ఓదార్పు లేని జీవితాల విషాద గీతం!

Sharing is Caring...

Research document……………………….

వెంకట్ సిద్దారెడ్డి ఒక బ్రిలియంట్ రైటర్. ‘తానా’ నవలల పోటీలో లక్షరూపాయలు గెలుచుకున్న బండి నారాయణస్వామి ‘అర్థనారి’కి సిద్దారెడ్డి రాసిన ముందుమాట ఇది. ఇది foreword కాదు, ఒక research document. నాకు నచ్చింది. మీకూ నచ్చుతుంది. మనం కొజ్జావాళ్ళు, పాయింట్ ఫైవ్ గాళ్ళు అని నీచంగా మాట్లాడుకునే అర్థనారిల అసలు జీవీతాలను మన కళ్ళముందు బండి నారాయణస్వామి పరిచిన తీరు ఒక అద్భుతం, సిద్ధారెడ్డి విశ్లేషణ అరుదైనది, చదవండి.
‘అర్థనారి’ ని అనంతపురం దేవుడు ఫాదర్ ఫెర్రర్ కి అంకితం ఇస్తూ, “నీ సేవాదాహాన్ని తీర్చుకోడానికి నీకో ఎడారి కావాల్సి వచ్చిందా ఫాదర్ ఫెర్రర్” అన్నారు నారాయణస్వామి.
Taadi  Prakash

——-

ఓదార్పు లేని జీవితాల విషాద గీతం by  Venkat Siddareddy

మనిషి జీవితాన్ని పూర్తిగా ప్రతిబింబించగలిగింది సాహిత్యం . మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకునే మార్గం సాహిత్యం . ఒక మనిషిగా ఉండడమంటే ఏమిటి? అనే ప్రశ్నను అన్వేషించే సాధనం సాహిత్యం . సమాజంలోని అనేక రకాల ఆలోచనలు, ఆందోళనల గురించి సాటి మనుషులతో సంభాషించడానికి మార్గం సాహిత్యం . వ్యక్తులు, సమాజాలు, సంఘటనలు, సంస్కృతిని అర్థం చేసుకోడానికి ఉపయోగపడే సాధనం సాహిత్యం. చరిత్రలోకి, భవిష్యత్తులోకి తొంగిచూడగల కాలయంత్రం సాహిత్యం .

సాహిత్యంలో నవల అనే ప్రక్రియకు అత్యున్నత ప్రాముఖ్యత ఉంది. రచయితardh ఆలోచనలను పూర్తిగా వ్యక్తీకరించే స్వేచ్ఛ నవల ద్వారానే సాధ్యమవుతుంది. కానీ ఈ ఆధునిక యుగంలో – ముఖ్యంగా తెలుగు సమాజంలో నవల అనే ప్రక్రియ పూర్తిగా మరుగున పడిపోతుందేమో అనే భయం నెలకొన్న రోజుల్లో, తానా (TANA), ఆటా (ATA) సంస్థలు నిర్వహిస్తున్న నవలల పోటీల కారణంగా తెలుగు సాహిత్యంలో ‘నవల’ మళ్ళీ చిగురు తొడిగిందనేది నిజం. 

ముఖ్యంగా 2018లో తానా బహుమతి పొందిన నవల ‘శప్తభూమి’ ద్వారా, నవల అనే ప్రక్రియ మీద సరికొత్త ఆసక్తి మొదలైందని చెప్పొచ్చు. తెలుగు నవలకు కొత్త ఊపిరి పోసిన నవల ‘శప్తభూమి’. బండి నారాయణ స్వామికి కేంద్ర సాహిత్య ఎకాడమీ అవార్డ్ తెచ్చిన నవల ఇది. ఎంతో మంది సినిమా దర్శకులు, నిర్మాతలు హక్కులు కొనాలని పోటీ పడ్డ నవల కూడా ఇదే.ఇంతటి  ప్రతిష్ట సాధించిన నవల రాసిన తర్వాత ఆ రచయిత తర్వాత ఏం రాస్తాడనే కుతూహలం పాఠకుల్లో ఉండడం సహజం. నేను కూడా అలా ఎదురుచూస్తూ ఉండగా నా చేతుల్లో వచ్చివాలిన పుస్తకం ‘అర్థనారి’.

