ఖాద్రీశుని సన్నిధిలో సంస్కృత శాసనాలు !!   

Sharing is Caring...

Rare Sanskrit Inscriptions………………………………

విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర -బుక్కరాయల కాలంనాటి సంస్కృత శాసనాలను చరిత్రకారుడు మైనాస్వామి గుర్తించారు. శాసనాల సంరక్షణలో భాగంగా కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో అవగాహన కార్యక్రమాన్ని చరిత్రకారుడు ఆ మధ్య నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ ప్రముఖులు, న్యాయవాది సుబ్బరాజు గుప్త తదితరులతో కలిసి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని పలు శాసనాలను మైనాస్వామి పరిశీలించారు. 

శాసనాలను చదవడం, శాలివాహన శకం నుంచి సామాన్య శకంలోకి తేదీలను మార్చుకోవడం వంటి అంశాలను ఆయన వివరించారు. తూర్పు-పడమర రాజగోపురం ద్వారాల్లో, గుడి దక్షిణ గోడ, తూర్పు  ప్రాకారంపై పూర్తిగా చెరిగిపోయిన శాసనాల ఆనవాళ్లను గుర్తించడం జరిగింది. ఆలయాల వెలుపల-లోపలి గోడలను శుభ్రం చేసేటప్పుడు శాసనాలను చెరిపి వేస్తున్నారని చరిత్రకారుడు ఆవేదన చెందుతూ.. తన వెంట వున్నవారికి  చెరిగిన శాసనాలను చూపించారు.

ఇలా వుoడగా తూర్పు రాజగోపుర అధిష్టానం పై ఇరువైపులా సంస్కృత శాసనాలు వుoడడాన్ని మైనాస్వామి గుర్తించారు. సంస్కృత శాసనాలను శ్లోకాల రూపంలో తెలుగులో రాయడం గమనించదగ్గ అంశమని ఆయన అన్నారు. తూర్పు రాజగోపుర నిర్మాణానికి సంబంధించిన  సంగమ వంశ వివరాలు సంస్కృత శాసనంలో ఉంటాయన్నారు. హరిహర-బుక్కరాయల పేర్లు, గోపురం నిర్మాణ తేదీ వంటి వివరాలు శాసనాల్లో లేనప్పటికీ ‘విఠలామాత్య’ అనే పేరు మాత్రం కనిపిస్తున్నది.

 బహుశ నాటి ప్రభువుల ఆదేశంతో విఠలామాత్య అనే మంత్రి తూర్పు గోపురాన్ని కట్టించి ఉండవచ్చు. గోపురంపై శాసనాలున్నట్టు బ్రిటిష్ పురాతత్వ అధికారులు 1906 లో అనంతపురంజిల్లా గెజిటీర్ లో పేర్కొన్నప్పటికీ తరువాత వెలువరించిన శాసనసంపుటాల్లో సంస్కృత శాసనాల పూర్తి వివరాలను పొందుపరచలేదు. వాటిని నేటికీ పరిష్కరించలేదు.

కాగా  శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ నిర్మాణాన్ని తెలిపే సామాన్య శకం 1352 నాటి మొదటి బుక్కరాయల శాసనాన్ని మైనాస్వామి చూపించారు. ఆ శాసనాన్ని బట్టి ఆలయ నిర్మాణం-ప్రధాన గోపురం అప్పటికే పూర్తి అయి వుoడవచ్చు. రెండో హరిహర రాయలు- ఆయన కుమారుడు ఒకటో దేవరాయలు, విరూపాక్ష రాయలు, శ్రీక్రిష్ణదేవరాయలు తదితరుల శాసనాలను సంరక్షించుకోవాలని చరిత్రకారుడు విజ్ఞప్తి చేశారు. ఆలయ సిబ్బంది,పలువురు పుర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు . 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!