సరళీకృత అక్రమప్రేమ !!

Sharing is Caring...

Taadi Prakash………………….

బాసు భట్టాచార్య ‘ఆస్తా’…………………………….
A contagious disease Called consumerism 
1996…పీవీ నరసింహరావు, మన్మోహన్‌సింగ్‌ కలిసి తెచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితాలను ఇండియా ఎంజాయ్‌ చేస్తోంది. అమెరికన్‌ డాలర్లూ, గల్ఫ్‌డబ్బూ, విదేశీ బైక్‌లూ, కార్లూ, కొత్త అవకాశాలూ వచ్చిపడుతున్నాయి. వందల కోట్ల చేతుల ఇండియన్‌ మార్కెట్‌ ప్రపంచదేశాల్ని  వూరిస్తోంది. మార్కెట్‌ విస్తరిస్తోంది. ఆశ పెరుగుతోంది. మనిషి సరుకుగా మారుతున్నాడు.

అటు కలకత్తాలో దర్శకుడు బాసూ భట్టాచార్య ‘ఆస్తా’ సినిమాకి కథ రాస్తున్నాడు. కమర్షియలైజ్‌ అవుతున్నకాలంలో ఆడది కమొడిటీగా మారుతున్న విషాదమే  ‘ఆస్తా’. మార్కెట్‌ ముసుగులో పెట్టుబడిదారీ విధానం మన బెడ్‌రూంలోకీ ,  వంటింట్లోకీ  పొగరుబోత్తనంతో చొరబడిపోవడమే ‘ఆస్తా’ . ఇందులో హా ట్ సీన్లు వున్నాయి గనక, ఇదో సెక్స్‌ సినిమా అన్నారు చాలామంది.అది సరికాదు. ఇది  పూర్తిగా పొలిటికల్‌ ఫిల్మ్‌.1997లో ‘ఆస్తా’ రిలీజయింది.
***
కిటకిటలాడే బొంబాయి మహానగరంలో అదొక మధ్య తరగతి ఇల్లు. భర్త అమర్‌ (ఓంపురి) లెక్చరర్‌. చీరలో వొద్దికగా వినయంగా, భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు ప్రతిరూపం లాంటి భార్య మాన్సీ (రేఖ). వాళ్ళకో ఎనిమిదేళ్ళ కూతురు. స్కూలుకి వెళ్తూంటుంది. ముద్దుల కూతురు అడిగిందికదాని, బూట్లు కొనడానికి వెళ్తుంది రేఖ. నచ్చిన బూట్లు ఎక్కువ ఖరీదు వుంటాయి.

‘వద్దులే, నా బడ్జెట్‌ సరిపోదు’ అంటుంది. ఇదంతా గమనిస్తున్న ఒక అపరిచితురాలు, ఏంఫర్లేదు అవి తీసుకోండి, నేను పే చేస్తాను అంటుంది. కనీసం మీరెవరో కూడా తెలీదు కదా అంటుంది రేఖ. పేరడిగి, మీరు మాన్సీ, నేను రీనా అని చెప్పి ఇప్పుడు తెల్సుకున్నాంగా, ‘‘ఆ బూట్లు తీసుకోండి , పాపకోసం అంటుంది. అంత చనువు, ఆ చొరవ… కాదనలేకపోతుంది రేఖ. 

రండి, మిమ్మల్ని కార్లో దింపేస్తాను అంటుందామె. కార్లో తీసికెళ్తూ, హోటలోకెళ్ళి లంచ్‌ చేసి పోదాం అంటుంది. మళ్లీ కాదనలేకపోతుందీ మధ్య తరగతి మర్యాదస్తురాలు. హోటల్లో ఖరీదైన స్వీట్‌ అది. వాష్‌ రూమ్ కెళ్ళి , ఫ్రెష్‌ అవ్వమని రేఖకి చెప్పి,ఆమె ఒకతనికి ఫోన్‌ చేస్తుంది.‘‘కొత్త అమ్మాయని తెచ్చాను. అదిరిపోయేలా వుంది. నువ్వూ వెంటనే రా. Handle with care  జాగ్రత్త’’ అని చెబుతుంది. ఆ పెద్దమనిషి వస్తాడు. (పాతకాలం హీరో నవీన్‌ నిశ్చల్‌) రేఖకి మంచిమాటలు చెప్పి, చొరవగా చెయ్యిపట్టుకుని, చివరికి ఒప్పిస్తాడు.

