకే గద్దర్…”మగబిడ్డ చెయ్యని నేరం ఆడబిడ్డలేమి జేసే…ఆడబిడ్డ లేనిదే లోకమెట్లు పుట్టె” అని అడుగుతాడు. తల్లి సమాధానపడుతుంది. తప్పు చేయనంటుంది.
“నేను సెత్తల్లో పారెయ్యనమ్మా, నా పొత్తిల్లో దాసుకుంటా, నేను బావిలో పడెయ్యనమ్మా, నేను బట్టలల్ల చుట్టనమ్మా” అని కన్ ఫెస్ చేస్తుంది. అప్పటిదాకా సమస్యనీ, దాని తీవ్రతనీ, దౌర్భాగ్యాన్నీ, గుండెలు పిండేలా కవిత్వీకరించిన గద్దర్, చివర్లో సాయుధ కవై చెలరేగుతాడు.చివరికి ప్రాణం దక్కించుకున్న ఆ పసికందుని….”నిన్ను సమ్మక్కని చేస్తా, సారక్కని చేస్తా…చెల్లీ కుమారిని చేస్తా, ఝాన్సీని, రుద్రమనూ” చేస్తానంటాడు ఆవేశంగా. సమ్మక్కా, సారక్కలు తెలంగాణ గ్రామీణ దేవతలు. ఝాన్పీ, రుద్రమలు భారత వీరనారీమణులు.
మరి శోభక్కా, కుమారీ ఎవరు? అని జనం ఆలోచించి, తెల్సుకోగలిగితే గద్దర్ కోరుకున్న ప్రయోజనం నెరవేరినట్టే. భ్రష్టుపట్టిన వ్యవస్థని బదాబదాలు చేయడానికి తుపాకీ పట్టిన విప్లవకారిణులు వాళ్ళిద్దరూ. జనాన్ని చైతన్యవంతం చేసే గొప్ప టెక్నిక్ ఇది.
పండితుడు కాకపోవడం, సిద్ధాంతాలు, విమర్శలు, తర్కం పెద్దగా తెలియకపోవడం గద్దరుకున్న పెద్ద ప్లస్ పాయింట్. గొప్ప భాషలేనోడు, గొప్ప పరిజ్ఞానం లేనోడూ కన్వే చేయడానికి దృశ్యాన్ని ఎంచుకుంటాడు. ఒకడు బాగా పొడుగ్గా ఉంటే వోడుసూడు తాడిచెట్టంత పెరిగాడు అంటారు జనం. చదువుకున్నోడు వాడి హైట్ ఫైవ్ ఎయిట్ అంటాడు…అని అభినయిస్తూ నవ్వుతూ చెప్తాడు గద్దర్.
గద్దర్ పాటకి జీవాన్నీ, కళనీ, శాశ్వతత్వాన్నీ తెచ్చిపెట్టింది దృశ్యమే. నాలుగేసి పదాలున్న కొన్ని పొట్టి పంక్తుల్లో ఒక 70 ఎం.ఎం. దృశ్యాన్ని కళ్ళకు కడతాడు. బీడీలు చుట్టే బతుకే దరిద్రం. ఆడదీ అయ్యి, బీడీలు చుట్టేది అయితే మరింత హీనం. ఆ దురదృష్టాన్ని మరో పాటలో గద్దర్ యిలా అంటాడు..
.”మొగోల్లనోల్లల్లో…బీడీలయ్యి కాలిపోయే ఆడోల్లం….ఆకులన్ని కత్తిరించి, అందులో పొవ్వాకయ్యి, దారంతో కట్టివేసి బీడీ నోరూ మూసేసి ఆకుల్లో బందీలైతము…లోకానికి దూరమైతము” అని బీడీలా కాలి బూడిదయ్యే ఆ చిన్న బతుకులో బానిసత్వం, అణిచివేత, నిస్సహాయత నిండిన పెను విషాదాన్ని పాటలో పలికించి ఏడిపిస్తాడు. ఎంత రాసినా, పాట రూపం శబ్దం, శబ్దంలో విన్నప్పుడే దాని మజా. అందుకనే పాట కవితకంటే సజీవమైనది.
