Taadi Prakash ……………………………………………….
‘బాలి’ గురించి ఆర్టిస్ట్ మోహన్ 30 సంవత్సరాల క్రితం రాసిన వ్యాసం ఇది. గొప్ప సంపాదకుడు, ప్రసిద్ధ రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఈ వ్యాసంలో బాలి గురించి చెప్పిన మాటల్ని మోహన్ కోట్ చేశాడు. అప్ కమింగ్ ఆర్టిస్టులకి పురాణం గారు చేసిన సూచనలు చాలా విలువైనవి. సటిల్ హ్యూమర్ తో ఆయన చేసే కామెంట్లు చాలాకాలం గుర్తుండిపోతాయి. బాలి కోసం, పురాణం కోసం – ఈ పాత వ్యాసం. ఆర్టిస్ట్ బాలి ఇప్పుడు విశాఖలో వుంటున్నారు. ప్రస్తుతం పురాణం రచనలు చదువుతున్నాను. త్వరలోనే ఆ గొప్ప రచయిత గురించి రాస్తాను.
* * *
అతను ఆర్టిస్టు. అయినా మంచివాడు. పాపం బొమ్మలేస్తాడు. అయినా స్నేహశీలి. మంచి పేరుంది. అయినా ఆ వినయం, ఆ వందనం, ఎంతో ఇదిగా ఉంటాడు. టక్ చేసుకుంటాడు. కానీ రంగులు బాగా వేస్తాడు. ఎవ్వరితోనూ గొడవలు పెట్టుకోడు. బుద్ధిమంతుడు. నలుగురితో నారాయణా టైపు. ఇలాంటి చెత్తంతా ఎత్తుకొచ్చి ఎంతేనా రాయొచ్చు. ఎవ్వడి గురించేనా చెప్పొచ్చు.
ఆర్టిస్టు గారు అనేవాడు మంచోడైతే ఎవడికి చెడ్డోడైతే ఎవడికి! వాడు ఎవడితో ఎలా ఉంటే ఎవడికి పట్టింది. (బాలి చిత్రోత్సవ చిత్ర మాలిక 1959-84 అనే వ్యాసాల బొమ్మల పుస్తకం చదివిన తాత్కాలిక యవ్వనోద్రేకంలో నేనేదేదో కోప్పడుతుంటే అర్థంకాక మీరు బిత్తరపోతున్నారని తెలుసు)బాలిని చిత్రకారుడిగా దేశానికి పరిచయం చేసిన పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు ఆ పుస్తకంలో మరోసారి పరిచయం ఇలా రాశారు..
“చి॥ బాలి 1941లో అనకాపల్లిలో అన్నపూర్ణ – లక్ష్మణరావు దంపతులకు జన్మించారు. వీరి నాన్న లక్ష్మణరావు గారు నీటి రంగులలో లేండ్ స్కేప్ పెయింటింగ్లు చేసేవారు. తల్లికూడా చిత్ర కళాభిమాని. అనకాపల్లిలో శారదా నది నీళ్లుతాగి కొంతవారైన వారిలో (ప్రస్తుతం వడ్డాది పాపయ్యగారు శారదా నీరు తాగి ఆ యేటి గాలి పీలుస్తూ తాటితోపులో మంచి ఇల్లు నిర్మించుకున్నారు) రావి శాస్త్రిగారి తర్వాత బాలి గార్ని కూడా చెప్పుకోవచ్చు.
తప్పు లేదు… మేడిశెట్టి శంకర్రావు ఆఫ్ అనకాపల్లిని గుర్తించడంలో, అతన్ని కమర్షియల్ ఆర్ట్స్ వైపు తొలి పాఠాలు చెప్పి మళ్లించడం యాదృచ్ఛికంగా మావల్లనే.. అంటే ఆంధ్రజ్యోతి వల్లనే జరిగిందని నాకు గుర్తు. “ఆచ్చమ్మ కాఫీ హోటల్” అనే కథకు అడిగి బొమ్మ వేయించడం ద్వారా ‘శంకర్’ అనే చిత్రకారుడు అనేక మంది శంకర్లలో సంకరమైపోకుండా ‘బాలి’ అనే పేరు వేరుగా పెట్టి, అతన్ని కాపాడవల్సి వచ్చింది.
ఇదంతా గొప్పకోసం చేసింది కాదు. ఆరోజుల్లో అతని బొమ్మకు 5 నుండి 10 రూపాయలు ఇచ్చే వాళ్లమని గుర్తు. ఇతను 1983 నాటికి సుమారు ఆరేడు వేల చిత్రహింస కాకుండా చిత్రానందాన్ని మనకు కలిగించినందుకు అతనికి కుడోస్ చెప్పవచ్చు.”అదే వ్యాసంలో బాలి ఒక్కడికే కాకుండా ఆర్టిస్టులందరికీ అవసరమైన విషయాలు పురాణం గారు చెప్పారు.
బతకడం, కళ, డబ్బు లాంటి పెద్ద సమస్యలని ఆయన గొప్ప అనుభవంతో చిన్న వాక్యాల్లో ఇలా రాశారు : శ్రీ బాలి వ్యక్తిగతంగా చాలా సింపుల్ మేన్. వేషభాషల్లో పరిశుభ్రంగా, మచ్చలేని మనిషిలా ఉంటాడు. కానీ ఇతను ఇంకా ఎక్కువ తపన పడాలి.బాధ పడాలి.ఎక్కువ కష్టాలు పడేవాళ్ళ గురించి తెలుసు కోవాలి. రొటీను బొమ్మలు వేయ కూడదు. కానీ – కళకు దూరంగా ఉండాలి.
తనదైన వరవడిని ఏర్పాటు చేసుకుని, తనతోపాటు తన కళ అంతరించేది కాకుండా పది కాలాలపాటు నిలబడి, ఊపి, ప్రశ్నించి, తిరగబడే విధంగా చేయగల కళకు కారణమైతే అప్పుడతని జీవితం ధన్యమవుతుందని నేను భావిస్తాను. అలా కాకపోతే డబ్బులు గడించిన కిరసనాయిలు తహశీల్దార్ కీ, మంచి కళాకారుడికీ తేడాలేకుండా పోతుంది.