Charges can be paid in installments………………………………
ఐఆర్సీటీసీ తాజాగా సౌత్ రామాయణ యాత్ర ను నిర్వహిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ చార్జీలను ఈఎంఐ ద్వారా కూడా చెల్లించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ పర్యటన 11 రోజుల పాటు సాగనుంది. జనవరి 25 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. దీనికి ‘రామాయణ యాత్ర ఆఫ్ సౌత్’ అని పేరు పెట్టారు.
ఈ టూర్ 10 రాత్రులు, 11 పగళ్లు ఉంటుంది. ఢిల్లీలోని సఫ్టర్ జంగ్ నుండి ఈ టూర్ మొదలవుతుంది. ఈ ప్యాకేజీలో ప్రయాణికులు మధుర, ఆగ్రా, గ్వాలియర్, వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్ పూర్, బినా, భోపాల్ లలో రైలు ఎక్కవచ్చు. ఐఆర్టీసీ అందిస్తున్న ఈ టూర్ ప్యాకేజీలో వసతి, ఆహారం ఉచితంగా అందిస్తారు.
ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణీకులకు శ్రీరామునికి సంబంధించిన ప్రదేశాలను చూపిస్తారు. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణీకులు నాసిక్ లోని త్రయంబకేశ్వర ఆలయం, పంచవటి, సీతా గుహ, కాలారం ఆలయాలకు తీసుకువెళతారు.
అంజనాదారి పర్వతం, విరూపాక్ష దేవాలయం, హంపి లోని విఠల్ దేవాలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, ధనుష్కోటి విష్ణు కంచి ఆలయం, శివకంచి, కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి ఆలయాలను సందర్శించడానికి తీసుకువెళతారు. అంతకు ముందు కూడా ఈ యాత్రను ఐఆర్సీటీసీ నిర్వహించింది. తెలంగాణ ఆంధ్రా వాళ్ళు భోపాల్ వెళ్లి రైలు ఎక్కాల్సి ఉంటుంది.
ఈ టూర్ ప్యాకేజీలో మూడు కేటగిరీలు ఉన్నాయి. యాత్రీకులు తమకు అనువైన కేటగిరీని ఎంచుకోవచ్చు. కంఫర్ట్ కేటగిరీలో ఒక్క ప్రయాణానికి రూ.42 వేల 155 కాగా డబుల్, ట్రిపుల్ షేరింగ్ కు ఒక్కొక్కరికి రూ.36 వేల 655 చెల్లించాల్సి ఉంటుంది. సుపీరియర్ క్లాస్లో సింగిల్ షేర్ కు రూ.34 వేల 150, డబుల్, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 29 వేల 695 చెల్లించాల్సి ఉంటుంది.
స్టాండర్డ్ క్లాస్లో సింగిల్ జర్నీకి రూ.28 వేల 550, డబుల్, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 24 వేల 825 చొప్పున ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణీకులు నెలకు రూ.1370 చొప్పున EMI చెల్లించడం ద్వారా ఈ ప్రయాణ సౌకర్యాన్నిపొందవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ బుకింగ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఉంటుంది. మరిన్ని వివరాలకు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ www.irctctourism.com ను సందర్శించి తెలుసుకోవచ్చు.