***
ప్రాచీన భారతీయ సమాజం విభిన్న లైంగిక గుర్తింపులు, లైంగిక ప్రవర్తనలపై కొంత ఎరుక కలిగి ఉంది. మన పురాణాలు, ఇతిహాసాలను పరిశీలించినట్టయితే ఈ విషయాల పట్ల, ప్రాచీన సమాజంలో గత కొన్నేళ్ళుగా ఉన్నటువంటి దారుణమైన పరిస్థితులు లేవేమో అనిపిస్తుంది. ‘కామసూత్ర’ లో స్వలింగ సంపర్క ప్రస్తావన ఉంది. అర్థశాస్త్రంలో స్వలింగ సంపర్కాన్ని నేరం కింద పరిగణించారు. మనుస్మృతిలోనూ స్వలింగ సంపర్కాన్ని చిన్నపాటి నేరంగానే ప్రస్తావించబడింది.

‘స్కంధపురాణం’, ‘సుశ్రుత సంహిత’ లో కూడా స్వలింగ సంపర్కం గురించి ప్రస్తావన ఉంది. తమిళ కావ్యాలైన ‘సిలప్పదికారం’, ‘మణిమేఖలై’లలో కూడా మగ, ఆడ కాని తృతీయ ప్రకృతికి చెందిన వ్యక్తుల ప్రస్తావన ఉంది. మహాభారతంలో అర్జునుడు కొన్నాళ్ళపాటు ఆడదానిగా బతకాలనే శాపం కారణంగా బృహన్నలగా మారడం, విష్ణుమూర్తి మోహిని అవతారమెత్తడం , వాలి, సుగ్రీవుల జననం, శిఖండి/శిఖండిని వంటి పాత్రలను, కథాంశాలను పరిశీలిస్తే అప్పట్లోనే విభిన్న లైంగికితల గురించి ప్రస్తావన మన పురాణాల్లో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పట్లో ఇటువంటి అంశాల పట్ల పూర్తి అంగీకారం లేదనే విషయాన్ని పక్కన పెడితే, జెండర్ ఫ్లుయిడిటీ అనే అంశం పై మాత్రం అవగాహన ఉందని తెలుస్తుంది.

హిందూ, బౌద్ధ మత గ్రంధాల్లో స్త్రీ లింగం, పుంలింగం తో పాటు నపుంసక లింగమనే మూడవ లింగ ప్రస్తావన ఎప్పట్నుంచో ఉంది. జైన మతంలోనైతే స్త్రీనపుంసక, పురుష నపుంసక అనే మరో రెండు లైంగికతల ప్రస్తావన కూడా ఉంది.అలాగే ఆధునిక భారతీయ సాహిత్యంలో కూడా విభిన్న లైంగికతల ప్రస్తావన కలిగిన ఎన్నో రచనలున్నాయి. బంకించంద్ర ఛటర్జీ రచన ‘ఇందిర, సూర్యకాంత్ త్రిపాఠి రచన ‘ఖుల్లీ బాత్’ నుంచి, ఈ మధ్యనే కన్నడంలో వచ్చిన వసుదేంధ్ర రచన ‘మోహన స్వామి’, అరుంధతి రాయ్ రచన ‘ది మినిస్ట్రీ ఆఫ్ ఎట్ మోస్ట్ హ్యాపీనెస్’ వరకూ విభిన్న లైంగిక గుర్తింపులు, లైంగిక ప్రవర్తనలపై వచ్చిన కథలే.

అయితే తెలుగులో ఇటువంటి ప్రయత్నాలేవీ పెద్దగా లేకపోవడం ఆశ్చర్యమే. అటు ప్రాచీన తెలుగు సాహిత్యంలోకానీ, ఆధునిక సాహిత్యంలో కానీ విభిన్న లైంగికతల ప్రస్తావన ఉన్న రచనలు తక్కువే. విశ్వనాధ సత్యనారాయణ కథ ‘ఇంకొక విధము’, కప్పగంతుల సత్యనారాయణ రాసిన ఒక కథలో కూడా స్వలింగ సంపర్కం గురించి చదివిన గుర్తుంది. ఇంద్రగంటి జానకీబాల ఇంకా కొంతమంది కూడా ఈ అంశాలతో కొన్ని కథలు రాసారు.

