Popular tourist destination……………………………………….
పోర్ట్ బ్లెయిర్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది అండమాన్ .. నికోబార్ దీవుల రాజధాని నగరం. ఈ ద్వీపం చుట్టూ విశాలమైన తీరప్రాంతం.. ఉష్ణమండల అడవులు ఉన్నాయి.వేడి,తేమతో కూడిన విభిన్న వాతావరణం ఈ ద్వీపం ప్రత్యేకత.
ఈ ద్వీపం ప్రకృతి అందాలకు నెలవు. ఇక్కడికి వివిధ దేశాలు, ప్రదేశాల నుండి వేలసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ చారిత్రిక పర్యాటక నగరం పేరును శ్రీ విజయపురంగా మార్చింది. ఈ పేరు పాపులర్ కావడానికి మరికొంత కాలం పట్టొచ్చు.
వలస వారసత్వాన్ని వదిలించుకోవడానికి పోర్ట్ బ్లెయిర్‌ను “శ్రీ విజయ పురం”గా మారుస్తున్నట్టు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించారు. పోర్ట్ బ్లెయిర్ కి అసలు ఆపేరు ఎలా వచ్చిందంటే 18వ శతాబ్దం ప్రారంభంలో రాయల్ నేవీలో పనిచేసిన బ్రిటీష్ నౌకాదళ అధికారి లెఫ్టినెంట్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ సేవలకు గుర్తుగా ఈ నగరానికి ఆ పేరుని బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది. తూర్పు బంగాళాఖాతంలో బ్రిటిష్ వలస రాజ్యాల విస్తరణలో బ్లెయిర్ కీలక పాత్ర పోషించారు.
ఇక ఈ ప్రదేశం ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గధామం. పర్యాటకుల సందర్శనకు గొప్ప ప్రదేశం. ప్రశాంతమైన బీచ్, నీలిరంగు నీరు,పచ్చదనం పర్యాటకుల మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి.శ్రీ విజయ పురం లో చూడదగిన అనేక ఇతర ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ దేశ చరిత్ర, సంస్కృతిని తెలియ జేస్తాయి.
సెల్యులార్ జైలు చూడదగిన వాటిలో ముఖ్యమైనది. బ్రిటిష్ వారు ఇక్కడ అట్లాంటా పాయింట్ వద్ద 1896 -1906 మధ్య సెల్యులార్ జైలును నిర్మించారు. ఇక్కడే చిదంబరం పిళ్ళై, వినాయక్ దామోదర్ సావర్కర్, దివాన్ సింగ్, బటుకేశ్వర్ దత్ వంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ను బంధించారు.
ఇక్కడి సాముద్రిక నావల్ మారిటైమ్ మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అలాగే అంతర్నిర్మిత అక్వేరియం కూడా చూడదగిన వాటిలో ఒకటి. ఇందులో సముద్రపు మొక్కలు స్టోన్ ఫిష్, చిలుక చేపలు, సముద్ర గర్భంలోని వివిధ చేప జాతులను చూడవచ్చు. శ్రీ విజయపురంకు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిడియా తపు అనే ద్వీపం చెప్పుకోదగిన ప్రదేశం. దట్టమైన అడవులతో కూడిన ఈ ప్రదేశంలో లెక్కలేనన్ని పక్షులను చూడవచ్చు. సూర్యాస్తమయం దృశ్యం కూడా ఇక్కడ అందంగా ఉంటుంది.
అలాగే మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ ని సందర్శించదగిన ప్రదేశమే.ఇక్కడ అనేక అందమైన సముద్ర జీవులు కనిపిస్తాయి. సముద్ర జీవులను సంరక్షించడం కోసమే ప్రత్యేకంగా ఈ పార్క్ ను నిర్మించారు.ఈ మెరైన్ పార్క్‌లో నిర్ణీత రుసుము చెల్లించి స్కూబా డైవింగ్, బోటింగ్, స్నార్కెలింగ్ వంటి సాహసాలను చేయవచ్చు. శ్రీ విజయపురం కు వెళ్లాలంటే విమానంలో లేదా నౌక లో మాత్రమే వెళ్ళగలం. రైలు మార్గం లేదు.