Hell to bear …………………………………………….
చెవిలో శబ్దాలు వినిపిస్తున్నాయా ? పేపర్ నలుపుతున్నట్టు, గంట మోగిస్తున్నట్టు, టిక్కు టిక్కు అంటూ .. లేదా సముద్రపు హోరు లాగా .. గుయ్ మని…. ఇలా చెవిలో రకరకాల శబ్దాలు రొద చేస్తుంటే అది కచ్చితంగా చెవి సమస్యే. దీన్నే వైద్య పరిభాషలో ‘టిన్నిటస్’ అంటారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు.. ఎవరికైనా, ఏ వయసులోనైనా ఈ సమస్య వస్తుంది.
వినికిడిలోపం, చెవిలో శబ్దాలు రెండూ దోస్తులు. ఆ శబ్దాల్ని నిర్లక్ష్యం చేయకూడదు. వినికిడి శక్తిని దెబ్బతీసే ఈ శబ్దాల గురించి వెంటనే డాక్టర్ కు చెప్పాలంటున్నారు ఈ.ఎన్ .టీ నిపుణులు. రాత్రి వేళ హాయిగా నిద్రలోకి జారుకోవాలి అనుకుంటాం కానీ ఈ శబ్దాల వలన ప్రతి రాత్రీ జాగారమే.
నిశ్శబ్దంగా ఉండే రాత్రివేళ చెవుల్లో ఒకటే మోత. ఇది రోజంతా ఉండే సమస్యే. కాకపోతే ఆ చప్పుడు పగలంతా బయటి శబ్దాలతో కలిసిపోయి అంతగా ఇబ్బంది పెట్టకపోయినా రాత్రయ్యేసరికి చెవుల్లో స్పష్టంగా వినిపిస్తూ నిద్రకు దూరం చేస్తుంది. కొందరికి కాసేపు మాత్రమే ఉండొచ్చు.
బెడ్రూమ్ లో ఫ్యాన్ శబ్దం చేస్తుంటే దాన్ని రిపేర్ చేయించేదాకా మనం నిద్రపోలేం. అలాంటిది చెవిలో ఎవరో తిష్టవేసుకుని కూర్చుని చేస్తున్నట్టుండే శబ్దాల్ని భరించగలమా? చాలా కష్టం. పిచ్చెక్కినట్టుంది.
టిన్నిటస్ కు చెవిలోని వేర్వేరు ప్రదేశాల్లో తలెత్తే సమస్యలే కారణం.
కొందరికి వెలుపలి, మధ్య చెవిలో సమస్యలుండవచ్చు. దీన్ని ‘కండక్టివ్ డెఫినెస్’ అంటారు. కొందరికి లోపలి చెవిలో సమస్య ఉండొచ్చు. ఇది చెవి లోపలి నరానికి సంబంధించిన ‘నర్వ్ డెఫ్సస్’ సమస్య. ఈ రెండు సమస్యల్లో చెవిలో శబ్దాలు వినిపిస్తాయి.
వ్యాక్స్ పేరుకుపోవటం … మధ్య చెవిలో ద్రవం చేరుకోవటం … మధ్య చెవిలో నీరు లేదా చిక్కని జెల్లీలాంటి పదార్ధం చేరుకోవటం… కర్ణభేరి వెనక ఉండే మూడింటిలో ఒక ఎముక కదలకుండా ఉండిపోవటం .. తీవ్రమైన వ్యాధుల్లో ఇచ్చే స్టిరాయిడ్స్, యాంటిబయాటిక్స్ దుష్ప్రభావాలు కేన్సర్ లో ఇచ్చే కీమోథెరపీ, రేడియో థెరపీ సైడ్ ఎఫెక్ట్స్ వంటి కారణాలతో ఈ శబ్దాలు వినిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మేనరికపు వివాహాలు వంశపారంపర్యంగా గర్భిణిగా ఉన్న సమయంలో రూబెల్లా ఇన్ ఫెక్షన్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ను నిర్లక్ష్యం చేయటం వల్ల కర్ణభేరికి రంధ్రమై చీము చేరటం..ముక్కు వెనక క్యాన్సర్ గడ్డలు, కర్ణభేరి వెనక చర్మపు తిత్తి ఏర్పడటం, దవడ జాయింట్ ప్రాబ్లమ్, మెదడు వాపు, గవద బిళ్లలు, నెలలు నిండకుండా పుట్టటం, ఇంటెన్సివ్ కేర్ లో ఎక్కువ కాలం పాటు ఉండటం కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు.
ఇలాంటి సమస్యలుంటే డాక్టర్లు వివిధ పరీక్షల ద్వారా చెవిలో ఏం జరుగుతుందో కనుక్కుంటారు. అవసరమైన చికిత్స లు అందిస్తారు. అయితే సమస్య ముదర పెట్టుకోకుండా వైద్య నిపుణులను సంప్రదించాలి.