Historical Bridge……
రాయచూర్ ప్రాంతంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన వంతెన సిరత్-ఏ-జూడీ (Sirat-e-Judi).. దీనిని కృష్ణ బ్రిడ్జి అని కూడా పిలుస్తారు.హైదరాబాద్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో ఈ వంతెన నిర్మాణం జరిగింది. దీని పనులు 1933లో ప్రారంభమై 1943 నాటికి పూర్తయ్యాయి.ఈ వంతెన నిర్మాణానికి అప్పటి నిజాం ప్రభుత్వం ₹13,28,500 ఖర్చు చేసింది.
ఇది కర్ణాటకను తెలంగాణను కలుపుతూ కృష్ణా నదిపై నిర్మించబడింది. ఆ కాలంలో ఇది ఉత్తర … దక్షిణ భారతాన్ని కలిపే కీలక మార్గాలలో ఒకటిగా ఉండేది.ఈ బ్రిడ్జికి కర్ణాటక వైపు రాయచూర్ జిల్లాలోని శక్తినగర్ ఉండగా తెలంగాణ వైపు మక్తల్ నియోజకవర్గంలోని గూడెబల్లూర్ గ్రామం ఉంటుంది.ఈ వంతెన పొడవు సుమారు 2,448 అడుగులు, వెడల్పు 20 అడుగులు.ఈ వంతెనపై మొత్తం 35 ఆర్చ్‌లు ఉన్నాయి.
దీని నిర్మాణంలో సిమెంట్, ఇసుక, కంకర లేకుండా గ్రానైట్ రాళ్లను ఉపయోగించారు.ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పుకోవాలి.ఆ రోజుల్లో నదికి ఆనకట్టలు లేనప్పుడు వచ్చే భారీ వరదలను తట్టుకునేలా ఈ వంతెనను డిజైన్ చేశారు. ఎంత పెద్ద వరద వచ్చినా వంతెన మునిగిపోదు, నీరు పైనుంచి ప్రవహించదు, కేవలం వంతెన కింద ఉన్న సొరంగాల ద్వారానే వెళ్తుంది. ఇది వరద ప్రవాహాన్ని నియంత్రిస్తుంది.
వంతెన ప్రవేశ ద్వారాల వద్ద అశోక చక్రంలోని నాలుగు సింహాల (Ashoka Lion Capital) శిల్పాలు గంభీరంగా కనిపిస్తాయి.“సిరత్” అంటే అరబిక్ భాషలో దారి లేదా వంతెన అని అర్థం. జూడీ అనేది నోవా నౌక విశ్రమించిన పర్వత ప్రాంతం పేరుగా భావిస్తారు.
2024 ఫిబ్రవరిలో ఈ వంతెన సమీపంలో కొత్త బ్రిడ్జి కోసం తవ్వకాలు జరుపుతుండగా, సుమారు 1000 సంవత్సరాల క్రితం నాటి విష్ణు విగ్రహం (దశావతారాల శిల్పం) శివలింగం బయటపడ్డాయి. ఈ వంతెన పాతదైపోవడంతో ప్రస్తుతం భారీ వాహనాల రాకపోకల కోసం కొత్త వంతెనను పక్కనే నిర్మిస్తున్నారు.
మీరు సందర్శించాలనుకుంటే రాయచూర్ నుండి సుమారు 22 కి.మీ దూరంలో శక్తి నగర్ వద్ద ఉన్న కృష్ణ బ్రిడ్జిని చూడవచ్చు. అక్కడకు వెళితే రాయచూర్ కోటను కూడా చూసి రండి. క్రీ.శ. 1294లో వరంగల్ కాకతీయ పాలకులు ఈ కోటను నిర్మించారు.
రాణి రుద్రమదేవి ఆదేశాల మేరకు ఆమె మంత్రి రాజా విఠల ఈ కోటను నిర్మించినట్లు అక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తోంది.కృష్ణ ..తుంగభద్ర నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతం అత్యంత సారవంతమైనది కావడంతో, దీనిని దక్కించుకోవడానికి వివిధ సామ్రాజ్యాల మధ్య శతాబ్దాల పాటు పోరాటాలు జరిగాయి.
photo credit …..siva racharla