కానీ ఇవన్నీ కూడా స్వలింగ సంపర్కానికి సంబంధించినవే. మానస ఎండ్లూరి రాసిన ‘ఉల్పత్’ అనే కథలో మాత్రమే తెలుగులో ఒక హిజ్రా జీవితాన్ని చదివిన కథగా నాకు గుర్తుంది. నాకు తెలిసినంతవరకూ తెలుగులో హి జ్రా (Transgender)ల జీవితాల గురించి వచ్చిన నవలలు, కథలు ఒకటో రెండో తప్ప పెద్ద లేవనే అనుకుంటున్నాను.
ఇటువంటి సందర్భంలో బండి నారాయణ స్వామి లాంటి పేరు ప్రఖ్యాతలు కలిగిన రచయిత,
హిజ్రాల జీవితాన్ని ప్రధానాంశంగా తీసుకుని, వారి జీవితాలను, ఆ జీవితాల్లోని అత్యంత దయనీయమైన పరిస్థితులను, విషాదాన్ని ఎంతో హృద్యంగా చిత్రీకరిస్తూ రూపొందించిన Modern Masterpiece – అర్థనారి.

చరిత్రలోకి మనం తొంగిచూసినట్టయితే, తృతీయ ప్రకృతి కలిగిన వారిని ఇప్పుడు మనం ‘
హిజ్రా’ అని సంబోధించడం, ఇస్లామిక్ సామ్రాజ్యవాదుల ద్వారానే మొదలైంది. అప్పట్లో హిజ్రాలు ముఖ్యంగా మహారాజుల కోట గోడల మధ్య బానిసలుగా ఉంటూనే, ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండేవారు. హిజ్రాల వల్ల రాజవంశపు స్త్రీలు గర్భం దాల్చలేరు. అలాగే హిజ్రాలలో ఉండే సాధారణ ‘పురుష’ లక్షణం కారణంగా వారు రాజవంశపు స్త్రీలకు రక్షణగా కూడా ఉండగలరు. ఈ రెండు కారణాల చేత రాజాస్థానంలో పోషకులకు విశ్వసనీయమైన సేవకులుగా ఉండేవారు హిజ్రాలు.

అయితే ఈ పరిస్థుతుల్లో మార్పు రావడానికి కారణం – యూరోపియన్ కాలనైజేషన్. 18వ శతాబ్దపు రోజుల్లో స్వలింగ సంపర్కం ‘నేరం’గా ప్రకటించించబడింది. అంతేకాకుండా అప్పటివరకూ లైంగికతలో ఉన్న ద్రవత్వాన్ని(fluidity) రద్దు చేసి ‘సహజమైన’ లైంగికత, ‘అసహజమైన’ లైంగికత అని రెండుగా విభజించి, అసహజమైన లైంగికత నేరంగా ప్రకటించబడింది. బహుశా అప్పట్నుంచే హిజ్రాలు, స్వలింగ సంపర్కులంటే ప్రజలకు ఏహ్యభావం కలిగేలే చేసిందనేది చాలామంది పరిశోధకుల అభిప్రాయం.

గతకొన్ని దశాబ్దాలుగా ఉధృతమైన LGBTQ ఉద్యమాల ద్వారా, గే, లెజ్బియన్ సంబంధాలకు కొంతవరకూ ఇప్పుడు సమాజంలో అంగీకారం దొరికింది. కాకపోతే అది ముఖ్యంగా ఉన్నతవర్గాలకు సంబంధించిన అంశంగానే పరిగణించబడుతోంది. దిగువ, మధ్యతరగతి కుటుంబాల్లో ఇటువంటి సంబంధాల గురించి మాట్లాడడం కూడా ఇప్పటికే నేరమే. అయితే ట్రాన్స్ జెండర్స్ గురించి మాట్లాడడం, బహిరంగంగా బయటకు రావడం అనేది తప్పనిసరి అంశం. ఎందుకంటే ఈ తృతీయ ప్రకృతి దాచుకుంటే దాగే అంశం కాదు. అందుకే హిజ్రాలు మనకి తరచూ తారసపడుతుంటారు.

