Lord Rama………
తెలుగు చలనచిత్ర చరిత్రలో శ్రీరాముని పాత్రను పోషించి, తమ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నటులు ఎందరో ఉన్నారు. తెలుగు తెరపై రాముడు అంటే ఇప్పటికీ అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఎన్టీఆరే .
1959లో విడుదలైన ‘సంపూర్ణ రామాయణం’లో తొలిసారి రాముడిగా ఎన్టీఆర్ నటించారు. ఈ సినిమాలో భరతునిగా శివాజీ గణేశన్ నటించారు. ప్రముఖ నటి పద్మిని సీతగా నటించారు. ఆ తర్వాత ‘లవకుశ’ చిత్రంలో ఎన్టీఆర్ మళ్ళీ రాముని పాత్రలో నటించారు. ఇందులో నాటి ప్రముఖ నటి అంజలీదేవి సీతగా నటించారు.కాంతారావు లక్షణుడిగా ,శోభన్ బాబు శత్రుఘ్నుడిగా నటించారు.
ఆరోజుల్లో లవకుశ బంపర్ హిట్ అయింది.తర్వాత కాలంలో ఎన్టీఆర్ రామదాసు, శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రాల్లోనూ రాముడి పాత్ర పోషించారు. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన శ్రీరామ పట్టాభిషేకం సినిమాలోనూ ఎన్టీఆర్ రాముడి పాత్రలో నటించారు.
ఆరోజుల్లో ఎన్టీఆర్ రాముడిలా తెరపై కనిపిస్తే ప్రేక్షకులు థియేటర్లలో వెండితెరకు హారతులు ఇచ్చేవారు.అలాగే ఆయన నిర్మించిన సీతారామ కళ్యాణంలో హరనాథ్ ను శ్రీరాముడిగా తీసుకున్నారు.శోభన్ బాబు లక్షణుడిగా నటించారు. ఆ తర్వాత 1968లో విడుదలైన ‘శ్రీరామకథ’ సినిమాలోనూ హరనాథ్ రాముడిగా కనిపించారు.
అయితే ఎన్టీఆర్ కంటే ముందు అక్కినేని శ్రీరాముడిగా ‘శ్రీ సీతారామ జననం’ చిత్రంలో నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందారు.అక్కినేని కంటే ముందు తొలిసారి తెరపై రాముడిగా కనిపించింది మాత్రం నటుడు యడవల్లి సూర్యనారాయణనే. 1932లో ఆయన ‘పాదుకా పట్టాభిషేకం’ చిత్రంలో రాముడిగా నటించారు. ఆ తర్వాత అదే పేరుతో 1945లో విడుదలైన చిత్రంలో ‘సీఎస్ఆర్ ఆంజనేయులు’ రాముడిగా నటించారు.
1968లో విడుదలైన ‘వీరాంజనేయ ‘చిత్రంలో కాంతారావు రాముడిగా కనిపించారు. ఇందులో సీతగా అంజలీ దేవి నటించారు 1971 లో బాపు దర్శకత్వంలో రూపొందిన ‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో శోభన్ బాబు రాముడిగా నటించి మెప్పించారు. ఆయన రూపం, ఆహార్యం ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఇందులో సీత గా నటి చంద్రకళ నటించారు. రావణాసురుడు గా ఎస్వీఆర్ నటించారు.
1976లో బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా కల్యాణం’ సినిమాలో నటుడు రవికుమార్ రాముడిగా ఒదిగిపోయారు. సీత గా జయప్రద నటించారు. తర్వాత తరంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన శ్రీరామదాసు లో సుమన్ రాముడిగా నటించి ప్రేక్షకులను అలరించారు . బాపు డైరెక్ట్ చేసిన శ్రీ రామ రాజ్యం లో బాలకృష్ణ రాముడిగా నటించి తండ్రి వారసత్వాన్ని చాటుకున్నారు.ఇందులో సీతగా నయనతార నటించారు.
పాన్ ఇండియా చిత్రం **’ఆదిపురుష్’**లో ప్రభాస్ రాఘవుడిగా నటించారు. 1997 లో జూనియర్ ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ చిత్రంలో బాల నటుడిగా రాముడి పాత్రను పోషించి మెప్పించారు. ఈ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు, రెండు నంది అవార్డులను దక్కించుకుంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవుళ్లు’ చిత్రంలోని ఓపాటలో శ్రీకాంత్ రాముడిగా నటించారు.
అలా అవకాశం వచ్చినపుడు తెలుగు నటులు శ్రీరామునిగా నటించి ప్రేక్షకులను అలరించారు.పైన చెప్పుకున్న హీరోలలో ఎక్కువ సార్లు రాముని పాత్ర చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో మాత్రం ఎన్టీఆర్ ఒక్కరే.