అప్పుడొక సూపర్‌హాట్‌ సెక్స్‌ సన్నివేశం వుంటుంది. సినిమాకి అది చాలా కీలకమైంది. వాళ్ళిద్దరినీ నగ్నంగా చూపించే ప్రయత్నం అసలు చేయలేదు. అతను  ఆమె పాదాల్ని మృదువుగా కొరికి, కాలివేళ్ళని చీకడం, చెవి తమ్మెని మెత్తగా కొరికి, నాలికతో రెచ్చగొట్టడం… ఒక కొత్త రసానుభవంతో ఆమె కంపించిపోవడం… రేఖ టూమచ్‌ అసలు… ఆమెకి భావప్రాప్తి కలిగింది అనే ఫీల్‌ మనకి కలిగేలా, ఆమె మహోద్రేకాన్ని ` భారతీయ వెండితెర చిరకాలం గుర్తుపెట్టుకునేలా.. నరాలు తెగే ఆ తాదాత్మాన్నీ… పూలు రాలుతున్నట్టు, వీణ తీగల మీద రాగాలు పలుకుతున్నట్టు సహజత్వం సిగ్గుపడేలా పండించింది రేఖ!

నిజానికిది రాజకీయ సన్నివేశం. సరళీకృత ఆర్థిక విధానాలు తలుపులు బార్లా తెరిచినప్పుడు Capitalist Culture  కొత్తదారుల్ని  మనముందు పరిచింది. కొత్త రుచుల్నీ, కొత్త సుఖాన్నీ, ఈజిగా డబ్బు సంపాదించే కొత్త మార్గాన్ని మనకి పరిచయం చేసింది.పనిలో పనిగా సంసారిని వ్యభిచారిగా మార్చింది ఈ కల్చర్‌ అని చెప్పడం బాసూ భట్టాచార్య ఉద్దేశం!

అకస్మాత్తుగా జరిగిన ఈ అక్రమ అనుభవం పొరలు తొలిగిపోయాక, మాన్సీ మ్రాన్పడిపోతుంది. అపరాధభావంతో కుంగిపోతుంది. దీనంగా కన్నీళ్ళతో మిగిలిపోతుంది. తన పాచిక పారినందుకు సంతోషంగా వున్న రీనా, ఇంటి దగ్గర దించడానికి మాన్సీని కారుతో తీసుకు వెళ్తున్నప్పుడు, ఓదార్పుగా ఒక్కమాట అంటుంది. ‘‘ఎప్పుడూ ఇంట్లోనే భోజనం  చేస్తాంగా. ఒక్కసారి బైట హోటల్లో తిన్నంతమాత్రాన  ఏమౌతుంది? అందులో తప్పేముంది?’’

మాన్సీ బూట్లు కూడా తీసుకోకుండా, విసురుగా ఇంట్లోకి వెళుతూ మెట్లమీదే… ఏడుస్తూ కూలబడిపోతుంది. ఆమె వచ్చి కొత్త బూట్లు మాన్సీ దగ్గర పెట్టి వెళిపోతుంది. స్కూల్‌ నుంచి వచ్చిన పాప, బూట్లు చూసి ఎగిరి గంతేస్తుంది. మా మంచి అమ్మ అంటూ ఆనందంతో తల్లిని ముద్దుపెట్టుకుంటుంది. కూతురి ఆనందాన్ని కాదనలేకపోతుంది మాన్సీ.

ఆ మధ్య తరగతి కుటుంబానికి అసలు ఏ లోటూ లేదు. ఖరీదైన వస్తువులు మాత్రం కొనుక్కోలేరు. చదువుకున్న, సంస్కారవంతుడైన భర్త. ఈ చిన్న కుటుంబమే సరస్వం అనుకునే ఇల్లాలు. ఒకరంటే ఒకరికి గౌరవం, ప్రేమ. హఠాత్తుగా ఎవడితోనో హోటల్లో పడుకున్న బాధ మాన్సీని చిత్రవధ చేస్తుంది. భర్తకి అంతా చెప్పేయాలని అనుకుంటుంది. చెప్పలేకపోతుంది. హోటల్లో అతను యిచ్చిన డబ్బుని వంటింట్లో ఒక డబ్బాలో దాస్తుంది. డబ్బు కదా మరి!

