Beautiful Waterfalls …………..
ఆ జలపాతం అందాలు పర్యాటకుల మనసును పరవశింపజేస్తాయి.నింగి నుంచి జాలువారుతున్నాయా అన్నట్లు కనిపించే జల తరంగాలు అబ్బురపరుస్తాయి. నీటి ధారల తుంపరలు ఇరవై అడుగుల పైకి లేస్తుంటాయి.. దూరం నుంచి చూస్తుంటే అక్కడ పొగమంచు ఆవరించినట్లు ఉంటుంది.
ఉరకలు వేసే ఆ జలపాతపు ధారలను చూస్తే …ప్రయాణపు అలసట దూరమై మనసు తేలికగా మారుతుంది. ప్రకృతి అందాలకు పులకరిస్తుంది.ఇంతకీ ఆ జలపాతం ఎక్కడుంది? అంటే… తమిళనాడులోని ధర్మపురి సమీపంలో ఉంది. ఇది కావేరీ నది ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది.
వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడి చుట్టుపక్కల ప్రదేశాలు కొత్త అందాలను సంతరించుకుంటాయి.దీనినే కావేరీ జలపాతం అని కూడా అంటారు.జలపాతం ఉన్నది హోగెనక్కల్ అనే గ్రామంలో… అందుకే హోగెనక్కల్ జలపాతం అని పిలుస్తారు.
కావేరీ జలపాతం పాయలు మలిగెరె కొండల మధ్య, కొండలను ఒరుసుకుంటూ ప్రవహిస్తుంటాయి. ఆ ప్రవాహంలో పడవ ప్రయాణం అద్భుతం. అదొక సాహసం.చాలామంది దూరం నుండి చూసి ఆనందిస్తారు.
నీటి అలల మీద తేలుతూ తెప్పలో వెళ్లి కొండను తాకటం ఓ మధురానుభూతి..మాటలకందని ఆనందం. ఈ తెప్పలు వెదురుతో చేసిన వలయాకారపు పెద్ద సైజు బుట్టలు. లోపలకు నీరు రాకుండా తెప్ప అడుగున తారు పూస్తారు. స్థానికులు ఈ తెప్పలను నడుపుతారు. ఇందులో ప్రయాణించడానికి సుమారు 1000 పైనే ఛార్జ్ చేస్తారు.
ఈ నీటిలో ప్రయాణించి ముందుకు పోతే ఇసుకతిన్నెలాంటి చిన్నద్వీపాలకు వెళ్లవచ్చు. జలపాతం హోరు చూసి పర్యాటకులు కొండ దగ్గరకు వెళ్లడానికే భయపడతారు. పర్యాటకులు ఒక తెప్పలో వెళ్తుంటే చిరుతిళ్లు అమ్ముకునే వాళ్లు మరో తెప్పలో వచ్చి అందిస్తారు.అవి తింటూ విహారం చేయడం కొత్త అనుభూతినిస్తుంది.
చిన్నపెద్ద జలపాతాలన్నింటినీ చూడాలంటే ఇక్కడ ఉన్న హ్యాంగింగ్ బ్రిడ్జి మీదకు ఎక్కాలి. తెప్ప షికారు ముగించి ఒడ్డుకు రాగానే చేపలను కాల్చి ఇచ్చేవాళ్లు అక్కడ సిద్ధంగా ఉంటారు. అక్కడి నీటిలో పట్టిన తాజా చేపలను కాల్చి పర్యాటకులకు అమ్ముతుంటారు.
హోగెనక్కల్ తమిళనాడు- కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో ఉంది. తమిళనాడు, సేలమ్ పట్టణానికి 114 కి. మీ దూరాన ఉంది. ఇక్కడ ఎక్కువగా కన్నడమే మాట్లాడతారు. బెంగళూరు నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు . బెంగళూరు నుండి హోగేనక్కల్ చేరుకోవడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి.
చిన్నమార్గం ఎలక్ట్రానిక్ సిటీ, అట్టిబెలె, డెంకనికొట్టై ద్వారా – బెంగళూరు నుండి దాదాపు 130 కి.మీ. దూరంలో ఉంది. ఈ మార్గం ఇరుకైనది కానీ తక్కువ టోల్ రుసుము ఉంటుంది.మరొక మార్గం హోసూర్, కృష్ణగిరి, ధర్మపురి ద్వారా చేరుకోవచ్చు.
హోగెనక్కల్ జలపాతాలను సందర్శించడానికి అక్టోబర్– ఫిబ్రవరి మధ్య లేదా మే నుండి ఆగస్టు వరకు అనువైన సమయం. రుతుపవనాల కాలంలో బోటింగ్ అనుమతి ఉండదు.హోగేనక్కల్‌లో వసతి సదుపాయాలున్నాయి.హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.