మీడియా మాయాజాలం పై సెటైర్ !

Sharing is Caring...

Ramana Kontikarla………………………………..

Special Correspondents… ఉన్నది లేనట్టు… లేనిది ఉన్నట్టు… అసలు జరుగుతుందో, లేదో తెలియని దాన్ని ఊహించేసి రిపోర్ట్ చేయడం .. అదే ఫేక్ రిపోర్టింగ్. ఇలాంటి వార్తా కథనాలు ఎన్నో చదివి ఉంటాం .. విని ఉంటాం.  ఇదేదో ఒక్క తెలుగు మీడియాకే పరిమితమైంది కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ జరుగుతున్నదే.

ఏ ప్రాంతంవారు చూసినా…ఇది మన మీడియాను పోలినట్టు ఉందే అనుకునే కథాంశం తో నిర్మించిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఒక సెటైరికల్ సినిమా. ఎప్పుడో 2016లోనే విడుదలైనా.. ఏదో యాదృచ్ఛికమన్నట్టు ఒకటో, అరో కాకుండా… ఇప్పటికీ ఆ సినిమా తరహా ఫేక్ రిపోర్టింగ్ కంటెంట్ తోనే బులెటిన్లు, ఎడిషన్లు నడిపే కొన్ని మీడియా సంస్థల స్వరూపానికి.. అగ్గికి ఆజ్యం పొసే సోషల్ మీడియా పనితీరుపై ఓ నిలువెత్తు వ్యంగ్యరూపమే Special Correspondents!

ఈక్వెడార్ లో జరిగే తిరుగుబాట్లు… అక్కడి నోటిరియస్ గ్యాంగులకు సంబంధించి అంతర్జాతీయ సమాజం చర్చించుకుంటున్న నేపథ్యంలో న్యూయార్క్ రేడియోలో పనిచేసే జర్నలిస్ట్ ఫ్రాంక్ బోర్నేవిల్లేను ఆయన బాస్ అక్కడికి వెళ్లి రిపోర్టింగ్ చేయమని ఆదేశిస్తాడు. అంతకుముందే ఫ్రాంక్ బొన్నెవిల్లే  పోలీసునని చెప్పుకుని.. ఒక హత్య కేసు ఇన్వెస్టిగేషన్ వివరాల సేకరణకు వెళతాడు.

ఫ్రాంక్ ఎవరో తెలుసుకున్న సిబ్బంది అతగాడిని తిరిగి పంపించేస్తారు. ఇదంతా బాస్ జేఫ్రీ మల్లార్డ్ కి తెలిసి ఫ్రాంక్ ను గట్టిగా హెచ్చరిస్తాడు. వెళ్లనంటే బాస్ కోప్పడతాడని ఫ్రాంక్ ఈక్వెడార్ ప్రయాణానికి సిద్ధం అవుతాడు. అయితే.. ఫ్రాంక్ వెంట వెళ్లాల్సిన టెక్నీషియన్ ఫించ్ మాత్రం ముందు తాను రానంటాడు. అప్పటికే అతగాడికి భార్యకు పడటం లేదు. గొడవలు జరుగు తుంటాయి. ఈ క్రమంలో డిస్టర్బ్డ్ గా ఉన్న ఫించ్ రానంటాడు. కానీ బాస్ ఆదేశాలను కాదనలేడు. 

ఫ్రాంక్, ఫించ్ కలిసి న్యూయార్క్ లో పాస్ పోర్ట్స్, వీసా అన్ని సమకూర్చుకుని ఎయిర్ పోర్ట్ కు బయల్దేరుతారు. ఎయిర్ పోర్ట్ కు వెళ్లేకంటే ముందే..మూడీ గా ఉన్న ఫించ్ ఏదో చెత్తను పడేస్తున్నానుకుని తన పాస్ పోర్ట్, ఫ్లైట్ టికెట్స్ చెత్తను తీసుకెళ్లే  ఓ ట్రంక్ లో పడేయడంతో… సినిమాలో ఆసక్తికరమైన సన్నివేశాలు మొదలవుతాయి.

పింఛ్ పై ఫ్రాంక్ అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు. ఇక చేసేదేమి లేక.. రేడియో స్టేషన్ కు ఎదురుగా బ్రిగిడా, డొమింగ్ అనే ఓ స్పానిష్ జంట నడుపుతున్న కేఫ్ లో కెళ్ళి దాక్కుంటారు. ఆ జంట తో పరిచయం ఉండటంతో తమ పరిస్థితి వివరించి కాస్త రూమ్ ఇవ్వమని అడుగుతారు.  ఆ కేఫ్ లో రూమే ఫ్రాంక్ .. ఫించ్ కు ఈక్వెడార్ దేశమైపోతుంది.

అలా మొదలు పెడతారు ఈక్వెడార్ పేరిట ఫేక్ రిపోర్టింగ్. ఇతర న్యూస్ ఛానల్స్, సైట్స్ లో వచ్చే సమాచారం సేకరిస్తూ అప్డేట్స్ ఇస్తుంటారు. ఇదీ న్యూయార్క్ లో రేడియో స్టేషన్ కు ఆపోజిట్ బిల్డింగ్ నుంచే వారు చేసే ఈక్వెడార్ లైవ్ రిపోర్టింగ్. అయితే రేడియా యాంకర్స్ పదే పదే అడిగే ప్రశ్నలతో.. జవాబు ఏం చెప్పాలో తోచక అప్పటికప్పుడు కల్పితాలతో రిపోర్టింగ్ చేస్తారు …దీంతో  ఈక్వెడార్ ఇష్యూ అంతర్జాతీయ సమస్యలా మారుతుంది.