మంచి లెక్చరర్‌ అయిన అమర్‌ విద్యార్థులకి రోమియో జూలియట్‌, వొథెల్లో డెస్డిమోనా, షీరీన్‌ ఫర్హాద్‌ల ప్రేమా, పర్వవసానాల గురించి పాఠాలు చెబుతుంటాడు. చర్చిస్తుంటాడు. అమర్‌ ఒకసారి మిత్రుడితో కలిసి దగ్గర్లోని ఒక పల్లెకి వెళ్తాడు. అక్కడో పంచాయితీ జరుగుతుంటుంది. ఆర్నెల్ల గర్భవతి అయిన ఒకామె భర్తతో  వుండాలా? మరొకతనితో కలిసి వుండాలా.. అనే సమస్యని గ్రామపెద్దలు డబ్బుతో పరిష్కరించడాన్ని చూస్తాడు. ఈ ఉపకథలకీ మెయిన్‌ స్టోరీకీ లింకు వుండే అల్లిక ఇంటరెస్టింగ్‌గా వుంటుంది.

విలాస పురుషులకు మాన్సీని ఎరగా వేసి డబ్బు సంపాదించే ‘మధ్యవర్తి’ మళ్ళీ ఆమె ఇంటికి వస్తుంది. ‘‘అతను కార్లో వస్తున్నాడు. నువ్వు రెడీ అవ్వు’’ అంటుంది. నా వల్ల కాదు అంటుంది మాన్సీ.ఇది మీ ఆయనకి తెలిస్తే ఏమౌతుందో తెలుసా? అనే అర్థం వచ్చేలా మాట్లాడి బ్లాక్‌మెయిల్‌ చేస్తుంది. మాన్సీకి ఇక తప్పదు. వెళుతుంది. అతను యిచ్చిన డబ్బు, వజ్రపుటుంగరాన్ని చూసి మాన్సీ మురిసిపోతుంది. ఖరీదైన చాక్లెట్లు కూతురికి యివ్వగలుగుతుంది. 

అమర్‌ స్టూడెంట్‌ ఒకామె ఓసారి రీనా, మాన్సీ మాట్లాడుకోవడం చూస్తుంది. ఆమె మీకెలా తెలుసు? అని మాన్సీని అడుగుతుంది. ఒక ఉద్వేగంతో, కన్నీళ్లతో  ‘‘నేను ఘోరమైన తప్పుచేశాను’’ అని అంటుంది మాన్సీ. ఆ స్టూడెంట్‌ కొంత నాటకీయంగా అమర్‌కి విషయం చెబుతుంది. అలా చేస్తున్నది అతని భార్యే అని మాత్రం చెప్పదు. ఒక రాత్రి మాన్సీ, వేదనతో భర్తకి అసలు విషయం చెబుతుంది. భార్యమీదున్న అపారమైన ప్రేమతో, పెద్ద మనసుతో ఆమెని మన్నిస్తాడు. కథ సుఖాంతం అవుతుంది.

అంతకుముందు, అమర్‌, మాన్సీల రొమాంటిక్‌ సన్నివేశం ఒకటి వుంటుంది. నవీన్‌ నిశ్చల్‌ తనకిచ్చిన అనుభవాన్ని భర్తమీద ప్రయోగిస్తుంది. పాదాలు కొరికీ  కాలివేళ్ళు చీకీ, చెవితమ్మెని పంటితో లాగీ… తన్మయంతో పులకించిపోయిన భర్త, యిదెక్కడ నేర్చుకున్నావో  అంటాడు. నేనొక బ్లూఫిల్మ్‌ చూశాను అంటుంది. చాల్లే, యిక అవి చూడకు అని నవ్వుతూ  అంటాడు.

Intense గా వుండే ఆ intimate  సీన్‌ని Ultimate గా పిక్చరైజ్‌ చేశాడు దర్శకుడు. ఆ శృంగార సన్నివేశంలో రేఖ, ఓంపురి ఒకరిమీద ఒకరు గెలిచి …ప్రేక్షకుల్ని చిత్తుచేస్తారు.***ఒక రాత్రి కూతురి గదిలోకి తండ్రి వెళ్తాడు. కొత్త బూట్లని చేత్తో పట్టుకుని నిద్రపోతూ వుంటుంది. భార్యని పిలిచి ‘చూడు’ అంటాడు. పాప చేతుల్లొంచి నెమ్మదిగా బూట్లు తీసి, పక్కన పెడతాడు. వస్తు వ్యామోహం పసి బిడ్డలకూ పాకిన విషాదాన్ని ఈ చిన్న సీన్‌లో చాలా ఎఫెక్టివ్‌గా చెప్పాడు  బాసు భట్టాచార్య .