ప్రజల హేళనకు, వారి ఛీత్కారానికి బలవుతుంటారు. మన దైనందిన జీవితంలో తరచూ తారసపడే ఈ తృతీయ ప్రకృతి కలిగిన జీవుల గురించి వచ్చిన సాహిత్యం తెలుగులోనే కాదు, మొత్తం దేశంలోనే చాలా తక్కువ. తమిళంలో హిజ్రాల జీవిత చరిత్రలతో కొన్ని పుస్తకాలు వచ్చాయి. రేవతి రాసిన ‘ఒక హిజ్రా ఆత్మకథ’, విద్య అనే మరో హిజ్రా రాసిన ‘ఐ యాం విద్య’, ప్రియ బాబు అనే హిజ్రా రాసిన ‘నాన్ శరవణన్ అల్ల’ జీవిత చరిత్రలతోపాటు సముతిరం రాసిన నవల ‘వాడమల్లి’ కూడా అరవాణి (హిజ్రా)ల జీవితానికి సంబంధించనదే.

2017లో అరుంధతి రాయ్ రాసిన The Ministry of Utmost Happiness అనే నవలలో ప్రధాన పాత్రధారి అయిన అంజుమ్ ఒక ముస్లిం కుటుంబానికి చెందిన హిజ్రా. సాధారణంగానే హిజ్రాలంటే తెలియకుండానే ఒకరకమైన ఏహ్యభావాన్ని కలుగచేసే విధంగా సమాజం మన మనసులను కండిషనింగ్ చేసిఉండడం వల్లనేమో వీరి జీవితాలను ఎవరూ పట్టించుకోరన్నది నిజం. వారిని చూస్తేనే ఆమడ దూరం పారిపోతాం. అటువంటి జీవితాలను కథావస్తువుగా మలిచి, దాన్ని ఈ సమాజానికి ఆమోదయోగ్యంగా అందచేయడమంటే కత్తిమీద సాములాంటిది.

హిజ్రా కమ్యూనిటీ మీద ప్రజలకు ఉన్న చిన్నచూపు కారణంగా, వారి జీవితాల ఆధారంగా వచ్చిన నవల చదవించడం అనేది చాలా కష్టమైన పని. కానీ ‘అర్థనారి’లో రచయిత బండి నారాయణ స్వామి ఈ ఫీట్ ని ఎంతో సునాయాసంగా చేయగలిగారు. బండి నారాయణ స్వామి రాసిన ‘శప్తభూమి’ లాంటి చారిత్రక నవలలో సైతం లైంగిక సంబంధాల గురించి, వాటి పర్యవసనాలు, వ్యక్తి పరంగానే కాకుండా సామాజికంగానూ ప్రకంపనలు కలుగచేసే విధానాన్ని ఎంతో నేర్పుగా ప్రకటించారు.

‘అర్థనారి’ నవలలో లైంగింకత, మానవ లైంగిక సంబంధాలే ప్రధాన అంశం. అప్పట్లో ‘శప్తభూమి’ వచ్చినప్పుడు, పుస్తకంలోని కొన్ని సన్నివేశాలను ‘పోర్న్ – బూతు’ గా కొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే ఈ పుస్తకంలోని ఇద్దరు ప్రధాన పాత్రల్లో ఒకరు హిజ్రా అయితే మరొకరు వేశ్య. వీరిద్దరి జీవితాలు లైంగిక వేధింపుల చుట్టూనే నడుస్తుంది. మరి ఈసారి కూడా పాఠకులు (కొంతమందైనా) ఈ సాహిత్యాన్ని దిగువస్థాయి బూతు సాహిత్యంగా పరిగణిస్తారా? అనే అనుమానం నాకు తట్టకపోలేదు. అయితే ఇక్కడే రచయితగా బండి నారాయణ స్వామి తన అద్భుతమైన ప్రతిభను మన కళ్ళముందుంచుతారు.