ప్రభుత్వాలు సీరియస్ గా దృష్టి పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఫ్రాంక్, ఫించ్ కలిసి… ఎమిలియో శాంటియాగో అల్వారెజ్ అనే డమ్మీ పేరును కొత్త బందిపోటు రూపంలో తెరపైకి తెస్తారు. అతనికి పెద్ద నేర చరిత్ర ఉంది అన్నవిధంగా రేడియోలో జర్నలిస్ట్ ఫ్రాంక్ రిపోర్టింగ్ సాగుతుంటుంది. అంతర్జాతీయ ఛానల్స్, ఇతర మీడియా కూడా ఫ్రాంక్, ఫించ్ లకు సదరు బందిపోటు గ్యాంగ్స్ నుంచి ప్రమాదమున్నట్టు తెలిసీ, తెలియని రిపోర్టింగ్ చేస్తాయి.

అప్పటికే ఫ్రాంక్, ఫించ్ ఇద్దరూ మీడియాలోనే కాకుండా..సొసైటీ లో హీరోలైపోతారు. ఈ క్రమంలో ఫ్రాంక్, ఫించ్ బాస్ జేఫ్రీ మల్లార్డ్..వారిని  యూఎస్ ఎంబసీకి వెళ్లి రక్షణ తీసుకోమని సూచిస్తాడు. కానీ ఫ్రాంక్, ఫించ్ ఉన్నది రేడియో స్టేషన్ కు ఆపోజిట్ బిల్డింగ్ ..దొరికిపోరూ..? అందుకే అప్పటివరకూ ఫోన్ ద్వారా బాస్ తో.. రేడియో స్టేషన్ సిబ్బందితో సంభాషించిన ఫ్రాంక్, ఫించ్ తమ సిమ్ కార్డులను తీసేస్తారు.

పైగా తమను ఈక్వెడార్ బందిపోట్లు కిడ్నాప్ చేసినట్టుగా.. కేఫ్ నిర్వాహకులకే కిడ్నాపర్ల వేషం వేసి… ఓ వీడియో షూట్ చేసి దాన్ని ఓ పెన్ డ్రైవ్ లో పెట్టి  రేడియో స్టేషన్ వద్ద నున్న పోస్ట్ బాక్స్ లో వేస్తారు. ఆ వీడియోలో ఫ్రాంక్, ఫించ్ ను కిడ్నాపర్స్ కట్టేసి బెదిరిస్తున్న దృశ్యాలు ఉండటంతో అది కాస్తా వైరల్ అవుతుంది. అప్పటికే వివాహబంధం బలహీనంగా మారి.. ఫించ్ తన భార్య ఎలియనోర్ సానుభూతి పొందేందుకు యత్నిస్తుంటాడు.

ఆమె కూడా డాలర్ ఫర్ ఏ హీరో పేరిట ఓ పాట పాడి స్వచ్ఛంద సంస్థ పేరిట డబ్బు సంపాదించడం.. అంతకుముందే ఫించ్ భార్య అని తెల్వని ఫ్రాంక్ ఆమెతో నెరిపిన సంబంధం.. ఒక్కసారిగా ఆమెను టీవీలో చూశాక పక్కనున్న ఫించ్ చెబితేనే గానీ ఫ్రాంక్ కు ఆవిషయం తెలియకపోవడం.. మొత్తంగా ఇలా సాగుతుంది డ్రామా. ఆ డ్రామాలో భాగంగానే తమ పేరుతో డబ్బు సంపాదించిన ఎలియనోర్ ఇంటికెళ్లి ఆమెను బెదిరించి… ముగ్గురికి మూడు వాటాలుగా డబ్బు పంచుకుంటారు.

ఆ పంచుకున్న డబ్బుతో  ఈక్వెడార్ లో లేమనే విషయం బయటకు రాకుండా ఫ్రాంక్, ఫించ్  సౌత్ అమెరికా బయలు దేరుతారు. నాన్నాపులి కథ తరహాలో అలా వెళ్లి అదే కిడ్నాపర్ల చేతికి దొరుకుతారు. ఆ తర్వాతేం  జరుగుతుంది… వారిద్దరూ యూఎస్ కు హీరోలుగా ఎలా తిరిగివస్తారన్నదే మిగతా కథ.

హైదరాబాద్ స్టూడియోలోనే ఉండి ఢిల్లీ రిపోర్టింగ్ చేయడం… ఎక్కడో గోదావరి నది పొంగి .. వ్యక్తులు కొట్టుకుపోతుంటే లైవ్ గా చూస్తున్నట్టే ఫోన్ ఇన్ ఇవ్వడం.. స్పష్టమైన సమాచారం లేకుండా ఊహాజనిత సమాచారం ఇవ్వడం వంటి సమకాలీన మీడియా ధోరణులకు అద్దం పడుతూ తీసిన సినిమా ఇది. NETFLIX లో ఉంది చూడవచ్చు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!