A sensational movie……………………
‘అంతిమ తీర్పు’ 1988 నాటి సినిమా ఇది. అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఈ మూవీ తొలుత ‘న్యూఢిల్లీ’ పేరుతో మలయాళం లో రూపొందింది. మమ్ముట్టి హీరో .. హిందీ,కన్నడ భాషల్లో కూడా ‘న్యూ ఢిల్లీ’ టైటిల్ తోనే రిలీజ్ అయింది. తెలుగులో కృష్ణంరాజు,హిందీలో జితేంద్ర ,కన్నడ లో అంబరీష్ హీరో పాత్ర పోషించారు.
‘న్యూఢిల్లీ’ సినిమాతో మమ్ముట్టి స్టార్ హీరో అయ్యారు.సురేష్ గోపి,త్యాగరాజన్, సుమలత,ఊర్వశి నాలుగు భాషల్లో నటించారు.ఈ సినిమాలో విష్ణుగా నటించిన త్యాగరాజన్ (జీన్స్ హీరో ప్రశాంత్ తండ్రి) కి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో తను చేసిన విష్ణు పాత్రనే డెవలప్ చేసి తమిళం లో త్యాగరాజన్ సొంతంగా ఒక సినిమా కూడా తీశారు.
పాపులర్ ఆంగ్ల రచయిత ఇర్వింగ్ వాలెస్ (Irving Wallace) నవల ‘The Almighty’ స్పూర్తితో మలయాళ రచయిత డెన్నిస్ జోసెఫ్ ఈ కథను తయారు చేశారు. జర్నలిజం నేపథ్యంలో సాగే కథ ఇది. నాలుగు భాషా చిత్రాలకు జోషీనే దర్శకత్వం వహించారు. డెన్నిస్ జోసెఫ్ మమ్ముట్టి,మోహన్ లాల్ సినిమాలకు ఎక్కువగా కథలు అందించారు.
ఇక ‘అంతిమ తీర్పు’ విషయానికొస్తే … కృష్ణంరాజు కి ఇష్టమైన చిత్రాల్లో ఇదొకటి. The Almighty నవలను కృష్ణంరాజు అంతకు ముందే చదివి ఉన్నారు. నిర్మాత కథ చెప్పగానే వెంటనే ఒకే అన్నారు. ఆ పాత్రకు ఆయన కరెక్టుగా సూట్ అయ్యారు. దర్శకుడు జోషి సూచనలమేరకు కృష్ణంరాజు కూడా అసమానమైన నటన ను ప్రదర్శించారు.
‘కథలో కృష్ణంరాజు పాత్ర పేరు జీకే.. ఆ జీకే జైలులో ఉన్నప్పటి నుంచి కథ మొదలవుతుంది. జీకే జైలు నుంచి విడుదల అయ్యాక న్యూ ఢిల్లీ డైరీ పేరు మీద న్యూస్ పేపర్ పెట్టి ఏ పత్రికలో రాని ప్రముఖుల కిడ్నాప్, హత్యల వార్తలు తన పేపర్ లో ప్రచురించి సంచలనం సృష్టిస్తుంటాడు. సినిమా చూస్తే అవన్నీ ఎవరు చేయించారో తెలుస్తుంది.
ఇందులో ఆయన ఆర్టిస్ట్ ..రిపోర్టర్,ఎడిటర్ పాత్రలో నటించారు.ఈ సినిమాకు క్లైమాక్స్ హైలెట్. ప్రారంభంలో కొంచెం స్లో అనిపిస్తుంది..కానీ అరగంట తర్వాత కథ చాలా స్పీడ్ గా నడుస్తుంది. తన కెమెరాతో జయనన్ విన్సెంట్ కథను అద్భుతంగా తెరకెక్కించారు. సురేష్ గోపి ని త్యాగరాజన్ టీమ్ వెంటాడే సన్నివేశాలు బాగా వచ్చాయి. శ్యామ్ నేపధ్య సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం ఢిల్లీ లోనే చిత్రీకరించారు.
సుమలత కు ఇదొక మంచి పాత్ర .. ఆమె తన పాత్రలో జీవించారు. అందుకే కాబోలు నాలుగు భాషల్లో ఆమె ఈ కీలక పాత్రను పోషించారు. అలాగే సురేష్ గోపి ది మంచి పాత్ర. తన పాత్రకు న్యాయం చేశారు. ఇందులో రంగనాథ్ ది సాఫ్ట్ విలన్ రోల్. చక్కగా చేశారు. మరో సాఫ్ట్ విలన్ పాత్రలో ప్రభాకర రెడ్డి నటించారు. హీరో చెల్లెలి పాత్రలో ఊర్వశి నటించారు. జైలర్ పాత్రలో గుమ్మడి నటించారు. ఖైదీల పాత్రల్లో త్యాగరాజన్ తదితరులు చక్కగా చేశారు.
‘పేపర్ పెట్టడం భామాకలాపం డాన్స్ చేసినంత సులభం కాదు’… ‘మీలో ఆడలక్షణాల కంటే మగలక్షణాలే ఎక్కువ’ .. ‘వాళ్ళ జర్నలిజమంతా తలుపు కన్నాల్లోనుంచి చూడటమే’ రచయిత జంధ్యాల సన్నివేశానికి అనుగుణంగా డైలాగులు రాశారు.
ఎక్కడా బోర్ కొట్టకుండా కథనం వేగంగా సాగుతుంది. జైలులో ఖైదీలకు స్వీట్లు పంచే సన్నివేశం,… కృష్ణంరాజు పై పిచ్చివాడనే ముద్రవేసి ఆసుపత్రిలో కరెంట్ పెట్టి, ఒక కాలు ,చేయి విరిచివేసే సన్నివేశాలు,జీకే ప్లాన్ ప్రకారం ఖైదీలు జైలునుంచి తప్పించుకునే సీన్లు బాగా తీశారు. ఖైదీ విష్ణు ను కాల్చిచంపే సన్నివేశం, క్లైమాక్స్ ను జోషీ బాగా చిత్రీకరించారు. ఎండింగ్ ట్విస్ట్ ప్రేక్షకులు ఊహించరు. యూట్యూబ్ లో సినిమా ఉంది .. చూసిన వారు .. చూడని వారు చూడవచ్చు.
——KNM