ఈ సందర్భంలో మనం రెండు సినిమాల గురించి చర్చించుకోవాలి. ఒకటి తమిళంలో వచ్చిన ‘సూపర్ డీలక్స్’. మరొకటి అర్జెంటీనా నుంచి వచ్చిన ‘XXY’ అనే సినిమా. ‘సూపర్ డీలక్స్ సినిమాలోని మూడు కథల్లో ఒకటి – ఎప్పుడో ఇంట్లో నుంచి పారిపోయిన ఒక మగాడు,హిజ్రాగా ఇంటికి తిరిగిరావడం, ఈ పాత్రలో విజయ్ సేతుపతి అద్భుతంగా నటించాడు. ‘XYY’ కథలో పదిహేనేళ్ల అలెక్స్ తనకి పురుష, స్త్రీ జననేంద్రియాలు రెండూ ఉన్నాయని తెలుసుకుంటాడు.
ఈ రెండు కథలు కుటుంబ ప్రధానమైన కథలు. విభిన్న లైంగికత కలిగి ఉండడం వ్యక్తిగత సమస్యే. కానీ అది కుటుంబ సమస్య అయినప్పుడు, ఆ కుటుంబాల్లో జరిగే సంఘర్షణ ఈ కథల్లో ప్రధాన అంశం. అందుకే ఈ రెండు సినిమాల అత్యంత ప్రజాధరణ పొందాయి.

బండి నారాయణ స్వామి ‘అర్థనారి’లో ఈ టెక్నిక్నే అవలంబించారనిపించింది. ఇది ఒక హిజ్రా జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల ప్రధానంగా నడిచే కథైనప్పటికీ, ఇందులో అద్భుతమైన ప్రేమ కథ ఉంది. విడదీయలేనంత స్నేహ సంబంధాలున్నాయి. అన్నింటికీ మించి ఒక కుటుంబ నేపథ్యముంది. ఒక విధంగా చూస్తే ఈ అంశాల వల్లనే, ఈ కథ అందరికీ నచ్చుతుంది. ఒక విధంగా, ఇటువంటి పరిస్థుతులే మనకి వచ్చినప్పుడు మనం ఇలాంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే చెప్తుంది. ముఖ్యంగా మారుతున్న ఈ సమాజంలో మనం ఏం చేయాలో కాదు, ఏం చేయకూడదో అనే విషయంలో మనం చాలా విషయాలు తెలుసుకుంటాం..

“దొంగతనం చేయరాదు అనేది సమాజపపు విలువ. ఆ విలువ షావుకారు సంపదను బద్రంగా కాపాడానికి పనికి వస్తుంది. కానీ పేదవాడి ఆకలి తీరడానికి పనికి రాదు.” అని ఈ నవలలో బండి నారాయణ స్వామి అంటారు. అలాగే, “శీలం కూడా ఒక సామాజిక విలువ,” అనడంలో ఈ నవల మొత్తం సమ్మరైజ్ అవుతుంది. ఫొకాల్ట్ అనే ఫ్రెంచ్ తత్వవేత్త తన పుస్తకం, “The History of Sexuality” లో కూడా ఇదే మాటంటారు – “Sexuality is a social construct that makes our bodies easier to control.”

‘అర్థనారి’లో రచయిత బండి నారాయణ స్వామి తాపత్రయమంతా ఇదే! జన్యుపరంగా తనకి సంక్రమించిన లైంగికతను, స్వతంత్రంగా అనుభవించే హక్కు తమకు ఎందుకు లేకుండా పోయిందనే స్పృహ కూడా రానివ్వకుండా, వచ్చిన ప్రశ్నించలేని జీవితాలు గడుపుతున్న హి జ్రాల దీనమైన జీవితాల కథ ఇది. మరోవైపు, ఏ సమాజమైతే వీరిని హీనంగా చూస్తుందో, అదే సమాజంలోని వ్యక్తుల లైంగిక వ్రపర్తనలను, వారి ద్వంద స్వభావాన్ని చూపెడుతూ, ఒక సమాజంగా మనం ఎంత వికృతంగా ప్రవర్తిస్తున్నామో ూడా ఈ నవల మన మనస్తత్వాలకు అద్దం పడుతుంది.

