New Rules for Vaccine Implementation………………………………..వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు జేసేందుకు ఉత్తరప్రదేశ్ లో కొత్త రూల్స్ ప్రవేశ పెట్టారు. అయితే వ్యాక్సిన్ పై అపోహలతో చాలామంది టీకా వేయించుకోవడానికి వెనుకడువేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే వికటించి మరణిస్తారని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది అలా చనిపోయిన వారు కూడా ఉన్నారు. చనిపోవడానికి కారణాలు టీకా యే నని ఎవరూ నిర్ధారించలేదు. ఈ క్రమంలో సామాన్యులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా టీకా తీసుకోవడానికి వెనుకడుగు వేస్తుండటంతో ఫిరోజాబాద్ కలెక్టర్ చంద్ర విజయ సింగ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. టీకాలు వేయించుకున్నవారికే జీతాలు చెల్లిస్తామని ఆదేశాలు జారీ చేశారు. దీంతో టీకాలు వేయించుకుని సర్టిఫికెట్ సమర్పించిన వారికే జీతాలు ఇస్తున్నారు.
అదలావుంటే … యూపీ లోనే మద్యం కొనుగోలుకు కూడా కొత్త నిబంధన పెట్టారు. ఎటావా జిల్లా లోని సైఫాయి లో మద్యం కొనాలంటే తప్పనిసరిగా టీకా వేయించుకున్నట్టు సర్టిఫికెట్ చూపాలి. అలా చూపిన వారికే మద్యం విక్రయిస్తున్నారు. టీకా తీసుకున్న సర్టిఫికెట్ చూపిస్తేనే మందు అంటూ నోటీసులు అంటించారు. దీంతో మందుబాబులు తలపట్టుకుంటున్నారు. అలాగే మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా టీకా తీసుకోవాలని జిల్లా అదనపు మేజిస్ట్రేట్ హేమకుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే మద్యం కొనుగోలుదారులు ఇచ్చే సర్టిఫికెట్ ను పరిశీలించిన పిదపనే మద్యం విక్రయించాలని ఆదేశాలు వచ్చాయి. ఆదేశాలు జారీ చేసి ఆగకుండా పోలీసులతో కలిసి మద్యం దుకాణాలను ఆయన తనిఖీ చేస్తున్నారు.
మొత్తం మీద ఎలాగైనా వ్యాక్సిన్ అమలును వేగవంతం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పలు నిబంధనలు విధిస్తున్నది. ఈ విధానంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మద్యం సంగతి పక్కన బెడితే జీతాలు ఆపడం సమంజసం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజల్లో టీకా గురించి అవగాహన కల్పించి .. సందేహాలు తీర్చి .. ధైర్యం చెప్పి టీకాలు వేయించాలి. అంతే కానీ .. జీతాలు ఆపడం తప్పని అంటున్నారు. ఈ రెండు జిల్లాల అధికారులను చూసి మిగతా వారు ఈ కొత్త నిబంధనలు ప్రవేశ పెట్టె అవకాశాలు ఉన్నాయి.