కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు … ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తనకు రాజకీయాల్లోకి ప్రవేశించి, ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందనే కోరికను బయటపెట్టారు. మీడియా ముందు ఆయన తన మనసులో మాట వెల్లడించారు. ఈ దేశ ప్రజలకు సేవ చేసి, దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన కుటుంబానికి చెందినవాడిని అని వాద్రా గర్వంగా చెప్పుకున్నారు.
ఇవాళ మీడియాతో వాద్రా మాట్లాడుతూ “పార్టీకి సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో… ముఖ్యంగా యూపీలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ప్రజలు చూపిన ఆదరాభిమానాలు నన్నుబాగా ఆకట్టుకున్నాయి. అందుకే ప్రజలకు మరింత చేరువగా వెళ్లి సేవ చేయాలనుకుంటున్నా. సాధ్యమైనంత వరకు వ్యవస్థలో మార్పు తేవాలనుకుంటున్నా. నాపై ఆరోపణలు అబద్ధమే ” అని రాబర్ట్ వివరించారు.
రాజకీయాల పై తనకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నందున దూరంగా ఉన్నాను. కానీ తగిన సందర్భం లో నా నిర్ణయం ప్రకటిస్తాను అని వాద్రా స్పష్టం చేశారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలనన్న నమ్మకం నాకుంది. నా నిర్ణయాలకు ప్రియాంక మద్దతు ఇస్తుందని వాద్రా ఆశాభావం వ్యక్తం చేశారు. నా కుటుంబం అనుమతించినప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెడతామన్నారు.
కాగా గత ఏడాది ఫిబ్రవరిలో కూడా రాబర్ట్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. ఇక భార్య ప్రియాంక పొలిటికల్ ఎంట్రీపై అయన గతంలోనే సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమెకు పూర్తి మద్దతును ప్రకటిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఆమెకు ప్రజాసేవలో అన్నివేళలా సహకరిస్తానని అప్పట్లో ప్రకటించారు.
తాజాగా వాద్రా మనసులో మాట ను బట్టి చూస్తే … ఆయన పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారైనందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాబర్ట్ వాద్రా మనీ లాండరింగ్, అక్రమాస్తులు తదితర ఆరోపణలతో ఈడీ విచారణ ను ఎదుర్కొంటున్నారు. మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై కేసుల బనాయించిందని ఆయన ఆరోపిస్తున్నారు.