లైంగికత అనేది ఇప్పటికీ చర్చనీయాంశమే. అది జన్యుపరమైనదా? లేదా మన ఇష్టానికి సంబంధించినదా? అనే చర్చ ఎప్పటికీ తేలదు. ఈ విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కానీ వ్యక్తిగా మన ఆలోచనలను, ఒక సమాజంగా మనం కొన్ని సమూహాలను నిర్వచించే విధానాలను మార్చవలసిన అవసరాన్ని గుర్తుచేసే నవల ఇది. అన్నింటికంటే ముఖ్యంగా, సమాజపు విలువల పేరుతో మనం అణగదొక్కిన సమూహాల దృష్టికోణంలో – మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఎంత దూరం వచ్చాం ? చీకటి బారిన వారి జీవితాల్లో వెలుగు నింపడానికి ఇంకా ఎక్కడి వరకూ వెళ్లాలి? అనే విభిన్నమైన ప్రశ్నలు మనల్ని మనమే విభిన్న ప్రశ్నలు అడుక్కోవాలని ఈ నవల తెలియచేస్తుంది.

మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడో, రైలులో ప్రయాణిస్తున్నప్పుడో మనకి నిత్యం కనిపించే హిజ్రాలను, ఈ పుస్తకం చదివిన తర్వాత మనం చూసే చూపు మారిపోతుంది. వారి జీవితాల్లోని విషాదం మనల్ని కలిచివేస్తుంది, ఓదార్పేలేని వారి జీవితాల విషాదం మన కళ్ళముందు మెదుల్తుంది. సాటి మనిషిగా కూడా గుర్తింపుకు రాని వారి కష్టం మనకి తెలిసివస్తుంది. కేవలం ‘అర్థనారి’ అనే ఈ ఒక్క పుస్తకం వల్లనే తెలుగు సమాజంలో ఒక మార్పు కలుగచేస్తుందనే నమ్మకం నాకుంది.

హిజ్రాలు, స్వలింగసంపర్కులు, భిన్న లైంగికత కలిగిన వారు, తమ అస్తిత్వాన్ని గౌరవ ప్రదంగా చాటుకునే అవకాశం ఇప్పుడిప్పుడే మొదలైంది. అటువంటి సందర్భంలో తెలుగులో ‘అర్థనారి’ లాంటి నవల రావడం చాలా అవసరం.
ఒక మంచి పుస్తకం చదవడమంటే మనల్ని మనం శుభ్రం చేసుకోవడమే అని నా అభిప్రాయం. మనలోని మలినాన్ని కడిగేసే శక్తి ఒక మంచి పుస్తకానికి ఉంటుంది. ‘అర్థనారి’ పుస్తకం చదవడం అలాంటి ఒక చర్య అని నేను నమ్మకంగా చెప్పగలను.

ఈ నవలలో గొప్ప కథలన్నాయి. అంతకుమించి అద్భుతమైన కథనం ఉంది. కథ మొత్తం మన కళ్ళముందు కదలాడే విజువల్ నెరేటివ్ ఈ పుస్తకం ప్రత్యేకత.ఈ వ్యాస రచన కోసం నేను చాలా పుస్తకాలు చదివాను. అందులో ముఖ్యంగా చదివిన పుస్తకం – “Same-Sex Love in India – Reading from Literature and History”. రూత్ వనిత, సలీమ్ కిద్వా య్ సంకలనం చేసిన ఈ పుస్తకంలో భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి వచ్చిన స్వలింగ సంపర్కుల కథల గురించి రాస్తూ, ఈ సంకలనం చేర్చడానికి మాకు తెలుగు సాహిత్యానికి సంబంధించి ఎటువంటి సమాచారం దొరకలేదని తెలిపారు సంపాదకులు.

ఆ విషయం చదివినప్పుడు ఒకింత విచారానికి గురయ్యాను. కానీ ఇంతలోనే, హిజ్రాల జీవితానికి సంబంధించి భారతదేశంలోనే అత్యుత్తమ కాల్పనిక సాహిత్యం ఇకపై మన తెలుగు నేలనుంచి వచ్చిన ‘అర్థనారి’ ఉంది కదా అని సంతోషమూ కలిగింది. నా నమ్మకం నిజమైతే, ‘అర్థనారి’ తెలుగులో వచ్చిన ఆధునిక నవలల్లో అత్యుత్తమ నవలగా నిలవడమే కాదు, ఈ నవల అన్ని భారతీయ భాషల్లోకి అనువదింపబడి ఒక మాడర్న్ క్లాసిక్ గా నిలుస్తుంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!