రాజ్యసభకు సోనియా .. ఆమె కాదంటే  ప్రియాంక !!

Sharing is Caring...

Rajya sabha elections……………………………..

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. సోనియా ప్రస్తుతం రాయబరేలీ లోకసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక వేళ సోనియా కాదంటే  కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఈ స్థానం నుంచి ఎన్నిక కావచ్చు. హిమాచల్ ప్రదేశ్‌లో ఒకే ఒక్క రాజ్యసభ సీటుకు ఎన్నిక జరగబోతుంది.

కాంగ్రెస్ పార్టీ లో ఈ మేరకు చర్చ జరుగుతోంది. హిమాచల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ ఈ విషయాన్నిఅధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. ప్రియాంక గాంధీ ఇప్పటివరకు  పార్లమెంటు సభ్యురాలు కాదు.  ఆమె లోక్‌సభ ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. రాజ్యసభకు కూడా నామినేట్ కాలేదు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రియాంకను పోటీ చేయమని పార్టీ వర్గాలు కోరాయి. అప్పట్లో అందుకు ఆమె సుముఖత చూపలేదు.

రాయ్‌బరేలీ, అమేథీ కాంగ్రెస్‌ కు పట్టున్న స్థానాలు. అయితే 2019లో అమేథీలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ గాంధీ అక్కడ ఓటమి పాలయ్యారు.  2019 లోకసభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ ప్రజలు సోనియా గాంధీ వైపే మొగ్గు చూపారు. సోనియాగాంధీ గత కొంతకాలంగా ఆరోగ్యం బాగోలేక పోవడంతో నియోజకవర్గానికి తరచుగా వెళ్లలేకపోతున్నారు.

ప్రియాంక గాంధీ  అపుడపుడు వెళ్తున్నారు. కానీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆమె నిర్ణయం తీసుకోలేదు. రాహుల్ కూడా మరల అమేధీ నుంచి పోటీ చేస్తారా ?లేదా ? అనేది సందేహమే. బీజేపీ ఈ రెండు స్థానాలపై కన్నేసింది. మంత్రి స్మృతి ఇరానీ అటు అమేధీ తో పాటు రాయబరేలీ లో కూడా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రాయబరేలీ లో ఈ సారి పోటీ గట్టిగా ఉండొచ్చు.

ఇక 2022 హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించారు.  ప్రియాంక గాంధీకి సిమ్లాలోని ఛరాబ్రాలో సొంత ఇల్లు కూడా ఉంది.  సోనియా, ప్రియాంకలు కాదంటే  కాంగ్రెస్ నుంచి బిప్లవ్ ఠాకూర్, ఆనంద్ శర్మ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఆ మధ్య జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లతో మెజారిటీ సాధించింది. దీంతో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్  ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.

68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి మొత్తం 25 సీట్లు ఉన్నాయి. మరి కొద్దీ రోజుల్లో ఎవరు పోటీ చేస్తారో తేలిపోతుంది. దేశంలోని 15 రాష్ట్రాల్లోని  56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయి.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!