ఉన్న కంఫర్ట్‌ చాలదు. ఇంకా ఎక్కువ సౌకర్యం కావాలి. కారు కావాలి అంటే… పెద్ద కారే కొనాలి. ఇల్లు ఓల్డ్‌ ఫేషన్‌… విల్లా కావాలి. లేదా… 27వ అంతస్తులో స్విమ్మింగ్‌ పూల్‌ వుండే  ఫైవ్‌ బెడ్‌రూం ఫ్లాట్‌ కావాలి! అందరూ బ్లూజీన్సే వేసుకోవాలి. పబ్బుకో, నైట్‌ క్లబ్బుకో వెళ్ళాలి. ఎవరి సుఖం వాళ్లు వెతుక్కోవాలి! సంప్రదాయ భారతీయ సమాజాన్ని ఈ కొత్త కల్చర్‌ ఆక్రమించడాన్ని ప్రొటెస్ట్‌ చేస్తూ తీసిన సెన్సిబుల్‌ సినిమా యిది.

అక్రమమో, నేరమో చేసింది మాన్సీ కాదు. డబ్బు, ఇతర భౌతిక అవసరాలకు మనుషుల్ని బానిసలు చేస్తున్న ఒక అమానవీయ ఆధునిక సమాజమే దోషి అని క్రిస్టల్‌ క్లియర్‌గా చెబుతుంది ఆస్తా. ఇది తెలిసిన వాడు గనకే అమర్‌, మాన్సీని మన్నిస్తాడు. ఆస్థా అంటే నమ్మకం, విశ్వాసం . 

రేఖ చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా. అసలే చూపు తిప్పుకోలేని అందం ఆమెది. ఆ ఎర్రని చుట్టు చెంగావి చీర, ఎర్రని జాకెట్టు, నుదుటిన పెద్ద ఎర్రని బొట్టుతో ఎంత రావిషింగా వుందో, అంతే పవిత్రంగా వుంది. అంతేనా? తీరని కోరికలా వుంటుంది రేఖ. నిన్ను కావలించుకుని, ఆక్రమించుకుని ఊపిరాడ నివ్వని తెల్లవారుజాము కలలా వుంటుంది రేఖ. చలం రాసిన ప్రేమలేఖలా వుంటుంది. 

సిల్‌సిలాలో కవిత్వం లాంటి ప్రియురాలు…ఖూబ్ సూరత్‌లో అల్లరి కన్నెపిల్ల… ఉత్సవ్‌లో శృంగార దేవత… ఉమ్రాన్‌జాన్‌లో కళ్ళతో పిలిచే ప్రణయ గీతిక… ఎంత సహజ సౌందర్యమో, అంతే అద్భుతమైన ఆర్టిస్టు. పూర్తిస్థాయి ప్రొఫెషనల్‌. ‘ఆస్తా’లో ఆ శృంగార సన్నివేశాలకు ఒప్పుకోవడం అంటే కేవలం కళ పట్ల తనకున్న చెక్కు చెదరని కమిట్మెంట్‌! ఆమె నుంచి అంత Bold and Breath taking  పెర్‌ఫార్మెన్స్‌ని రాబట్టిన క్రెడిట్‌ మాత్రం బాసు భట్టాచార్యదే!

సమాంతర సినిమా జీనియస్‌
బాసు భట్టాచార్య 1934లో కలత్తాలో పుట్టారు. రాజ్‌కపూర్‌, వహీదా రెహ్మాన్‌లతో 1966లో ఆయన తీసిన ‘తీస్రీకసమ్‌’ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. దిలీప్‌కుమార్‌, వైజయంతి మాలతో ‘మధుమతి’ తీసిన లెజెండరీ డైరెక్టర్‌ బిమల్‌రాయ్‌ కూతురు రింకీ , బాసు భట్టాచార్య భార్య. వాళ్ళ పెద్ద కొడుకు ఆదిత్య భట్టాచార్య కూడా సినీదర్శకుడు.

షర్మిలా టాగూర్‌, రాజేష్‌ఖన్నాలతో బాసు భట్టాచార్య తీసిన ‘ఆవిష్కార్‌’ సూపర్‌హిట్‌ సినిమా. పెళ్ళి, భార్యాభర్తల సంబంధాలపై బాసు భట్టాచార్య తీసిన అనుభవ్‌ (1971), ఆవిష్కార్‌ (1973), గృహప్రవేశ్‌ (1979) తప్పక చూడాల్సిన గొప్ప సినిమాలు. భారతీయ చలన చిత్ర రంగంపై చెరగని ముద్ర వేసిన బాసు భట్టాచార్య 1997 జూన్‌ 19న బొంబాయిలో కన్నుమూశారు. ఆ సంవత్సరమే ఆస్తా రిలీజయింది. 

writer phone no..  9704541559

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!