ఎన్ని తాత్వికమెలికలు తిరిగినా కవిత అక్షరాల పొందిక మాత్రమే. పేద తెలంగాణ మట్టి సువాసననికి పుట్టిన మంచికవి గద్దర్.కవిత్వాన్ని, ఆర్డీ ఎక్స్ నీ కలిపి, కన్నీళ్ళలో తడిపి… దాన్ని నీ గుండెకింద పెట్టి నీ కళ్ళ ముందే మీటనొక్కి పాటతో పేల్చేసే సాయుధ గాయకవి గద్దర్.
దళిత గుండె గాయాన్ని, నిద్ర గన్నేరు నిశ్శబ్దాన్నీ ప్రజాయుద్ధగానంగా, రక్తాశ్రుగీతంగా, అరుణారుణ సంగీతంగా నరాల తీగపై పలికిస్తున్నవాడు గద్దర్. పాట కవిత్వం కాదని అనలేక పెదవి విరుస్తున్న వాళ్ళని చూసి పరిహాసంగా నవ్వుతున్నాడు గద్దర్.
**** **** **** ఆ పాట ****
నిండు అమావాసనాడు ఓ లచ్చా గుమ్మాడీ
ఆడపిల్ల పుట్టినాదే ఓ లచ్చా గుమ్మాడీ
అత్త తొంగి సూడలేదు మొగుడూ ముద్దాడలేదు…
బట్టలల్ల సుట్టుకోని- బాయిలో పడేయబోతే
గంగమ్మ కొంగు చాపి సెల్లెదనమియ్యమంది
సెత్త గంపలేసుకుని సెత్త కుండిలెయ్యబోతే
కుక్కపిల్ల అడ్డమొచ్చి…. అక్క అట్ల సేయకనే
ఊపిరాడకుండనేమో బొంతమీద బొంత గప్తె
సిల్లీరంద్రం నుండి సిన్నంగ చూస్తుంది
పున్నమి దినము గోలె పుట్టకాడ పడవేస్తే
నాగన్న పడిగె విప్పి గొడుగుబట్టిండమ్మ
పురిబోసినట్లు నేను నల్లబూస దారం గడితే
నెల్లపూస దండలాయె మల్లెపూల దండలాయె
పాలుతాగనని నేను పంతాలు పట్టుకొంటె
పాలసేపులు దుంకిపోయె పాపనోట్లె బడ్డదమ్మో
వరిగింజ నోట్లోవోసి గొంతుబిస్కవోతే
పెదువులేమొ అడ్డమొచ్చి పుల్కుపుల్కు నవ్వెనమ్మో
కనుకున్న కడ్పుకోత కన్నీటి దారలాయె
పేగుకోసి పెంచుకున్న నాపాప నెట్లు పారేతూ
ఆడదానితో అన్నమావిరి…మొగోనితో పిల్లలవిరి
మొగబిడ్డ చెయ్యని పాపం ఆడబిడ్డలేమి చేసే
ఆడబిడ్డలేనిదే లోకమెట్లు పుట్టిపెరిగి
కన్న బిడ్డ మీదనే కన్నతల్లె పగబడితె
నాకు దిక్కెవరే బిక్కుబిక్కు ఎడ్చె బిడ్డ
చిట్టి చిట్టి కండ్లతోనె…సూటిప్రశ్న వేసే బిడ్డ
నేను సెత్తల్లో పారెయ్యనమ్మా- నా పొత్తిల్లో దాసుకుంటా
నేను బావిలో పడెయ్యనమ్మా- నేను బట్టలల్ల చుట్టనమ్మా
నేను వొరిగింజ వేసి చంపా…నేను వురిపోసి చంపుకోను
నిన్ను సమ్మక్క చేస్తా..సారక్కను చేస్తా
అక్కా శోభక్కనూ చేస్తా…చెల్లీ కుమారిని చేస్తా..